సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీకి భారత్ స్టేజ్(బీఎస్)–6 గండం పొంచి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఎస్–4 వాహనాలు తిరుగుతున్నాయి. బీఎస్–5కు వెళ్లకుండా కాలుష్య నియంత్రణ కోసం ఏకంగా బీఎస్–6 వాహనాలనే ఉపయోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మార్చి 31వ తేదీ వరకే పాత వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని, పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లను అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సులకు రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమైంది.
కొత్త బస్సులను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఛాసిస్‌లను కొనుగోలు చేస్తారు. అప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తేనే శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రవాణా శాఖ చేపడుతుంది. దీంతో ఆర్టీసీ కొనుగోలు చేసిన 300 కొత్త బస్సులకు వెంటనే బాడీ బిల్డింగ్ పూర్తి చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి బస్ బాడీ బిల్డింగ్ కార్మికులను పిలిపించాలని నిర్ణయించారు. ఒకవేళ అన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ పూర్తి కాకుంటే ఏం చేయాలన్న దానిపై ఆర్టీసీ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 2020 డిసెంబరు 31 నాటికి తొలి దశలో కాలం చెల్లిన 1,000 బస్సులను మార్చాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. వీటి స్థానంలో కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నెలన్నర కిందటే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినా.. 1,000 బస్సులకు బాడీ బిల్డింగ్ చేయాలంటే వంద రోజుల దాకా సమయం పడుతుందని, శాశ్వత రిజిష్ట్రేషన్లు జరగవని భావించారు. అందుకే కొత్త బస్సులను 300కే పరిమితం చేశారు.
మార్చి 31లోగా శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తాం..
‘‘ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినందున 300 బస్సులనే కొనుగోలు చేశాం. వీటికి మార్చి 31వ తేదీలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పాత వాహనాలకు మార్చి 31వ తేదీ కంటే ముందే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లను శాశ్వత రిజిస్ట్రేషన్లుగా గుర్తించవచ్చని మధ్యప్రదేశ్‌లో బస్సుల కొనుగోలు అంశంలో సుప్రీంకోర్టు మౌఖికంగా పేర్కొన్నట్లు మాకు సమాచారం ఉంది. నిర్ణీత తేదీలోగా 300 బస్సులకు బాడీ బిల్డింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం’’
– మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీకి ‘బీఎస్–6’ గండం
Published Sat, Feb 29 2020 6:01 AM | Last Updated on Sat, Feb 29 2020 6:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment