పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే పరిమితం చేద్దామా..
మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం మల్లగుల్లాలు
రెండు రకాల ప్రతిపాదనలు సమర్పించిన ఆర్టీసీ
ఎన్నికల హామీని నీరుగార్చేందుకే
ప్రభుత్వ ఎత్తుగడ సాక్షి, అమరావతి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేయాలా వద్దా అనే అంశంపై సందిగ్థతతో కొట్టుమిట్టాడుతోంది.
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితంచేస్తే ఎలా ఉంటుంది?.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఎలా ఉంటుంది?.. అనే దానిపై తర్జనభర్జన పడుతోంది.
ప్రభుత్వ పెద్దల ఉద్దేశం గ్రహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ రెండు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అయినా.. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం.
ఎన్నికల హామీని నీరుగార్చేదెలా..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తామనే టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచి్చంది. దీని ప్రకారం.. అన్ని కేటగిరీల బస్సుల్లో ఉచితంగా అమలుచేయాలి. కానీ, ఈ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యత్నిస్తోంది.
అందుకే ఈ తరహా పథకాన్ని అమలుచేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పర్యటనల పేరుతో ఏడు నెలలుగా కాలయాపన చేసింది. ముందు అధికారుల బృందాలు పర్యటించి నివేదిక సమర్పించాయి. అయినాసరే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి మరోసారి పర్యటనలతో కాలం వెళ్లదీశారు. ఆగస్టు 15 నుంచి ఓసారి.. కాదు దసరా నుంచి అని మరోసారి చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి కూడా ఈ పథకాన్ని ప్రారంభించడంలేదని తాజాగా వెల్లడించి ఉగాదికి వాయిదా వేశారు. తీరా ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు రకాల ప్రతిపాదనలపై చర్చించడం గమనార్హం. కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే పరిమితంచేస్తే ఎంత భారంపడుతుంది.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అమలుచేస్తే ఎలా ఉంటుందని చర్చించారు.
ఆ మూడు రాష్ట్రాలు నిధుల కేటాయింపు ఇలా..
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో సహా అన్ని కేటగిరీల సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తున్నాయి. అందుకోసం ఏటా తమిళనాడు ప్రభుత్వం రూ.6,396 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.5,015 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4,084 కోట్లు కేటాయిస్తున్నాయి. కానీ, ఆ స్థాయిలో నిధుల కేటాయింపుపై టీడీపీ కూటమి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. అందుకే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది.
ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో పథకాన్ని అమలుచేయాలంటే..
» ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు: రూ.3,182 కోట్లు
» నెలకు కేటాయించాల్సింది : రూ.265 కోట్లు
» ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 8,193
» కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 2,045
» కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు : 11,479 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)
పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తే..
» ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు : రూ.2,122 కోట్లు
» నెలకు కేటాయించాల్సింది : రూ.177 కోట్లు
» ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 6,303
» కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 1,684
» కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు: 9,449 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)
Comments
Please login to add a commentAdd a comment