Free Travel
-
‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.ఎక్స్‌ప్రెస్ కన్నా కాస్త ఎక్కువ టికెట్ ధరతో.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వాటిల్లో టికెట్ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణగతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. -
లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా
2023 మార్చి నెలలో ఆర్టీసీకిరూ.528 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల రూపంలో వచ్చింది రూ.428 కోట్లు. ఆ నెలలో సంస్థకు అయిన మొత్తంఖర్చు రూ.605 కోట్లు. ఫలితంగా రూ.77 కోట్ల నష్టం నమోదైంది. 2024 మార్చి నెలలో సంస్థ నమోదు చేసుకున్న మొత్తం ఆదాయం 696 కోట్లు. ఇందులో టికెట్ల ద్వారా వచ్చింది రూ. 598 కోట్లు. మొత్తం వ్యయం రూ.552 కోట్లు. దీంతో రూ.144 కోట్ల ఆదాయం నమోదైంది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే అమలవుతున్నా ఆర్టీసీ జీరో టికెట్లు జారీ చేస్తోంది. అలా ప్రతినెలా జారీ అయ్యే మొత్తం జీరో టికెట్ల పూర్తి చార్జీని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. దీంతో దాన్ని ఆదాయంగానే భావిస్తోంది. ఫలితంగా నష్టాల ఆర్టీసీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చింది. నష్టం కనుమరుగై ఒకే నెలలో ఏకంగా రూ.144 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్టు తాజాగా లెక్కలు రూపొందించింది. మరి నిజంగా ఇది ఆర్టీసీ లాభాల ఫలితాలు అనుభవిస్తోందా..? వాస్తవం ఎలా ఉందంటే... మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా ఆ మొత్తాన్ని విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత జారీ అవుతున్న జీరో టికెట్ల మొత్తాన్ని పరిశీలిస్తే, సగటున ప్రతినెలా రూ.350 కోట్ల వరకు అవుతోంది. మార్చి నాటికి ప్రభుత్వం ఆ రూపంలో రూ.1400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు, ఆర్టీసీ ఇటీవల మరో కేసు విషయంలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కానీ, వరుసగా గత మూడు నెలల్లో ప్రభుత్వం రూ.285 కోట్లు, రూ.285 కోట్లు, రూ.275 కోట్లు చొప్పున విడుదల చేసింది. కానీ వీటిని మహాలక్ష్మి రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలో పేరుకుపోయిన బకాయిలుగానే సంస్థ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ, ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. మార్చి నెలతో చెల్లించిన మొత్తంతో ఆ బడ్జెట్ కేటాయింపులు క్లియర్ అయ్యాయి. దీంతో వాటిని బడ్జెట్ చెల్లింపులుగానే సంస్థ భావిస్తోంది. అదే నిజమైతే, మహాలక్ష్మి పథకం రూపంలో సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలా రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం జరిగితే సంస్థ మళ్లీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లాభాలు ఉత్తిత్తి లెక్కలే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లాభాలకు సంబంధించి కాగితాలపై చూపిన ఉత్తుత్తి లెక్కలుగా తేలిపోతోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ లాభాల తాలూకు ఫలితాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆర్టీసీకి సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి ఉన్నాయి. 2013 వేతన సవరణకు సంబంధించి ఉన్న బకాయిల్లో బాండ్ల తాలూకు చెల్లింపులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి నెలలో రూ.280 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వాటిల్లో కేవలం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే రూ.80 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ
సాక్షి, హైదరాబాద్: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఆందోళన ఎందుకంటే..? ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది. రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. డ్రైవర్ల కొరత ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్ చేసుకోవాలనీ ప్రతిపాదించారు. కానీ, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది. -
TS: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని నాగోల్‌కి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని.. జీవో 47 రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాకి పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. -
ఇది లేడీస్ సీటు లేవండి అన్నందుకు.. మమ్మల్నే కొట్టారు!
యాదగిరిగుట్ట: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత మహిళలు తమ కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అధికంగా వస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సికింద్రాబాద్‌కు చెందిన బండి నాని, మౌనిక దంపతులు తమ పిల్లలతో కలిసి యాదాద్రీశుడి దర్శనానికి ఉదయం వచ్చారు. శ్రీస్వామివారిని దర్శించుకొని సాయంత్రం 5గంటల సమయంలో తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులో నాని తన భార్య మౌనిక, పిల్లలతో కలిసి ఎక్కారు. ఇందులో మహిళల సీట్లలో పురుషులు కూర్చోవడంతో.. ఇది లేడిస్ సీటు.. మా పిల్లలు, భార్య కూర్చుంటుందని కొద్దిగా లేవండి అని ప్రయాణికులను కోరాడు. ఈ సమయంలో మహిళల సీటులో కూర్చున్న పురుషులు నానితో వాగ్వాదానికి దిగారు. ఆరుగురు ప్రయాణికులు నానితో పాటు ఆయన భార్య మౌనికలను తీవ్రంగా కొట్టారు. బస్సును డ్రైవర్, కండక్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి, కానిస్టేబుల్‌ను తీసుకువచ్చి గాయపడిన నాని, మౌనికలను సముదాయించారు. తనను కొట్టిన వ్యక్తులపై కేసు పెట్టమంటే.. తమనే దింపేసి వెళ్లిపోయారని నాని, మౌనిక వాపోయారు. ముఖానికి గాయమైన నానిని తన భార్య మౌనిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. -
భారం పడనీయం.. చార్జీలు పెంచం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి నిధుల కొరత రానీయబోమని.. ఎప్పటి కప్పుడు ఆర్టీసీకి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రయాణికులపై ఎలాంటి చార్జీల భారం మోపబోమని...సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వారిద్దరూ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి పెట్టాలని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. టీఎస్ ఆర్టీసీ ఆర్థిక అంశాలు, మహాలక్ష్మి పథకం అమలుతీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సంస్థ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ పథకం ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి..త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా..లాజిస్టిక్స్, వాణిజ్య, తదితర టికెటేతర ఆదాయంపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, కృష్ణకాంత్, ఆర్థిక సలహాదారు విజయపుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్‌లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. నగరంలోనా? వెలుపలా? ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి. వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్‌లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్‌లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు. 4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్‌గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్‌లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది. బస్స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్‌పై దృష్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్కు ఇబ్బంది పడకుండా టిమ్స్‌ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. -
‘మహాలక్ష్మి’కి భద్రత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది. రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సొంతంగానే సెక్యూరిటీ.. గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 60 కొత్త బస్సులు సిద్ధం మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది. -
100% మించిన ఆక్యుపెన్సీ రేషియో
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుండటంతో టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పోటెత్తటంతో రికార్డు స్థాయిలో 100.09% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కి.మీ.కు రూ.65.07 చొప్పున ఆదాయం నమో నమోదైంది. కిలోమీటరుకు నమోదయ్యే ఆదాయం ఆధారంగా ఆక్యుపెన్సీ రేషియోను లెక్కిస్తారు. రెండో శనివారం, ఆదివారం, క్రిస్మస్, బాక్సింగ్‌డే..ఇలా వరుస సెలవులు రావటంతో జనం ఊళ్ల బాట పట్టడంతో శనివారం ఒక్కరోజే 49,00,723 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండు, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్‌కూడలి తదితర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఒక్క ఎంజీబీఎస్ నుంచే దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. ఒక్క రోజులో రూ.21.24 కోట్ల ఆదాయం ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. పండగ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణించటం ద్వారా రూ.20 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. సాధారణ రోజుల్లో అయితే, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం కాకుండా, సంక్రాంతి, దసరా లాంటి పండగ సెలవులు లేనప్పటికీ శనివారం ఏకంగా రూ.21.24 కోట్ల ఆదాయం నమోదు కావటం విశేషం. క్రమంగా జనం పోటెత్తుతుండటంతో బస్సుల సంఖ్యను పెంచటంతోపాటు సిబ్బందిని ముఖ్య ప్రాంతాల్లో ఉంచి మానిటరింగ్ చేశారు. శనివారం ఒక్కరోజే సూపర్‌లగ్జరీ, డీలక్స్, గరుడ, రాజధాని బస్సులు రద్దీగా మారాయి. ఎక్కువ చార్జి ఉండే సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో సీట్లు నిండిపోవటంతో భారీగా ఆదాయం నమోదైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఒక్కో గరుడ బస్సులో ట్రిప్పునకు రూ.లక్షన్నర చొప్పున ఆదాయం లభించింది. దీంతో ఆదాయం గరిష్ట స్థాయిలో నమోదై ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు కారణమైంది. -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
97 డిపోలకు గాను 96 లాభాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు పెరగడంతో దశాబ్దం తర్వాత సంస్థ లాభాలను ఆర్జిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలి్పంచడంతో, వారి రూపంలో కోల్పోయే మొత్తాన్ని ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్ చేస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లెక్కలు ఖరారు చేశారు. గత సోమవారం (డిసెంబర్ 18) ఒక్కరోజే రూ.21.11 కోట్ల ఆదాయం నమోదైంది. ఈనెలలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే, సోమవారం ఏకంగా 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం చవిచూసింది. ఇలా 96 డిపోలు లాభాల్లోకి రావటం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్‌టైం రికార్డుగా నిలిచింది. డిసెంబరులో ఇప్పటివరకు 49 డిపోలు లాభాలు ఆర్జించాయి. దీంతో ఈనెల మొత్తానికి రూ.3.14 కోట్ల లాభం నమోదవుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలా ఒక నెల మొత్తానికి లాభాలు నమోదవడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. బస్సుల్లో సాధారణ రోజుల్లో కంటే సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. జీరో టికెట్ల జారీ మొదలైన తర్వాత తొలి సోమవారం (18వ తేదీ) 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు తేలింది. సోమవారం 30.12 లక్షల జీరో టికెట్లు (మహిళలకు ఇచ్చేవి) జారీ అయ్యాయి. కొత్త ఉత్సాహం కొన్ని డిపోలు సోమవారం ఒక్కరోజే 14 లక్షలకు మించి లాభాలు ఆర్జించటం విశేషం. ఒక్కో డిపో రోజుకు ఐదారు లక్షల నష్టాలను చవిచూసే పరిస్థితికి అలవాటుపడ్డ ఆర్టీసీకి తాజా లెక్కలు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం హనుమ కొండ డిపో రూ.14.10 లక్షలు, దేవరకొండ డిపో రూ.13.94 లక్షలు, మహబూబ్‌నగర్ డిపో రూ. 13.61 లక్షలు, హైదరాబాద్–1 డిపో రూ. 13.55 లక్షలు.. ఇలా పలు డిపోలు భారీ లాభాలు నమో దు చేసుకున్నాయి. ఒక్క కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం పొందటంతో మొత్తం డిపోల జాబితాలో నష్టాలు పొందిన ఏకైక డిపోగా మిగిలింది. 450కు మించి టికెట్ల జారీ సాధారణంగా జిల్లా సర్విసుల్లో ఒక కండక్టర్ గరిష్టంగా 300 వరకు టికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వాటిల్లో 450కి మించి టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నా.. వారు ఎక్కడి వరకు ప్రయాణిస్తారో తెలుసుకోవడం, వారు తెలంగాణ నివాసితులా కాదా అని ధ్రువపత్రాలు పరిశీలించడం లాంటి వాటి వల్ల టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. -
‘మండే’ మహాలక్ష్మి@ 31లక్షలు
‘‘సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సుల్లో 51 లక్షల మంది ప్రయాణించారు... ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఒక రికార్డు... అందులోనూ మహిళల సంఖ్య 31 లక్షలు ఉండటం కనీవినీ ఎరుగని రికార్డు’’ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాకే ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో ఇలా నిండిపోతున్నాయి. సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు గార్యంటీల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో వాస్తవరద్దీ ఎంత ఉంటుందో అంచనా వేయటం కష్టం. సాధారణ రోజుల్లో కంటే సోమవారాల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆరోజు దాదాపు 35 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తారు. సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 28 లక్షల మేర ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.14 లక్షలుంటే, సోమవారాల్లో రూ.18 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది 11వ తేదీ సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 51 లక్షల మంది ప్రయాణించినట్టు ఆర్టీసీ లెక్క తేల్చింది. ఇందులో టికెట్ తీసుకున్న ప్రయాణికుల సంఖ్య 20.87 లక్షలుగా పేర్కొంది. అంటే మిగతావారు మహిళలే అని స్పష్టమవుతోంది. ఒక్కరోజే రూ.7 కోట్లు తగ్గిన ఆదాయం: సోమవారాల్లో రద్దీకి అనుగుణంగా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. సగటున రూ.18.50 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ సోమవారం ప్రయాణికుల సంఖ్య 51 లక్షలు నమోదైనందున ఆదాయం కూడా భారీగానే పెరగాలి. కానీ ఇందులో మహిళల సంఖ్య 60 శాతానికి పైగా ఉన్నందున ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వారి నుంచి నయా పైసా ఆదాయం రాలేదు. దీంతో ఈ సోమవారం కేవలం రూ.11.74 కోట్ల ఆదాయం మాత్రమే రికార్డయ్యింది. జీరో టికెట్ విధానం వస్తేనే కచ్చితమైన లెక్కలు మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమే అయినా, టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తారో ఆ వివరాలతో కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. టికెట్‌పై చార్జీ స్థానంలో సున్నా అని ఉంటుంది. కానీ, వాస్తవానికి వారి నుంచి ఎంతచార్జీ వసూలు చేయాల్సి ఉందో ఆ టికెట్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. నెల ముగియగానే ఆ టికెట్ల మొత్తాన్ని గుణించి ప్రభుత్వానికి అందిస్తే అక్కడి నుంచి రీయింబర్స్ అవుతుంది. ప్రస్తుతం టికెట్ జారీ యంత్రాల సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ కానందున జీరో టికెట్ జారీ కావటం లేదు. మహిళల సంఖ్య కండక్టర్లు మాన్యువల్‌గా లెక్కించి రాస్తున్నారు. దీంతో వారి సంఖ్యలో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. -
బస్సుల్లో మహిళల రద్దీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించడంపై చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్నందున.. కిక్కిరిసి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ముందే ఊహించారు. కీలక ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమీక్షించారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో రద్దీపై స్పష్టత ఉండదని.. సోమవారం నుంచి ఉచిత ప్రయాణ ప్రభావం ఎంతనేది తెలుస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాయింట్ల వద్ద సోమవారం అదనపు సిబ్బందిని పెట్టి బస్సులను, రద్దీని పర్యవేక్షించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించి.. అంతగా రద్దీ లేని రూట్ల నుంచి వాటివైపు బస్సులను మళ్లించాలని భావిస్తున్నారు. గుర్తింపు కార్డులు అడగకుండానే.. ఉచిత ప్రయాణ పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఉచితంగా ప్రయాణించాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ధ్రువపరిచే గుర్తింపు పత్రాలను కండక్టర్లకు చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఒక వారం రోజుల పాటు అలాంటి పత్రాల కోసం పట్టుబట్ట వద్దని, మహిళలందరినీ అనుమతించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజున ఎక్కడా గుర్తింపు కార్డులు అడగలేదు. అయితే ఎందరు ప్రయాణికులు, ఎంతెంత దూరం చొప్పున ప్రయాణించారన్న వివరాలను కండక్టర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేసుకున్నారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేసేవరకు జీరో టికెట్లు జారీ చేయాల్సి ఉండనుంది. జీరో టికెట్‌కు సంబంధించి టిమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం! ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సుల్లో వెళ్లేవారు ఆర్టీసీ బస్సులవైపు మళ్లారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిలోనూ కొందరు బస్సులెక్కారు. ఈ పథకం ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గితే కొంతమేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయలూ వస్తున్నాయి. మరోవైపు ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతున్నందున.. వీలైనంత తొందరలో కొత్త బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులు రోడ్డెక్కితే.. ఆర్టీసీ సర్విసులు పెరిగి ప్రైవేటు వాహనాల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. టీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. 1.30 గంటల సమయంలో అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. కర్ణాటకలో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నారు. సంస్థ ఈడీ మునిశేఖర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో రెండు బృందాలు గురువారం అక్కడ పథకాన్ని పరిశీలించి వచ్చాయి. వారు సమర్పించిన నివేదికపై శుక్రవారం ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ వెంటనే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వును రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ప్రయాణికుల్లో మహిళల వాటా 45 శాతం రాష్ట్ర వ్యాప్తంగా మినీ పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలవుతుంది. ఈ కేటగిరీలకు సంబంధించిన బస్సులు 7,292 ఉన్నాయి. వీటి ద్వారానే ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిల్లో నిత్యం దాదాపు 33 లక్షల మంది ప్రయాణిస్తారు. వీరిలో మహిళల వాటా దాదాపు 45శాతం. ఈ రూపంలో ఇంతకాలం ఆర్టీసీకి వస్తున్న ఆదాయం దాదాపు రూ. 2,200 కోట్ల నుంచి రూ.2,500 కోట్లు. కాగా ఈ ఆదాయం ఇప్పుడు నిలిచిపోనుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుందని, నష్టపోయే మొత్తం త్వరలో రూ.3 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నా రు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం రూపంలో ఆర్టీసీ నష్టపోయే మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది. తెలంగాణ మహిళలకే..: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ వెసులుబాటు రాష్ట్ర సరిహద్దు వరకే ఉంటుంది. సరిహద్దు దాటి ప్రయాణించే దూరానికి టికెట్ కొనాల్సి ఉంటుంది. బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధ మహిళలు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీరితోపాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ వెసులుబాటును కల్పించారు. తెలంగాణ ప్రాంత మహిళలు మాత్రమే ఈ వెసులుబాటు పొందేందుకు అర్హులు. అందుకోసం వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అని నిర్ధారించే ఆధార్‌కార్డు సహా ఇతర ధ్రువ పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపించాల్సి ఉంటుంది. తొలి వారం రోజులు మాత్రం ధ్రువపత్రంతో సంబంధం లేకుండా మహిళలందరినీ ఉచితంగా అనుమతిస్తారు. ఇక అర్హులైన వారందరికీ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులను జారీ చేస్తారు. అప్పుడు స్మార్ట్ కార్డ్ చూపితే సరిపోతుంది. స్మార్ట్ కార్డులు సిద్ధం అయ్యే వరకు జీరో టికెట్లను జారీ చేస్తారు. రోజుకు ఎన్ని జీరో టికెట్లు జారీ చేశారో లెక్కించి ప్రభుత్వానికి నివేదిస్తే, దాని ఆధారంగా రీయింబర్స్మెంట్ మొత్తం ఆర్టీసీకి అందుతుంది. జీరీ టికెట్లు జారీ ప్రారంభించేంతవరకు, బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్యను రోజువారీగా లెక్కించి నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త బస్సులు వచ్చే వరకు సమస్యే: కర్ణాటకలో ఈ పథకం ప్రారంభమైన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగి గందరగోళం నెలకొంది. కర్ణాటకతో పోలిస్తే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువ. అక్కడ బెంగళూరులోనే ఆయా కేటగిరీలకు చెందిన బస్సులు 5వేల వరకు ఉంటే, హైదరాబా ద్లో రెండున్నర వేలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రమంతటా ఇదే తరహా పరిస్థితి ఉండటంతో మహిళల రద్దీ పెరిగితే ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళల సంఖ్య పెరిగితే, పీక్ అవర్స్‌లో పురుషులు ప్రయాణించటం కష్టంగా మారే పక్షంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తామని సజ్జనార్ చెప్పారు. ఇప్పటికే బస్ పాస్‌లు తీసుకున్న మహిళలకు డబ్బులు వెనక్కివ్వబోమన్నారు. కొత్త బస్సులొస్తున్నాయ్: సజ్జనార్ ‘ఇటీవలే 776 కొత్త బస్సులు కొన్నాం. జిల్లాల్లో ఇతర కేటగిరీలో తిరిగిన బస్సుల్లో దాదాపు 1,000 వరకు కన్వర్షన్ ద్వారా సిటీ బస్సులుగా మార్చాం. త్వరలో 1,050 కొత్త బస్సులు కొంటున్నాం. మరో 1,000 వరకు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. అవసరమైతే మరిన్ని కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. ఆర్టీసీ ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని బస్సులు కొనేలా ఏర్పాట్లు చేస్తాం. ఇక డ్రైవర్ల అవసరం కూడా ఉన్నందున భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. ఈ గొప్ప పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తాం. ప్రజలు కూడా సహకరించాలి..’ అని ఎండీ సజ్జనార్ కోరారు. -
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం నుంచే (ఈనెల 9) అమల్లోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీనికి పచ్చజెండా ఊపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించి, దశలవారీగా పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రులు తెలిపారు. ఈ హామీలను దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించినట్టు వివరించారు. ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను ఐదేళ్లలోగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ముందుగా ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని బస్సుల్లో వెళ్లవచ్చని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చ జరిగిందని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘‘2014 నుంచి గురువారం (డిసెంబర్ 7వ తేదీ) వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత ఖర్చు చేశాయి? దేని కోసం, ఏం ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయి? ఆ ఖర్చులతో ఒనగూరిన ప్రయోజనాలేమిటన్న అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వివరాలు అందజేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు, చేకూరిన ప్రయోజనాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేలా అన్ని వివరాలు కావాలని అధికారులను ఆదేశించారు’’ అని మంత్రులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, గ్యారంటీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్–1, 2 పరీక్షల అంశంపైనా కేబినెట్ చర్చించినట్టు వివరించారు. నేడు విద్యుత్ అధికారులతో సమావేశం రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించినట్టు మంత్రులు వెల్లడించారు. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్ అంశానికి సంబంధించి చోటు చేసుకున్న తప్పుడు నిర్ణయాలపై చర్చించామని, ఆయా అంశాల్లో అధికారుల వివరణ కోరామని తె లిపారు. శుక్రవారం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, అధి కారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు. గత పదేళ్లలో విద్యుత్‌కు సంబంధించి అనేక అంశాల్లో తప్పులు జరిగాయని, వాటిని స మీక్షించి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుపైనా చర్చించనున్నట్టు వెల్లడించారు. 9న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుందని.. తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం–బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. -
బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సుల్లో నారీ శక్తి ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులో సీటు కోసం ఓ మహిళ వినూత్నంగా తన శక్తియుక్తులను ప్రదర్శించిన ఘటన జిల్లాలో జరిగింది. సోమవారం లింగసూగూరు బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు బస్సు రాగానే సీట్ల కోసం పోటాపోటీగా ఎగబడ్డారు. బాగల్కోటె నుంచి రాయచూకు వెళ్లే బస్సులో మహిళ బ్యాగ్ వేసినా సీటు దొరకదనే ఆందోళనతో మెదడుకు పని పెట్టారు. ఓ యువకున్ని వంగబెట్టి మరో మహిళ సాయంతో అతని వీపు పైకెక్కి కిటికీలో నుంచి బస్సులోకి దూరి సీటును దక్కించుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు అందరినీ అబ్బురపరిచాయి. -
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... అయితే, కొన్ని షరతులు
బనశంకరి: కాంగ్రెస్ సర్కారు ఐదు హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన)కు సర్కారు ఆమోదం తెలిపింది. నాలుగు రవాణా సంస్థలైన కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణాసంస్థల బస్సుల్లో (ఏసీ, స్లీపర్ బస్సులు కాకుండా) ప్రయాణానికి సోమవారం అనుమతించింది. విద్యార్థినులు, హిజ్రాలకు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత ప్రయాణం అమలులోకి వస్తుంది. శక్తి యోజన పథకంలో కొన్ని షరతులు ► రాష్ట్రంలో ప్రయాణానికి మాత్రమే శక్తి యోజన పథకం వర్తిస్తుంది ► విలాసవంతమైన లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు ► అన్ని బస్సుల్లో సగం సీట్లు పురుషులకు కేటాయించారు. అంటే సగం సీట్లలోనే మహిళలు ప్రయాణించాలి. సీట్లు అందుబాటులో లేకపోతే మరో బస్సును వెతుక్కోవాలి ► శక్తి స్మార్ట్స్ కార్డులను మహిళలకు ప్రభుత్వం జారీచేస్తుంది. మహిళలు సేవా సింధు కేంద్రాల్లో దరఖాస్తులు ఇచ్చి కార్డులను పొందవచ్చు. 3 నెలల్లో కార్డుల జారీని పూర్తి చేయాలి. ప్రయాణ సమయంలో ఆ కార్డులను చూపాలి. -
ఏపీ: టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం.. ఆర్టీసీలో విద్యార్థులకు ఫ్రీ ప్రయాణం
సాక్షి, విజయవాడ: ఏపీలో సోమవారం(ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగనున్నాయి. కాగా, పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఏపీ టెన్త్ పరీక్షలు 2023 మోడల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఇక, వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలి అని తెలిపారు. -
Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అదేరోజు 120 రూపాయలు ఉన్న డేపాస్...కేవలం 75 రూపాయలకే అందించాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 75 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు రెగ్యులర్‌గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్‌ను అందజేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆగస్టు 15న 75శాతం ఛార్జీలనే వసూలు చేస్తారు. అలాగే 18వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించి 7 వేల 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు మందులను అందించనున్నారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారికి 750 రూపాయలకే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు. చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్ -
యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి సర్కార్ తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. వివరాల ప్రకారం.. యూపీలో మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్ షిప్ట్‌లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది. ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి -
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
ఏపీ: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..) -
ఉచిత ప్రయాణం ..
సాక్షి కడప : ఇతర ప్రాంతాల నుంచి కడపకు విమానంలో వచ్చే వారికి నగరానికి ఎలా చేరుకోవాలన్న దిగులు ఇక నుంచి అవసరం లేదు.సోమవారం నుంచి ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి ఉచితంగా నగరానికి చేర్చాలని ట్రూ జెట్ సంస్థ భావించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిత్యం వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.ఎయిర్‌పోర్టు దగ్గర వాహనాలు లేక ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ట్రూజెట్ సంస్థ ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కడపకు చెందిన శ్రీ సాయి సాంబశివ ట్రావెల్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సోమవారం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల (కార్లు) ద్వారా ప్రయాణికులను తీసుకుని గమ్య స్థానాలకు చేర్చనున్నారు. కడపలో మూడుచోట్ల స్టాపింగ్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికులను కడపలో ట్రాన్స్‌పోర్టు సంస్థ వాహనాలు మూడుచోట్ల దింపేలా ప్రణాళిక రూపొందించారు. కడప ఐటీఐ సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, అప్సర సర్కిల్ వద్ద వదలనున్నారు.అయితే కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి రూటు మధ్యలో దిగాల్సి వస్తే నిలబెట్టేలా చర్యలు చేపట్టారు. సోమవారం ట్రూ జెట్ సంస్థ సేల్స్ సౌత్ ఇండియా మేనేజర్ శ్రీనివాసరావు, కడప ట్రూ జెట్ మేనేజర్ భవ్యన్, శ్రీ సాయి సాంబశివ ట్రావెల్స్ యజమాని ద్వారా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. -
ఆర్టీసీ ‘ఉచిత ప్రయాణం’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విశ్రాంత ఉద్యోగ దంపతులు డీలక్స్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో వెసులుబాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకే ఉండేది. ఇక సూపర్ లగ్జరీ, ఆపై రకం బస్సుల్లో 50 శాతం చార్జితో ప్రయాణించొచ్చు. ఈ వసతి జీవితాంతం ఉంటుంది. విశ్రాంత ఉద్యోగి మరణిస్తే భార్య/భర్తకు జీవితాంతం ఆ వెసులుబాటు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు మరణిస్తే స్పౌజ్‌కు ఈ వెసులుబాటు అన్ని రకాల సిటీ సర్వీసుల్లో కూడా లభిస్తుంది.