సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్‌లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు.
ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది.
నగరంలోనా? వెలుపలా?
ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి.
వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్‌లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్‌లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు.
4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి
ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్‌గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్‌లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది.
బస్‌స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్‌పై దృష్టి
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్‌కు ఇబ్బంది పడకుండా టిమ్స్‌ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది.
అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్‌స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment