సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది.
బస్సులు సరిపోక...
పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి.
నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది.
కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు.
ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే..
ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి.
మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు.
ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా..
త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్
సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది.
వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్
కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment