ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ  | 65 Lakh People Travelled In Buses On February 12, TSRTC Facing Shortage Of Buses And Drivers - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ 

Published Wed, Feb 14 2024 4:20 AM | Last Updated on Wed, Feb 14 2024 9:38 AM

65 lakh people travel in buses on February 12: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. 

ఆందోళన ఎందుకంటే..? 
ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది.

రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్‌ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. 

డ్రైవర్ల కొరత 
ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్‌ చేసుకోవాలనీ ప్రతిపాదించారు.

కానీ, ఇటీవలి బడ్జెట్‌ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్‌ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్‌ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement