‘మహాలక్ష్మి పథకం’ అమలులో గ్రేటర్‌ ఆర్టీసీ టాప్‌గేర్‌ | - | Sakshi
Sakshi News home page

రోజుకు 10 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు

Published Sat, Mar 9 2024 10:05 AM | Last Updated on Sat, Mar 9 2024 11:01 AM

- - Sakshi

వంద శాతం ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్న సిటీ బస్సులు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మహాలక్ష్మి పథకం టాప్‌ గేర్‌లో పరుగులు తీస్తోంది. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం విశేషం. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గతేడాది డిసెంబర్‌ 9వ తేదీన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ప్రయాణికులు లేక సిటీ బస్సులు వెలవెలపోయాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరంలోని అన్ని రూట్‌లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.

గతంలో 4 లక్షల మందే..
ప్రతి రోజు సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో కేవలం 4 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకొనేవారు. వారిలో విద్యార్థినులే ఎక్కువ. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే మహిళలు ఎక్కువగా ఉండేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల మహిళలకు సిటీ బస్సు చేరువైంది. మెట్రో లగ్జరీ వంటి బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల వైపు మళ్లారు. దీంతో ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. సాధారణంగా ఉదయం, సాయంత్రం మాత్రమే కనిపించే ప్రయాణికుల రద్దీ కొంతకాలంగా అన్ని వేళల్లోనూ ఉంది.

‘ఆటోలు, క్యాబ్‌లు వంటి వాహనాలను వినియోగించే మహిళలు కూడా సిటీ బస్సుల్లోకి మారారు. ఇప్పుడు బస్సుల సంఖ్య పెరిగితే తప్ప ప్రయాణికుల డిమాండ్‌ను చేరుకోలేని పరిస్థితి నెలకొంది’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికుల చొప్పున మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 90 రోజుల్లో సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో రోజుకు సుమారు 15 లక్షలు మాత్రమే ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 25 లక్షలు దాటింది.

అందులో 10 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడంతో సిటీ బస్సుల్లో సీట్ల కొరత పెద్దసవాల్‌గా మారింది. మహిళల కోసం కేటాయించిన సీట్లతో పాటు, ఇతర సీట్లను కూడా మహిళలే ఆక్రమించుకోవడంతో పురుషులు, వయోధికులకు ‘స్టాండింగ్‌ జర్నీ’ భారంగా మారింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఒకటి, రెండు రూట్లలో నాలుగైదు ట్రిప్పులు ప్రయోగాత్మకంగా నడిపారు. కానీ అంతగా స్పందన లేకపోవడంతో ‘జెంట్స్‌ స్పెషల్‌’ బస్సుల ప్రతిపాదనను విరమించుకొన్నారు.

అరకొర బస్సులే...
గతంలో రోజుకు రూ.కోటి నష్టంతో నడిచిన బస్సులు ఇప్పుడు లాభాల బాట పట్టాయి. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్న దృష్ట్యా నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీకి అవకాశం లభించింది. కానీ ప్రయాణికుల డిమాండ్‌ మేరకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌ మహానగరం విస్తరణకు అనుగుణంగా సిటీ బస్సుల సేవలు విస్తరించుకోవడం లేదు. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా నగర శివార్ల నుంచే వివిధ రకాల పనులపైన మహిళలు, అన్ని వర్గాల ప్రయాణికులు నగరంలోకి రాకపోకలు సాగిస్తారు.

కానీ నగర శివార్ల నుంచి తగినన్ని బస్సులు అందుబాటులో లేవు. సుమారు 2500 బస్సులు మాత్రమే సిటీలో తిరుగుతున్నాయి. మెట్రోలగ్జరీ, మెట్రో డీలక్స్‌ వంటి బస్సులను మినహాయిస్తే కనీసం 2000 బస్సులు కూడా అందుబాటులో లేవు. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న మహిళల్లో 70 శాతం మంది నగర శివార్ల నుంచే ప్రయాణం చేస్తున్నారు. బెంగళూర్‌ వంటి మెట్రో నగరాల్లో 6 వేలకు పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో గ్రేటర్‌ ఆర్టీసీ కూడా కనీసం రెండు రెట్లు విస్తరించవలసి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement