కాంగ్రెస్‌తో చెలిమి దిశగా మజ్లిస్ అడుగులు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందుజాగ్రత్తలు
హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం తమదేనని ధీమా
అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ డమ్మీల కోసం ఎంఐఎం పావులు
చార్మినార్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీ రాజకీయం రసవత్తరంగా మారనున్నదా... సరికొత్త ఎత్తులు, పొత్తులకు రంగం సిద్ధమవుతున్నదా... కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ స్నేహహస్తం అందించనున్నదా.. మెట్రోరైలు పనుల శంకుస్థాపన వేదిక సరికొత్త రాజకీయ పరిణామాలకు అంకురార్పణ చేసిందా... అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇటీవల పాతబస్తీలో మెట్రో రైలు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.
ఇవి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ పార్టీ ఈసారీ నూటికి నూరు శాతం విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నప్పటికీ ఇటు బీజేపీని, అటు ఎంబీటీనీ ఎదుర్కోవడానికి ఎత్తుగడలను మారుస్తోంది. విరించి ఆసుపత్రి చైర్‌పర్సన్ మాధవీలతను బీజేపీ అధిష్టానం హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతుండటంతో మజ్లిస్ పార్టీ అప్రమత్తమైంది. దీనికి శుక్రవారం పాతబస్తీ ఫలక్‌నుమాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న మెట్రో రైలు పనుల శంకుస్థాపన సభలో ఎంఐఎం సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యవహరించిన తీరే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్‌తో స్నేహం కలిసి వస్తుందని...
కాంగ్రెస్ పార్టీతో కొన్నేళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న అసదుద్దీన్ దోస్తానా కోసం స్వరం మార్చారు. ఆయన తాజా బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సీఎం రేవంత్‌రెడ్డి మొండి ఘటం. ఆ మొండితనమే ఆయనను సీఎం పదవి వరకు తెచ్చింది. అయితే నేను, నా పార్టీవాళ్లు కూడా తలతిక్కోళ్లం. అయినప్పటికీ ఐదేళ్లపాటు హాయిగా ప్రభుత్వాన్ని నడిపేటట్లు పూర్తిగా సహకరిస్తాం’ అని ప్రకటించడం గమనార్హం. అసద్ మాటలపై సీఎం రేవంత్ స్పందిస్తూ ‘మజ్లిస్ పార్టీని ఓడించడానికి నేను కూడా ప్రయత్నించా. కానీ, వీలు కాలేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా’ అని పేర్కొంటూ పరోక్షంగా స్నేహహస్తం అందించారు.
డమ్మీలతో డబుల్ గేమ్...
ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు పావులు కదుపుతుందా..? అదే నిజమైతే మరి బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటని చర్చ పాతబస్తీలో జోరుగా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌తో కూడా దోస్తానా కొనసాగించి హైదరాబాద్ వరకు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు చేస్తుండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి డమ్మీ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగితే తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మజ్లిస్ పార్టీ భావిస్తోంది.
ఎంబీటీకి చెక్ పెట్టే దిశగా...
హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న మజ్లిస్ బాచావో తెహ్రీఖ్(ఎంబీటీ) పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని గంపెడాశతో ఉంది. ఇటీవలి శాసనసభ ఎన్నికలలో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి కేవలం 878 ఓట్ల తేడాతో పరాజయం పొందినా, మజ్లిస్ పార్టీకి చుక్కలు చూపించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ ఈసారి హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంపై కన్నేశారు. స్థానిక ప్రజాసమస్యలను తెలుసుకుని ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు ఎంబీటీతోపాటు ఇటు బీజేపీ అభ్యర్థిని ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడమే రాజకీయంగా కలిసి వస్తుందని భావించిన మజ్లిస్ పార్టీ ఆ దిశగా ముందుకెళుతూ తన ఎన్నికల వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment