చేవెళ్ల తెరపైకి ఆయన పేరు..మల్కాజ్‌గిరి రేసులో సునీత
రోజుకో మలుపు తిరుగుతున్న కాంగ్రెస్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన అధిష్టానం..తాజాగా బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పేరును పరిశీలిస్తోంది. ఈ మేరకు సంకేతాలిచ్చిన పీసీసీ నాయకత్వం మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేయాలని సునీతకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చేవెళ్ల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ లభించడంతో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఆ తర్వాత చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కనే నిలబడ్డ సునీత కార్యకర్తలకు అభివాదం చేశారు. దీంతో పరోక్షంగా అభ్యర్థి ఎవరనేది కార్యకర్తలకు సంకేతాలిచ్చారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించిన సునీత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు మహేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌లోని తన సన్నిహితుల మద్దతు కూడగట్టేదిశగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఈ నెలాఖరులోపు పార్టీలోకి రప్పించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారు. అయితే, అనూహ్యంగా రంజిత్‌రెడ్డి తెరమీదకు రావడంతో ‘పట్నం’ సీటుకు ఎసరొచ్చింది.
తాజాగా మల్కాజ్‌గిరి రేసులో..
చేవెళ్ల స్థానానికి రంజిత్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్..సునీతను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయమని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రెండు సార్లు ప్రాతినిథ్యం వహించినందున మేడ్చల్ జిల్లాపై మంచి పట్టుందని, ఇది కలిసివస్తుందని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయపడుతోంది. దీనికితోడు బలమైన సామాజికవర్గం, మహిళ కూడా కావడంతో నగర ఓటర్ల మద్దతు లభిస్తుందనే అంచనా వేస్తోంది. అయితే, సునీత మాత్రం మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసే విషయంలో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గం పూర్తిగా పట్టణ ఓటర్లతో మిళితం కావడం..దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానాల్లో ఇదొక్కటి కావడం..కొత్త సెగ్మెంట్ కావడంతో ప్రచారం కూడా అంత ఈజీ కాదనే భావనలో ఉన్నట్లు తెలిసింది.
రూటు మార్చిన రంజిత్
సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. గులాబీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినప్పటికీ ఆయన పోటీకి విముఖత చూపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం రంజిత్ మనసు కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ పరిణామాలను గమనించిన గులాబీ బాస్..చేవెళ్ల టికెట్‌ను రంజిత్‌కు ఇస్తున్నట్లు ముందే ప్రకటించారు. మాజీ మంత్రి పట్నం దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల, ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పడం..కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో టచ్‌లోకి వెళ్లడంతో పోటీకి సంశయించారు.
బీఆర్‌ఎస్ అధిష్టానానికి కూడా దూరం పాటించారు. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్.. ఇటీవల రంగారెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ వీడింది. అయితే, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న రంజిత్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి కాంగ్రెస్ తరుఫున పోటీకి రెడీ కావడం..పీసీసీ కూడా పచ్చజెండా ఊపడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment