![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/14/656.jpg.webp?itok=Dbfnihs5)
మూడు స్థానాల్లోనూ తేలని అభ్యర్థుల వ్యవహారం
తెరపైకి పారాచ్యూట్లు..పార్టీలోనూ తీవ్ర పోటీ
మల్కాజిగిరి రేసులో మైనంపల్లి, కంచర్ల, హరివర్దన్ రెడ్డి
లష్కర్ బరిలో మాజీ మేయర్ బొంతు, వినోద్ రెడ్డి
చేవెళ్లకు సునీత పేరు దాదాపు ఖరారు..అయినా సస్పెన్సే
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్‌సభ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. గ్రేటర్ పరిధిలోని నాలుగింటిలో మూడింటిపైన పీటముడి నెలకొంది. దీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్న పార్టీ శ్రేణులతోపాటు కొత్తగా పార్టీలో చేరిన వారు, పార్టీలో చేరనివారు సైతం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతి ఒక్క లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపు గుర్రాల కోసం లోతైన సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది.
బుధవారం గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను స్వీకరించింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అభ్యర్థుల ఎంపికలో రెండు స్థానాల్లో పారాచ్యూట్లకు ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
మూడింటిలో తీవ్రపోటీ
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశలు పెంచుకున్న అభ్యర్థులు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నారు. ఈ స్థానం నుంచి మైనంపల్లి హనుమ్మంతరావు, మలిపెద్ది సుధీర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖరరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తదితరులు తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, విద్యావేత్త విద్యా స్రవంతి, ఎంఆర్‌సీ వినోద్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు.
చేవెళ్ల స్థానానికి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందని ప్రచారం సాగుతోంది. అయితే మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడుస్తున్నది. పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందంటూ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి భరోసాగా ఉండగా..మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అలీ మస్కతి పేరు వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment