అధికార పార్టీలోకి షురువైన వలసలు | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలోకి షురువైన వలసలు

Published Mon, Mar 18 2024 8:25 AM | Last Updated on Mon, Mar 18 2024 10:45 AM

- - Sakshi

హస్తం గూటికి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే నాగేందర్‌

అదే బాటలో మరికొందరు సిటీ ఎమ్మెల్యేలు

గ్రేటర్‌ హైదరాబాద్‌పై దృష్టి సారించిన కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ ఒక గేటు తెరిచింది. బీఆర్‌ఎస్‌ నుంచి తొలి వికెట్‌ పడింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ సిటీ ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్‌ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినప్పటికీ చేరికలు జరగలేదు. ఆదివారం కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డిల సమక్షంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేదంర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ హయాంలో మంత్రిగా పని చేసిన దానం 2018లో బీఆర్‌ఎస్‌లో చేరారు. తిరిగి ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దానం నాగేందర్‌ సొంత గూటికి వస్తారన్న ప్రచారం సాగినప్పటికీ.. నిన్నా మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదన్నట్లుగా చెబుతూ వచ్చారు. శనివారం సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన దానం నాగేందర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే ఆదివారం కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు.

దానం బాటలోనే మరికొందరు..
నగరంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బాటలోనే మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లోనే రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి కూడా సీఎంను కలుస్తానని ప్రకటించారు.

ఇటీవల మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కర్ణాటక డిప్యూటీ సీఎంతో కలిసి వచ్చారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌ చేరిన పలువురు ఎమ్మెల్యేలు సైతం అధికార కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌ అగ్రనేతలకు టచ్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, ప్రస్తుత డిప్యూటీ మేయర్‌ దంపతులు, పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

గ్రేటర్‌పై కాంగ్రెస్‌ దృష్టి..
అధికార కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ముందు హైదరాబాద్‌ మహా నగరానికి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీచినా.. హైదరాబాద్‌ మహా నగరానికి మాత్రం తాకలేదు. ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకున్నప్పటికీ అసెంబ్లీ స్థానాల్లో కనీస ప్రాతినిధ్యం మాత్రం దక్కలేదు. మొత్త్తం 24 అసెంబ్లీ స్థానాల్లో రిక్తహస్తమే ఎదురైంది. గట్టిగా ఆశలు పెట్టుకున్న స్థానాల్లో సైతం బోల్తాపడటంతో పాటు కొన్నింటిలో డిపాజిట్‌ గల్లతైంది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌పాత బస్తీ వదిలి మిగిలిన సికింద్రాబాద్‌, మల్కాజిగిరి చేవెళ్ల నియోజక వర్గాలను హస్తగతం చేసుకునేందుకు వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికకు గేట్లు తెరిచినట్లు కనిపిస్తోంది. సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ చేరికలకు ఒక గేటు తెరిచిందని ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలలోపే నగరానికి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేరుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డేనా?
కాంగ్రెస్‌ గూటికి చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి చేవెళ్ల అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం సాగింది. అయితే.. కాంగ్రెస్‌ తొలి జాబితాలో చేవెళ్లకు స్థానం దక్కలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు. సునీతా రెడ్డికి మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చి, రంజిత్‌ రెడ్డిని చెవేళ్ల నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement