రేవంత్ వర్సెస్ కేటీఆర్.. ఆసక్తిగా మల్కాజిగిరి పోరు | - | Sakshi
Sakshi News home page

రేవంత్ వర్సెస్ కేటీఆర్.. ఆసక్తిగా మల్కాజిగిరి పోరు

Published Thu, Mar 28 2024 7:10 AM | Last Updated on Thu, Mar 28 2024 7:37 AM

- - Sakshi

లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఈ పోరులో పైచేయి సాధించడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తోన్న ఇద్దరు ఉద్దండులు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేతలెవరో కాదు ఒకరు పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా.. మరొకరు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ ఇరువురి ఎత్తుగడలు ఎంత మేర ఫలిస్తాయో.. ఫలితాలెలా వస్తాయో జూన్‌ 4 వరకు వేచి చూడాల్సిందే!

సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక్కడి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని గెలిపించారు. ఈ సీటును తిరిగి ఈసారి ఎన్నికల్లో దక్కించుకోవడం రేవంత్‌కు కత్తిమీద సాములా మారింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం.. ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేకపోవడం.. ఈ పరిస్థితుల్లో ఎంపీ సీటును కై వసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. చేరికలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలహీనపరిచే దిశగా పావులు కదుపుతున్నారు.

సిట్టింగ్‌ సీటును దక్కించుకోవాలని..
ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న రేవంత్‌రెడ్డి.. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలనే భావనలో ఉన్నారు. అలాగే ఈ గెలుపుతో విమర్శకుల నోటికి తాళం పడుతుందనే అంచనాలో ఉన్నారు. మరోవైపు చేవెళ్ల లోక్‌సభ స్థానంపై రేవంత్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఈ సెగ్మెంట్‌లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మల్కాజిగిరికి ఖరారు చేశారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష గులాబీ శిబిరాన్ని కకావికలం చేశారు.

కేవలం ఇక్కడే కాకుండా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ ముందుకొచ్చినా.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జిగా చేవెళ్ల, సిట్టింగ్‌ ఎంపీగా మల్కాజిగిరి స్థానాలను గెలుచుకోవడం రేవంత్‌రెడ్డి ముందున్న పెద్ద సవాల్‌గా భావించవచ్చు. చేవెళ్లలోనూ కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేలా ఇప్పటికే మంతనాలు సాగించారు. వీరి చేరికతో పార్టీని బలోపేతం చేయవచ్చని ఆయన అంచనా వస్తున్నారు. సికింద్రాబాద్‌ స్థానానికి దానం నాగేందర్‌ను ప్రకటించడం ద్వారా బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టారు.

గులాబీలో గుబులు..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ సమీకరణలు బీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓటమి నుంచి తేరుకోకముందే.. ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడం.. ప్రకటించిన తర్వాత పార్టీ ఫిరాయించడం గులాబీ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎట్టకేలకు మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. ఈ రెండు సీట్లను గెలుచుకోవడం మాజీ మంత్రి కేటీఆర్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ ప్రత్యర్థిగా మారడం.. మల్కాజిగిరి బలమైన మల్లారెడ్డి ఫ్యామిలీ పోటీకి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను నైరాశ్యంలో పడేసింది.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు తరచూ ఈ నియోజకవర్గాల నేతలతో గులాబీ దళపతి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమవుతున్నారు. ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేస్తున్నారు. మల్కాజిగిరి స్థానాన్ని వశం చేసుకోవడం ద్వారా రేవంత్‌పై పైచేయి సాధించాలని, తద్వారా ఆయనను రాజకీయంగా ఇరుకున పడేయాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడిన సునీత, రంజిత్‌, దానంలను ఓడించడం ద్వారా పీసీసీ చీఫ్‌ను ఇరకాటంలోకి నెట్టవచ్చని అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement