drivers and conductors
-
నేను డ్రైవరన్నను..!
ఖమ్మంమయూరిసెంటర్: మహాలక్ష్మి పథకం అమలుతో పలు సమయాల్లో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కొందరు నిర్దేశిత ప్రాంతాల్లో ఆపడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అక్కడకక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఈ డ్రైవర్ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికురాలి బిడ్డను లాలించి అభిమానం చూరగొన్నాడు. అంతేకాక అధికారుల నుంచి సన్మానం అందుకున్నాడు. వివరాలు.. ఇటీవల మణుగూరు నుండి హైదరాబాద్‌కు చంటి బిడ్డతో ఓ మహిళ బస్సులో వెళ్తోంది. ఆమె మార్గ మధ్యలోని ఓ బస్టాండ్‌లో వ్యక్తిగత అవసరాలపై దిగాల్సి రాగా వెంట ఎవరూ లేకపోవడంతో బిడ్డను ఎవరికి అప్పగించాలో తెలియక సందిగ్ధత ఎదుర్కొంది. చివరకు బస్సు డ్రైవర్ పి.మల్లయ్యను ఆశ్రయించగా ఆయన చంటి బిడ్డను ఎత్తుకుని ఆమె వెళ్లి వచ్చే వరకు లాలించాడు. ఈ విషయం తెలియడంతో ఆర్టీసీ ఆర్ఎం ఏ.సరిరామ్ సోమవారం మల్ల య్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భవాని ప్రసాద్, జీఎన్ పవిత్ర, పర్సనల్ ఆఫీసర్ ఎ.నారాయణ పాల్గొన్నారు. -
ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ
సాక్షి, హైదరాబాద్: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఆందోళన ఎందుకంటే..? ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది. రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. డ్రైవర్ల కొరత ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్ చేసుకోవాలనీ ప్రతిపాదించారు. కానీ, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది. -
ఊళ్లకు ఆర్టీసీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు క్రమంగా ఆర్టీసీ బస్సులు దూరమై ప్రయాణికులకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు చేరువగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ పేరుతో తమ ప్రతినిధులను పల్లెబాట పట్టించనుంది. ప్రతి ఊరిలోనూ తమ ప్రతినిధిని అందుబాటులో ఉంచనుంది. గ్రామాలకు ప్రజారవాణా అవసరాలేంటో గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్రతినిధికి ఐదు ఊళ్లకు మించకుండా బాధ్యత అప్పగించేలా మే ఒకటో తేదీ నుంచి 2 వేల మంది ప్రతినిధులను రంగంలోకి దింపనుంది. రెగ్యులర్ డ్యూటీ చేస్తూనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ ప్రతినిధుల బాధ్యత భుజానికెత్తుకోనున్నారు. వీక్లీ ఆఫ్, ఇతర సెలవు రోజుల్లో వారు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులు, సర్పంచులతో చర్చించి ఆయా ఊళ్లు ఆర్టీసీ నుంచి ఏం కోరుకుంటున్నాయో, ఆయా ఊళ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీకి ఉన్న అవకాశాలేంటో తెలుసుకోనున్నారు. ప్రజలు బస్సెక్కేలా చేయడమే లక్ష్యం... రాష్ట్రంలో 12,769 గ్రామాలున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు తప్ప మిగతా ఊళ్లకు పల్లెవెలుగు/ఇతర కేటగిరీల ఆర్టీసీ బస్సులు నడిచేవి. కానీ ఏడెనిమిది ఏళ్లుగా ఆదాయం కోసం శ్రమిస్తున్న ఆర్టీసీ... ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న గ్రామాలకు ట్రిప్పులు తగ్గించి ఆదాయం ఎక్కువగా ఉండే మార్గాలకు మళ్లించింది. కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతోపాటు సర్విసుల సంఖ్య తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. అద్దె బస్సుల సంఖ్య పెరగడం, వాటి నిర్వాహకులు ఆదాయం ఉన్న మార్గాలపైనే దృష్టి పెట్టడంతో వేల సంఖ్యలో ఊళ్లకు ఆటోలే దిక్కయ్యాయి. ఈ తరుణంలో ప్రజారవాణాను మెరుగుపరిచి గతంలోలాగా ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించేలా చేయాలన్నది యాజమాన్యం లక్ష్యం. నెలకు రూ. 300 అదనపు చెల్లింపులు! ఊళ్లతోపాటు హైదరాబాద్ సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా వార్డులు, డివిజన్ల బాధ్యతను ఆర్టీసీ ప్రతినిధులకు అప్పగించనున్నారు. వారికి నెలకు రూ. 300 వరకు అదనంగా చెల్లించనున్నట్లు తెలిసింది. ప్రతి మూడు నెలలకు సమీక్షించి ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించనుంది. అయితే కేవలం బస్సులు నడిచే ఊళ్ల బాధ్యతే అప్పగిస్తారా, బస్సు సౌకర్యంలేని ఊళ్ల బాధ్యత కూడా ఉంటుందా అన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, ఆర్టీసీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని, ఈ తాజా నిర్ణయానికి కూడా సానుకూలంగా స్పందించి ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొంటున్నారు. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ విధులు ఏమిటంటే..? ♦ ప్రతి 15 రోజులకోసారి ఊళ్లకు వెళ్లి సర్పంచులు, సాధారణ ప్రజలతో కలసి ఆయా ఊళ్ల రవాణా అవసరాలపై వివరాలు సేకరించాలి. ♦ ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చైతన్యపరచాలి. ♦ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనంగా ట్రిప్పులు అవసరమన్న విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. ♦ఆయా ఊళ్లలో ఉత్సవాలు, జాతరలు, పెళ్లిళ్ల తేదీల వివరాలు సేకరించి వాటి రూపంలో ఆదాయం పెంచుకొనే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులకు చెప్పాలి. ♦ ఇతర రోజుల్లో కూడా తమకు వివరాలు ఫోన్ చేసి చెప్పొచ్చని గ్రామీణులను కోరాలి. -
మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి..
కోల్‌కతా: రోడ్ల పై ఒంటరి మహిళలు కనపడితే కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని వేధిస్తుంటారు. ఈ తరహాలోనే ఓ మహిళా జర్నలిస్టును క్యాబ్ డ్రైవర్ వేధించడమే గాక తన స్నేహితురాలిపై దాడి చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బెహలాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ టీవీ న్యూస్ ఛానెల్లో పనిచేస్తున్న మహిళ, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని తన కార్యాలయం నుంచి స్కూటర్‌పై స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా సత్యన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందీ. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ గురువారం రాత్రి మహిళను రోడ్డుపైకి నెట్టడానికి తన స్కూటర్‌ను పలుమార్లు ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. చివరకు అతని ఆగడాలను భరించలేక ఆమె సత్యేన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద తన స్కూటర్‌ను ఆపి అతన్ని వారించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేసి వేధించడమే గాక ఆమె స్నేహితురాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతని వాహనాన్ని ఫోటో తీసుకుని బెహలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. చదవండి: పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు.. -
TSRTC: ఉద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: మస్తాన్, శేఖర్‌కే కాదు.. వీరిలా సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ (ఈఓఎల్)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గుర్తొచ్చిందే తడవు అమల్లోకి.. రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు. వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది. ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు. గరిష్టంగా ఐదేళ్లే..: ఈఓఎల్ కింద గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు. అయితే జీతం రాకపోయినా పరవాలేదు సెలవు దొరి కితేచాలు అనుకునే.. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవా రికి, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి, రిటైర్మెంట్కు చేరువలో ఉన్న వారికి ఇది ఉపకరిస్తుంది. (చదవండి: ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు ) ఇబ్బందిగా మారిన రెండేళ్ల పొడిగింపు గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని రెండేళ్లు పొడిగించారు. దీంతో 58 ఏళ్లకు బదులు 60 ఏళ్ల వయస్సు వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇది డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. వీరిలో చాలామంది 58 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ విధులు నిర్వర్తించడానికే ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యపరంగా ఏర్పడే సమస్యలే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో సర్వీసు మరో రెండేళ్లు పొడిగించటంతో చాలామంది నిస్సహాయ స్ధితిలో ఉన్నారు. తాజాగా ఇలాంటివారు కూడా ఈ అసాధారణ సెలవును వినియోగించుకునేందుకు, ఇతర ఆదాయ మార్గాలు చూసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ►మస్తాన్ ఆర్టీసీలో కండక్టర్.. కుటుంబ అవసరాలకు ఆదాయం సరిపోక పోవడంతో దుబాయ్ వెళ్లి పెద్దమొత్తంలో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నాలుగైదేళ్ల పాటు అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు ఆర్టీసీ విధులకు రాలేనంటూ సెలవు ఆర్జీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంత సుదీర్ఘ సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉన్నాడు. ►శేఖర్ హైదరాబాద్‌లో బస్సు డ్రైవర్.. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్ ఉంది. కానీ ఇటీవల ఒంట్లో నిస్సత్తువగా ఉంటూ నగరంలో డ్రైవింగ్ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. విధులకు వెళ్లొద్దని కుటుంబసభ్యులు సూచిస్తుండటంతో సుదీర్ఘ సెలవు పెట్టేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ సంస్థ అనుమతిస్తుందో, లేదోనన్న అనుమానంతో ఉన్నాడు. (చదవండి: పన్నుల ఆదాయం 43,864 కోట్లు) ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు. -
ఆర్టీసీలో దురుసు ప్రవర్తనకు చెక్!
గుంటూరు / సత్తెనపల్లి: బస్టాపుల్లో ఎప్పటిలానే ఆర్టీసీ బస్సులు వచ్చి ఆగుతాయి. కండక్టర్లు కిందకు దిగి మరీ ప్రయాణికులను దగ్గరుండి బస్సు ఎక్కిస్తారు. వారిలో వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఉంటే తమ చేతులనే వారికి ఆసరగా ఇస్తారు. బస్సుకు రైట్ చెప్పాకా టికెట్ కొడుతూనే తమ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారిని చొరవగా పలకరిస్తూ... వారి సాధక బాధకాలు శ్రద్ధగా ఆలకిస్తారు. చక్కని సలహాలతో వారి సమస్యలకు పరిష్కార మార్గమూ సూచిస్తారు. ఎవరు ఎక్కడ చేయి ఎత్తిన కండక్టర్ ఊదె విజిల్‌కు ఏ మాత్రం కాదనకుండా డ్రైవర్ బస్సును ఆపుతాడు. మొత్తం మీద ప్రయాణికులకు ప్రీతిపాత్రమైన డ్రైవర్, కండక్టర్లుగా వారు ఉంటారు. ఇదంతా.... ఆర్టీసీ సంస్థ తమ కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును వివరిస్తూ రూపొందించిన ప్రచార చిత్రంలోని సన్నివేశాలు. అగ్గి మీద గుగ్గిలం అయితే నిజానికి ఆర్టీసీ బస్సుల్లో ... ముఖ్యంగా తెలుగు వెలుగు బస్సుల్లోని డ్రైవర్లు, కండక్టర్లు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోయినా, బస్సు ఆగకముందే సీటు నుంచి లేవకపోయినా, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే డ్రైవర్‌ను ఎవరైనా ప్రశ్నించినా... సదరు కండక్టర్, డ్రైవర్ ప్రయాణికులపై అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక బస్సు పూర్తిగా దిగకముందే, ప్రయాణికులు ఎక్కక ముందే బస్సును కదిలిస్తున్నారు. నిర్ణీత స్టేజి దాటిన తర్వాత మధ్యలో ఎవరైనా చెయి ఎత్తితే... బస్సును ఆపే డ్రైవర్లు కొంత మంది మాత్రమేనన్నది ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న ఆరోపణ. ఇలా శృతి మించిన పోతున్న ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనను గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన ఎండీ సురేంద్రబాబు తెరపైకి నూతన విధానాన్ని తీసుకువచ్చారు. ప్రయాణికులకు అండగా..... వృద్ధులు ఎక్కేటప్పుడు బస్సును ముందుకు కదిలించడం వల్ల పడిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వృద్ధులు గాయాలపాలుకావడంతో పాటు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎండీ సురేంద్రబాబుకు అందిన ఫిర్యాదుల్లో భాగంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సంస్థ అభివృద్ధికి కారణమైన ప్రయాణికులతో హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన పట్ల అభ్యంతరాలు ఉంటే సంబంధిత డిపో మేనేజర్, ఆర్ఎంకు, ప్రధాన కార్యాలయంలో 0866 2570005 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోనూ అదే పరిస్థితి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల దురుసు ప్రవర్తన సంఘటనలు గుంటూరు రీజియన్‌లోనూ ఉన్నాయి. ఇటీవల ఓ ప్రయాణికుడు చేయి ఎత్తితే బస్సు ఆపక పోవడంతో సదరు ప్రయాణికుడు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ మంత్రూనాయక్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ను రెండు రోజుల పాటు విధుల నుంచి తప్పించారు. ఇలా పలు డిపోల్లో తెలుగు వెలుగు బస్సులలో కండక్టర్లు, ప్రయాణికులు ఘర్షణ పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ ఇచ్చే సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ.. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికులకు సహకరించాల్సిన కండక్టర్లే ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడడంపై వాగ్వాదాలు పెరుగుతున్నాయి. -
కర్కశత్వం
డ్రైవర్లు.. కండక్టర్లను తొలగించిన ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ పేరుతో అయినవారికి జీతాలు భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే ఆర్టీసీ సిబ్బంది నోటి దగ్గర పచ్చడి మెతుకులను కూడా ప్రభుత్వం కర్కశంగా లాగేసుకుంటోంది. అధికారంలోకి వచ్చాక సంస్థ కష్టాలు తీర్చుతామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు ఇప్పుడు సిబ్బందిని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా గప్‌చుప్‌గా మారిపోయూరు. కార్గో సేవల పేరుతో పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్‌కు తెరలేపి అయినవారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. కూలీల కంటే ఘోరం.. డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హులైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటుంది. డ్యూటీకి హాజరైతేనే వీరికి వేతనం లభిస్తుంది. నిత్యం డిపోకు రావాల్సిందే. ఒక వేళ వచ్చినా విధులు కేటాయించకపోతే ఆ రోజు వేతనం లేనట్లే. అయితే ఇష్టం వచ్చినట్లు విధులకు గైర్హాజరైతే అంగీకరించరు. ఇలా కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా 2012 నుంచి చాలా మంది విధుల్లో ఉన్నారు. అయితే ఇటీవల ఆర్టీసీ సొంత బస్సుల స్థానంలో అద్దె బస్సులను భారీగా పెంచేసింది. డ్రైవర్లకే టిమ్‌లను కట్టబెట్టి కండక్టర్ల వ్యవస్థకు చెక్ పెట్టింది. కొంతమంది డ్రైవర్లు టికెట్లు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడంలేదు. ఇలా అద్దె బస్సుల రాకతో డ్రైవర్ పోస్టులకూ గండి పడింది.. ఎడా పెడా తీసేశారు. అనేకమంది ఆర్టీసీ రెగ్యులర్ కార్మికులు రిటైర్డ్ అయిన నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులందరూ రెగ్యులర్ కావాలి. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం 210 మంది రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అదనంగా తేలారు. దీంతో 100 మంది ఆర్టీసీ డ్రైవర్లను చిత్తూరు జిల్లాకు తాత్కాలికంగా బదిలీచేశారు. అంటే తాత్కాలికంగా ఆ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరంగా పని చేయడం ఆర్టీసీ భద్రతాసూక్తికి పూర్తి విరుద్ధం. రెండు చోట్ల కార్మికులు అద్దెలు చెల్లించాల్సి రావడం, కుటుంబ భోజనం బదులు హోటల్ భోజనం తినడం వంటి సమస్యలు ప్రారంభమయ్యూయి. ఇదిలా ఉంటే మరో 110 మందిలో 72 మందిని మాత్రం జిల్లాలోని ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు. 32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు మిగులుగా ఉన్నారంటూ వారిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించేశారు. జిల్లాలో కాంట్రాక్టు కండక్టర్లుగా ఎంపికైన 29 మందిని ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దాని ప్రకారం వారు అక్కడ పనిచేస్తుండగా తమ రీజియన్ పరిధిలో కార్మికులు ఎక్కువయ్యారంటూ వారిని ప్రకాశం రీజియన్‌కు తిరిగి పంపారు. ఇక్కడ కూడా కండక్టర్ల అవసరం లేదంటూ వారిని ఇంటికి పంపేశారు. ఇలా 32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 29 మంది కాంట్రాక్టు కండక్టర్లు ఉపాధి కోల్పోయి ఆర్టీసీ పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జీతాల్లోనూ వారిష్టం.. ఇదిలా ఉంటే ఆర్టీసీలో కార్గో సర్వీసుల పేరిట సరుకు రవాణాకు ఆర్టీసీ పచ్చజెండా ఊపింది. అధికారులకు అండగా నిలిచేందుకు అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున విధుల్లోకి తీసుకున్నారు. వీరి వేతనాలు కూడా రూ. 15 వేలు మొదలు రూ. 20వేల వరకు కేటాయించారు. జీతం కూడా స్కిల్డ్ , అన్‌స్కిల్డ్ అని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా కేటారుుంచినట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల రెకమెండేషన్‌తో విధుల్లో చేరారు. అవుట్ సోర్సింగ్ అంటూనే ఆర్టీసీనే వారికి నియామక ఉత్తర్వులు జారీ చేసిందనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మికవర్గాలు భగ్గుమంటున్నారుు. విధుల్లోకి తీసుకోవాలి తొలగించిన కాంట్రాక్టు కండక్టర్లను, డ్రైవర్లును విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అద్దె బస్సుల్లో జరుగుతున్న దోపిడీని నివారించి ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలి. - ఎస్.పి.రావు, ఎన్ఎంయూ రీజనల్ కార్యదర్శి కాంట్రాక్టు సిబ్బందికి అవకాశం కల్పించాలి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నపుడు కార్గో సర్వీసులకు సైతం అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించే బదులు కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటే బాగుండేది. ఒక పక్క కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే మరో వైపు ఉన్న ఉపాధిని కొల్లగొట్టడం సరైన చర్య కాదు. - బెజవాడ రవి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి