కర్కశత్వం | remove drivers and conductors in tirupati | Sakshi
Sakshi News home page

కర్కశత్వం

Published Sat, Oct 1 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

remove drivers and conductors in tirupati

డ్రైవర్లు.. కండక్టర్లను తొలగించిన ఆర్టీసీ
అవుట్ సోర్సింగ్ పేరుతో అయినవారికి జీతాలు
భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
 
చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే ఆర్టీసీ సిబ్బంది నోటి దగ్గర పచ్చడి మెతుకులను కూడా ప్రభుత్వం కర్కశంగా లాగేసుకుంటోంది. అధికారంలోకి వచ్చాక సంస్థ కష్టాలు తీర్చుతామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు ఇప్పుడు సిబ్బందిని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా గప్‌చుప్‌గా మారిపోయూరు. కార్గో సేవల పేరుతో పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్‌కు తెరలేపి అయినవారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారు.   
 
 కూలీల కంటే ఘోరం..
 డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హులైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటుంది. డ్యూటీకి హాజరైతేనే వీరికి వేతనం లభిస్తుంది. నిత్యం డిపోకు రావాల్సిందే. ఒక వేళ వచ్చినా విధులు కేటాయించకపోతే ఆ రోజు వేతనం లేనట్లే. అయితే ఇష్టం వచ్చినట్లు విధులకు గైర్హాజరైతే అంగీకరించరు.

ఇలా కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా  2012 నుంచి చాలా మంది విధుల్లో ఉన్నారు. అయితే ఇటీవల ఆర్టీసీ సొంత బస్సుల స్థానంలో అద్దె బస్సులను భారీగా పెంచేసింది. డ్రైవర్లకే టిమ్‌లను కట్టబెట్టి కండక్టర్ల వ్యవస్థకు చెక్ పెట్టింది. కొంతమంది డ్రైవర్లు టికెట్లు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడంలేదు. ఇలా అద్దె బస్సుల రాకతో డ్రైవర్ పోస్టులకూ గండి పడింది..
 
ఎడా పెడా తీసేశారు.
అనేకమంది ఆర్టీసీ రెగ్యులర్ కార్మికులు రిటైర్డ్ అయిన నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులందరూ రెగ్యులర్ కావాలి. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం 210 మంది రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అదనంగా తేలారు. దీంతో 100 మంది ఆర్టీసీ డ్రైవర్లను చిత్తూరు జిల్లాకు తాత్కాలికంగా బదిలీచేశారు.
 
అంటే తాత్కాలికంగా ఆ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరంగా పని చేయడం ఆర్టీసీ భద్రతాసూక్తికి పూర్తి విరుద్ధం. రెండు చోట్ల కార్మికులు అద్దెలు చెల్లించాల్సి రావడం, కుటుంబ భోజనం బదులు హోటల్ భోజనం తినడం వంటి సమస్యలు ప్రారంభమయ్యూయి. ఇదిలా ఉంటే  మరో 110 మందిలో 72 మందిని మాత్రం జిల్లాలోని ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు.
 
32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు మిగులుగా ఉన్నారంటూ వారిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించేశారు. జిల్లాలో కాంట్రాక్టు కండక్టర్లుగా ఎంపికైన 29 మందిని ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దాని ప్రకారం వారు అక్కడ పనిచేస్తుండగా తమ రీజియన్ పరిధిలో కార్మికులు ఎక్కువయ్యారంటూ వారిని ప్రకాశం రీజియన్‌కు తిరిగి పంపారు. ఇక్కడ కూడా కండక్టర్ల అవసరం లేదంటూ వారిని ఇంటికి పంపేశారు. ఇలా 32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 29 మంది కాంట్రాక్టు కండక్టర్లు ఉపాధి కోల్పోయి ఆర్టీసీ పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 జీతాల్లోనూ వారిష్టం..
 ఇదిలా ఉంటే ఆర్టీసీలో కార్గో సర్వీసుల పేరిట సరుకు రవాణాకు ఆర్టీసీ పచ్చజెండా ఊపింది. అధికారులకు అండగా నిలిచేందుకు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున విధుల్లోకి తీసుకున్నారు. వీరి వేతనాలు కూడా రూ. 15 వేలు మొదలు రూ. 20వేల వరకు కేటాయించారు.
 
 జీతం కూడా స్కిల్డ్ , అన్‌స్కిల్డ్ అని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా కేటారుుంచినట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల రెకమెండేషన్‌తో విధుల్లో చేరారు. అవుట్ సోర్సింగ్ అంటూనే ఆర్టీసీనే వారికి నియామక ఉత్తర్వులు జారీ చేసిందనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మికవర్గాలు భగ్గుమంటున్నారుు.
 
 విధుల్లోకి తీసుకోవాలి
 తొలగించిన కాంట్రాక్టు కండక్టర్లను, డ్రైవర్లును విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అద్దె బస్సుల్లో జరుగుతున్న దోపిడీని నివారించి ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలి.
 - ఎస్.పి.రావు, ఎన్‌ఎంయూ రీజనల్ కార్యదర్శి
 
 కాంట్రాక్టు సిబ్బందికి అవకాశం కల్పించాలి
 ఆర్టీసీ నష్టాల్లో ఉన్నపుడు కార్గో సర్వీసులకు సైతం అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించే బదులు కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటే బాగుండేది. ఒక పక్క కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే మరో వైపు ఉన్న ఉపాధిని కొల్లగొట్టడం సరైన చర్య కాదు.
 - బెజవాడ రవి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement