సాక్షి, హైదరాబాద్: మస్తాన్, శేఖర్‌కే కాదు.. వీరిలా సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్ (ఈఓఎల్)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గుర్తొచ్చిందే తడవు అమల్లోకి..
రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు.
వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది. ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు.
గరిష్టంగా ఐదేళ్లే..: ఈఓఎల్ కింద గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు. అయితే జీతం రాకపోయినా పరవాలేదు సెలవు దొరి కితేచాలు అనుకునే.. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవా రికి, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న వారికి ఇది ఉపకరిస్తుంది.
(చదవండి: ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు )
ఇబ్బందిగా మారిన రెండేళ్ల పొడిగింపు
గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని రెండేళ్లు పొడిగించారు. దీంతో 58 ఏళ్లకు బదులు 60 ఏళ్ల వయస్సు వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇది డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. వీరిలో చాలామంది 58 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ విధులు నిర్వర్తించడానికే ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యపరంగా ఏర్పడే సమస్యలే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో సర్వీసు మరో రెండేళ్లు పొడిగించటంతో చాలామంది నిస్సహాయ స్ధితిలో ఉన్నారు. తాజాగా ఇలాంటివారు కూడా ఈ అసాధారణ సెలవును వినియోగించుకునేందుకు, ఇతర ఆదాయ మార్గాలు చూసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
►మస్తాన్ ఆర్టీసీలో కండక్టర్.. కుటుంబ అవసరాలకు ఆదాయం సరిపోక పోవడంతో దుబాయ్ వెళ్లి పెద్దమొత్తంలో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నాలుగైదేళ్ల పాటు అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు ఆర్టీసీ విధులకు రాలేనంటూ సెలవు ఆర్జీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంత సుదీర్ఘ సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉన్నాడు.
►శేఖర్ హైదరాబాద్‌లో బస్సు డ్రైవర్.. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్ ఉంది. కానీ ఇటీవల ఒంట్లో నిస్సత్తువగా ఉంటూ నగరంలో డ్రైవింగ్ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. విధులకు వెళ్లొద్దని కుటుంబసభ్యులు సూచిస్తుండటంతో సుదీర్ఘ సెలవు పెట్టేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ సంస్థ అనుమతిస్తుందో, లేదోనన్న అనుమానంతో ఉన్నాడు.
(చదవండి: పన్నుల ఆదాయం 43,864 కోట్లు)
ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment