సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు.
కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్
ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం.
శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు.
మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్
►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది.
►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
►అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్ బటన్ ద్వారా టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.
►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
►ఇప్పటికే మొబైల్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్లు అప్‌డేట్ చేసుకో వడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment