హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్.
మొన్నీమధ్య ఫరూక్‌నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్‌లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన.
‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్‌కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్‌లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు.
ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు.
కాగా ఫరూక్‌నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన.
Comments
Please login to add a commentAdd a comment