the staff
-
దాడులు చేస్తే..: తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆర్డీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మొన్నీమధ్య ఫరూక్నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన. ‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్‌కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా ఫరూక్నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. -
ట్రాన్స్‌కో అధికారుల నిలదీత
నిజాంసాగర్ : విద్యుత్ బిల్లుల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదివారం నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామస్తులు నిలదీశారు. విద్యుత్ బిల్లులు ఎప్పటికంటే ఎక్కువ వచ్చాయంటూ గ్రామస్తులు బిల్ కలెక్టర్‌తో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరెంట్ మీటర్ రీడింగ్ ఆధారంగానే బిల్లులు వచ్చాయని, ఎక్కువగా వచ్చినట్లుంటే ట్రాన్స్‌కో కార్యాలయంలో సంప్రదించాలని వారు గ్రామస్తులకు సూచించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని గ్రామస్తులకు ట్రాన్స్‌కో అధికారులు సూచించడంతో వారు శాంతించారు. -
శాఖాపరమైన విచారణకు మాజీ ఉద్యోగులు
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ విభాగాల్లో శాఖాపరమైన విచారణలు నిర్వహించేందుకు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాజీ ఉద్యోగులను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నిర్వహించే శాఖాపరమైన విచారణలో జాప్యం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు అధికారులుగా నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులకు రూ.20 వేల నుంచి, రూ.75వేల వరకు ఆయా కేసుల స్థాయిని బట్టి కేసుల వారీగా చెల్లిస్తారు. రవాణా అలవెన్స్ కింద రూ. 40వేలు, సదరు మంత్రిత్వ శాఖ నుంచి సహాయకుల సహాయం అందని సందర్భంలో మరో రూ.30 వేలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి ర్యాంకు.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతకు సమాన స్థాయి హోదాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను మాత్రమే నియమిస్తారు. -
ఓటరు చీటీలేవీ..?
ఓటర్ల ఆందోళన 67 శాతం మందికి ఇచ్చేశామంటున్న సిబ్బంది అందలేదంటున్న సిటీజనులు సాక్షి, సిటీబ్యూరో: ‘‘నగరంలో గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దాన్ని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లందరికీ ఇళ్లకే ఓటరు స్లిప్పుల్ని బీఎల్ఓలే అందజేస్తారు. వారికవి అందినట్లు వారి సంతకాలు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నాం. స్లిప్పులందజేసినట్లు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తారు. ఒకవేళ ఇళ్లలో ఎవరూ లేకపోతే ఆ విష యం తెలిసేలా మరో స్టిక్కరును అంటించి.. ఓటరు స్లిప్ కోసం ఫోన్ చేయాల్సిందిగా ఫోన్ నెంబరునూ సూచి స్తాం’’ ...ఇవీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్న మాటలు. కానీ ఆచరణలో మాత్రం అదేం అమలు జరుగుతున్న దాఖ లాల్లేవు. ఓటరు స్లిప్పులు తమ ఇళ్లకు వస్తాయని ఎందరో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇంతవరకూ ఓటరు స్లిప్పులందని వారు ఎందరో ఉన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి గడువు కూడా పెంచామని అధికారులు సెలవిచ్చారు. అన్ని గడువులూ ముగిసి, పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది. అయినా నేటికీ ఓటరు స్లిప్పులందని వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటివరకు 67 శాతం మందికి స్లిప్పులందాయని నియోజకవర్గాల వారీగా గణాంకాలతో సహ అధికారులు వెల్లడించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోలేదు. ఎన్నికల సిబ్బంది ఈ విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించారనే అనుమానాలు పొడసూపుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు అస్తవ్యస్తంగా మారాయని, పరిస్థితి దారుణంగా ఉందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్సైతం జిల్లా ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వారిలో చాలామందికి ఇంతవరకు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియజేయలేదు. మరోవైపు బీఎల్ఓలు, తదితరుల నియామకాలు సైతం పూర్తికాలేదని భ న్వర్‌లాల్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. అందువల్లే ఓటరుస్లిప్పుల పంపిణీ సైతం జరగలేదని భావిస్తున్నారు. వీటితోపాటు ఎన్నికలకు సంబంధించి ఇతరత్రా అంశాల్లోనూ సమన్వయలోపం.. ఎక్కడి పనులక్కడే నిలిచిపోవడం తీరా పోలింగ్ రోజు ఇబ్బందులు కలుగజేయనుందనే సందేహాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు సంబంధించిన సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అధునాతన సదుపాయాలతో కూడిన మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, పోలింగ్ సమయం వచ్చినా అది నేటికీ అందుబాటులోకి రాలేదు.