- ఓటర్ల ఆందోళన
- 67 శాతం మందికి ఇచ్చేశామంటున్న సిబ్బంది
- అందలేదంటున్న సిటీజనులు
సాక్షి, సిటీబ్యూరో: ‘‘నగరంలో గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దాన్ని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లందరికీ ఇళ్లకే ఓటరు స్లిప్పుల్ని బీఎల్‌ఓలే అందజేస్తారు. వారికవి అందినట్లు వారి సంతకాలు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నాం. స్లిప్పులందజేసినట్లు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తారు.
ఒకవేళ ఇళ్లలో ఎవరూ లేకపోతే ఆ విష యం తెలిసేలా మరో స్టిక్కరును అంటించి.. ఓటరు స్లిప్ కోసం ఫోన్ చేయాల్సిందిగా ఫోన్ నెంబరునూ సూచి స్తాం’’ ...ఇవీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్న మాటలు. కానీ ఆచరణలో మాత్రం అదేం అమలు జరుగుతున్న దాఖ లాల్లేవు.
ఓటరు స్లిప్పులు తమ ఇళ్లకు వస్తాయని ఎందరో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇంతవరకూ ఓటరు స్లిప్పులందని వారు ఎందరో ఉన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి గడువు కూడా పెంచామని అధికారులు సెలవిచ్చారు. అన్ని గడువులూ ముగిసి, పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది. అయినా నేటికీ ఓటరు స్లిప్పులందని వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటివరకు 67 శాతం మందికి స్లిప్పులందాయని నియోజకవర్గాల వారీగా గణాంకాలతో సహ అధికారులు వెల్లడించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోలేదు.
ఎన్నికల సిబ్బంది ఈ విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించారనే అనుమానాలు పొడసూపుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు అస్తవ్యస్తంగా మారాయని, పరిస్థితి దారుణంగా ఉందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌సైతం జిల్లా ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.
సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వారిలో చాలామందికి ఇంతవరకు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియజేయలేదు. మరోవైపు బీఎల్‌ఓలు, తదితరుల నియామకాలు సైతం పూర్తికాలేదని భ న్వర్‌లాల్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. అందువల్లే ఓటరుస్లిప్పుల పంపిణీ సైతం జరగలేదని భావిస్తున్నారు.
వీటితోపాటు ఎన్నికలకు సంబంధించి ఇతరత్రా అంశాల్లోనూ సమన్వయలోపం.. ఎక్కడి పనులక్కడే నిలిచిపోవడం తీరా పోలింగ్ రోజు ఇబ్బందులు కలుగజేయనుందనే సందేహాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు సంబంధించిన సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అధునాతన సదుపాయాలతో కూడిన మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, పోలింగ్ సమయం వచ్చినా అది నేటికీ అందుబాటులోకి రాలేదు.