voter slip
-
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్‌ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
చీటీ లేదని ఆగం కావొద్దు.. ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్ఓలు ఓటర్ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం కావాల్సిన పని లేదు. ఓటరు చీటీ లేకపోయినా ఓటేసే అవకాశం ఉంది. ఎన్నికల రోజు బీఎల్ఓలు పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉంటారు. వారి వద్దకు వెళ్లి చీటీ లేని వారు ఆ రోజు కూడా ఓటరు చీటీ రాయించుకునే అవకాశం ఉంది. లేకపోతే ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తెలుసుకుని పోలింగ్ ఏజెంట్లకు చెప్పి వారికి తానే సంబంధిత ఓటరునని నిరూపించుకునే గుర్తింపు కార్డును చూపి ఓటేయొచ్చు. లేదంటే పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసే ఓటరు జాబితాను పరిశీలించి పేరు, క్రమ సంఖ్యను కాగితంపై రాసుకుని వెళ్లవచ్చు. ఆ సమయంలో ఓటరు వద్ద తగిన గుర్తింపు కార్డును తప్పకుండా వెంటతీసుకెళ్లి పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇది చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. ఓసారి అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి ఎలావుందో..! -
జీహెచ్ఎంసీ: గ్రేటర్ ఓటర్ల కోసం కొత్త యాప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఓటర్లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‌తో పాటు పోలీంగ్ బూత్‌ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ కొత్త యాప్‌ను రూపొందించింది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఒటరు స్లీప్‌తో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌తో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఓటర్ల కోసం మైజీహెచ్ఎంసీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్ల పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మైజీహెచ్ఎంసీ యాప్‌ను లౌన్‌లోడ్ చేసుకోవాలి. (చదవండి: ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి) యాప్‌లోకి వెళ్లి నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్‌పై క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్ఎం రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్‌పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. (చదవండి: కేసీఆర్ ‘గ్రేటర్’ సభ : ఎల్బీ స్టేడియం గులాబీమయం) -
పోలింగ్ చీటీపైనే అన్నీ.
వాంకిడి(ఆసిఫాబాద్): ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చీటీలను బీఎల్వోల ద్వారా పంచి పెట్టింది. ఓటర్లకు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలింగ్ చీటీపైనే ఓటరు ఫొటో, పోలింగ్ కేంద్రం మ్యాప్, బీఎల్వో పేరు, ఫోన్‌నంబర్, కేంద్రం సమస్త వివరాలను ముద్రించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటరు ఓటు వేయాలన్న కేంద్రం ఎక్కడుంది, ఓటు వేయాడానికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కమిషన్ ఓటరు ఫొటోతో కూడిన పోలింగ్ చీటీలను పంపిణీ చేస్తూ వాటి వెనుకలో కేంద్రం మ్యాప్, వివరాలను పొందుపర్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం అములు చేయడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడడంతో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 583 పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇందులో సిర్పూర్(టి) నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 300ల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,02,663 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1863 మంది అధికారులను నియమించారు. ఓటర్లు వచ్చేలా చర్యలు పోలింగ్ చీటీలో ముద్రించిన సూచనలు ఇలా.. మీ గుర్తింపును నిరూపించడానికి ఓటరు చీటి మాత్రమే సరిపోదు, మీ గుర్తింపును బలపర్చడానికి మీరు మీ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల కమిషన్ పేర్కొంది. 11 డాక్యూమెంట్లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా మీ వెంట తీసుకురావాలి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ వరుసలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్ జారీ చేసి తమ ఓటు వేయడానికి అనుమతిస్తారు. మహిళకు ప్రత్యేక క్యూ ఉంటుంది. వయోవృద్ధులకు ఓటింగ్ నిమిత్తం ప్రాధాన్యం ఉంటుంది. అందులు, శారీరక వైకల్యం కలిగిన ఓటరు ఓటు వేయడం కోసం కంపార్టుమెంటు వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వయోజనుడిని సహాయకుడిగా అనుమతించవచ్చు. మొబైల్ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్‌లోకి అనుమతించరు. ఒక నిర్ణీత అభ్యర్థి కోసం ఓటు వేయడానికి డబ్బు లేదా ఏదేని ఇతర విధాలైన ప్రతిఫలాన్ని ఇవ్వజూపడం లేదా అంగీకరించడం చట్ట ప్రకారం అవినీతి చేష్ట కిందకు వస్తుంది. ఏ ఒక్క ఓటరును వదిలేయరాదు. ప్రతీ ఓటు లెక్కించబడుతుంది. ఓటరు చెంతలోనే పోలింగ్ చీటీలు మండలాల వారీగా ఏర్పాటు చేసిన బీఎల్వోలు పోలింగ్ చీటీలను వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేసిన అనంతరం బీఎల్వోలు ఓటరులకు పోల్ చీటిలు ముట్టినట్లు సదరు ఓటరు ద్వార సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా పోలింగ్ చీటీలు ఇవ్వడానికి బీఎల్వోలు వెళ్లినప్పుడు ఇంట్లో ఓటరు లేకున్న దిగులు పడకుండా ఓటింగ్ సమయంలో కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వో వద్ద నుంచి తమ పోలింగ్ చీటీలు సేకరించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించారు. -
తప్పిదాలను పునరావృతం చేయొద్దు
సాక్షి, జడ్చర్ల టౌన్: పోలింగ్ విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు చిన్న చిన్న తప్పిదాలను పునరావృతం చేసుకుంటూ జవాబుదారీగా మారొద్దంటూ మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్చర్ల అసెంబ్లీ పీఓలు, ఏపీఓల ఎన్నికల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన చిన్న తప్పిదాలే పెద్ద చర్చగా మారాయని గుర్తుచేశారు. మాక్‌పోలింగ్ అయ్యాక తప్పనిసరిగా ఈవీఎంలు, వీవీప్యాట్లు క్లియర్ చేసి పోలింగ్‌కు వెళ్లాలని, పోలింగ్ ముగిశాక తప్పనిసరిగా ఈవీఎం క్లోజ్ చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కౌంటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఫలితంగా ఎన్నికల కమిషన్‌కు జవాబుదారీగా మారాల్సి వస్తుందన్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని విధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాక్‌పోలింగ్ చేసి ఈవీఎంలు క్లియర్ చేయలేదని, వారిలో కొందరు సమాచారం ఇచ్చినా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. తద్వారా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్ జరిగాక ఇచ్చిన పోలింగ్ శాతం తప్పుగా ఇవ్వద్దని, మీరిచ్చే నివేదికల ఆధారంగానే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోలింగ్ పర్సంటేజీల విషయంలో తప్పుగా ఇవ్వడం వల్ల పెద్ద రచ్చ అయిన విషయాన్ని గుర్తుచేసి అలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లతోపాటు 17ఏ, 17సీ వంటి మొతం 7 రికార్డుల్లోనూ పోలైన ఓట్ల సంఖ్య ఒకేలా ఉండాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన 9 డాక్యుమెంట్లతో బుక్లెట్ చేశామని, దానిని చింపకుండా సక్రమంగా రాసి రిసెప్షన్ కౌంటర్లో సమర్పించాలన్నారు. పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకుని కేంద్రాలకు సమయానికి చేరుకుని ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిశాక త్వరగా రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్, బుక్లెట్, డిస్ప్లే యూనిట్‌ను సమర్పించి వెళ్లాలన్నారు. కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే బుక్‌లెట్‌లో సూచించిన ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని, జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని ఊర్కొండ మండలంలో పనిచేసే సిబ్బంది మాత్రం మహబూబ్‌నగర్ కోడ్‌ను ఉపయోగించి ఫోన్ చేయాలన్నారు. సమయాన్ని వృథా చేయడం మనకు అలవాటని, అలా చేయకుండా ఎన్నికలు విజయవంతం చేద్దామన్నారు. గుర్తింపు కార్డులు తేవాల్సిందే ఓటరు స్లిప్‌లు తీసుకువచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వవద్దని, తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సిందేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ముందుగానే తెలియజేయాలని, అంతకు ముందురోజు రాత్రి గ్రామాల్లో ప్రచారం చేయిస్తామన్నారు. శిక్షణలో సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, 300 మంది పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
దారి చూపేలా..! ఓటర్ చీటీపై సకల వివరాలు
సాక్షి, వనపర్తి: ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో లేనివిధంగా ఓటరు స్లిప్పుల్లో మరింత సమాచారం పొందుపరుస్తున్నారు. పోలింగ్ కేంద్రం, చిరునామా, దారిచూపే తదితర వివరాలను అందులో నమోదు చేస్తున్నారు. పోలింగ్ చీటీలు గతంలో కేవలం పోలింగ్ కేంద్రం వరకు వెళ్లే వరకే అవసరం అన్నట్టు ఉండేది. కానీ ప్రస్తుతం వాటి ప్రాముఖ్యం పెరిగింది. గతంలో కేవలం పేరు, క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం నంబర్, పేరు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం విధానం మారింది. ఓటర్ ఎపిక్ నంబర్, ఫొటోతో పాటు సంరక్షకుడి పేరు, నియోజకవర్గం, రాష్ట్రం పేరును పొందుపర్చడంతో పాటు పోలింగ్ చీటీల పరిమాణం పెంచారు. ప్రతి ఓటరు విధిగా ఓటరు గుర్తింపు కార్డుతో పాటు పోలింగ్ చీటీని తీసుకుని ఓటు వేసేందుకు వెళ్లాల్సి ఉంటుంది. 60శాతం ప్రక్రియ పూర్తి వనపర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ 150కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఆయా ఆవాసప్రాంతాల్లో మొత్తం 2,27,917 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,13,005 మంది మహిళా ఓటర్లు, 1,14,886 పురుష ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్నికల సంఘం ముద్రించిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ 1వ తేదీలోపు మొత్తం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలని, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. నియోజకవర్గంలో 280 పోలింగ్ బూత్‌ల పరిధిలో పోలింగ్ చీటీల పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం నాటికి 60శాతం స్లిప్పులను పం పిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారుర. వీటిని పంపిణీచేసే బాధ్యతను జిల్లా అధికారులు సంబంధిత బీఎల్ఓలకు అప్పగించడం ద్వారా పనివేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు. పోలింగ్ కేంద్రానికి మార్గం ఓటర్ ఫొటో, సమగ్ర వివరాలతో పాటు వెనక భాగంలో పోలింగ్ పేరు, అక్కడికి వెళ్లేందుకు దారిని సూచించే మ్యాపును ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటర్ స్లిప్పుతో పాటు తీసుకెళ్లేందుకు కావాల్సిన ఇతర గుర్తింపు కార్డుల వివరాలు ముద్రించారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బూత్‌లెవల్ అధికారి పేరు, సెల్ నంబర్ సైతం ఉన్నాయి. స్లిప్పుతో పాటు గైడ్ పత్రం ఓటర్ స్లిప్పులతో పాటు ఓటరు పాటించాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సంఘం రూపొందించిన నియమాలు తెలుసుకునే గైడ్ పత్రాన్ని ప్రత్యేకంగా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఇందులో పోలింగ్ తేదీ, పోటీవేసే వి«ధానం, పోలింగ్ కేంద్రంలోని అనుమతించే వస్తువులు, అనుమతించని వస్తువులు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు నిర్వహించే బాధ్యతలు, వేలికి సిరాచుక్క వేసే అధికారులు ఎవరు, ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత వచ్చే శబ్దం, వీవీ ప్యాట్‌లో మనం వేసిన ఓటు ఎవరికి పోలైందనే విషయాలను ఓటర్గైడ్ పత్రంలో ముద్రించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ చిత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. -
నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లకు మార్చి నెల 2 నుంచి స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. 5వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే స్లిప్‌లను సంబంధిత తహసీల్దారు కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు. స్లిప్‌లో ఓటరు పేరు పోలింగ్ కేంద్రం అడ్రస్ ఉంటాయని. ఇది ఓటరు గుర్తింపునకు తోడ్పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత తహసీల్దార్ లేదా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలోని 08518–227305, 227309 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. -
ఓటరు స్లిప్ డౌన్లోడ్ చేసుకోండిలా..!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా నిరాసక్తత కనబరిచే కారణాల్లో వారి పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియకపోవడం ఒకటని భావించి వెబ్సైట్నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (http://tsec.gov.in)లోకి వెళ్లాలి. అందులో.. ♦ ‘డౌన్లోడ్ ఓటర్ స్లిప్’ పై క్లిక్ చేయాలి. ♦ డౌన్లోడ్ జీహెచ్ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది. ♦ సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు (ఓటరు గుర్తింపుకార్డు నెంబరు) ఎంటర్ చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ♦ ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్‌నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది. ♦ ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి. ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ♦ స్మార్ట ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్ ఎలక్షన్ కమిషనర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలొస్తాయి. ♦ నగర ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. -
ఓటరు చీటీలేవీ..?
ఓటర్ల ఆందోళన 67 శాతం మందికి ఇచ్చేశామంటున్న సిబ్బంది అందలేదంటున్న సిటీజనులు సాక్షి, సిటీబ్యూరో: ‘‘నగరంలో గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దాన్ని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లందరికీ ఇళ్లకే ఓటరు స్లిప్పుల్ని బీఎల్ఓలే అందజేస్తారు. వారికవి అందినట్లు వారి సంతకాలు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నాం. స్లిప్పులందజేసినట్లు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తారు. ఒకవేళ ఇళ్లలో ఎవరూ లేకపోతే ఆ విష యం తెలిసేలా మరో స్టిక్కరును అంటించి.. ఓటరు స్లిప్ కోసం ఫోన్ చేయాల్సిందిగా ఫోన్ నెంబరునూ సూచి స్తాం’’ ...ఇవీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్న మాటలు. కానీ ఆచరణలో మాత్రం అదేం అమలు జరుగుతున్న దాఖ లాల్లేవు. ఓటరు స్లిప్పులు తమ ఇళ్లకు వస్తాయని ఎందరో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇంతవరకూ ఓటరు స్లిప్పులందని వారు ఎందరో ఉన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి గడువు కూడా పెంచామని అధికారులు సెలవిచ్చారు. అన్ని గడువులూ ముగిసి, పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది. అయినా నేటికీ ఓటరు స్లిప్పులందని వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటివరకు 67 శాతం మందికి స్లిప్పులందాయని నియోజకవర్గాల వారీగా గణాంకాలతో సహ అధికారులు వెల్లడించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోలేదు. ఎన్నికల సిబ్బంది ఈ విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించారనే అనుమానాలు పొడసూపుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు అస్తవ్యస్తంగా మారాయని, పరిస్థితి దారుణంగా ఉందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్సైతం జిల్లా ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వారిలో చాలామందికి ఇంతవరకు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియజేయలేదు. మరోవైపు బీఎల్ఓలు, తదితరుల నియామకాలు సైతం పూర్తికాలేదని భ న్వర్‌లాల్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. అందువల్లే ఓటరుస్లిప్పుల పంపిణీ సైతం జరగలేదని భావిస్తున్నారు. వీటితోపాటు ఎన్నికలకు సంబంధించి ఇతరత్రా అంశాల్లోనూ సమన్వయలోపం.. ఎక్కడి పనులక్కడే నిలిచిపోవడం తీరా పోలింగ్ రోజు ఇబ్బందులు కలుగజేయనుందనే సందేహాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు సంబంధించిన సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అధునాతన సదుపాయాలతో కూడిన మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, పోలింగ్ సమయం వచ్చినా అది నేటికీ అందుబాటులోకి రాలేదు. -
స్లిప్పుంటే చాలు..!
ఎన్నికల్లో గుర్తింపు కార్డుల బెడదనుంచి వెసులుబాటు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటరు కార్డు తరహాలో ఉండే స్లిప్పులను అందించి పోలింగు సజావుగా జరిగేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వీటిని కూడా ఓటర్లకు బాధ్యులైన సిబ్బంది నేరుగా అందజేయనున్నారు. ముద్రణ కూడా పూర్తవ్వడంతో ఇక పంపిణీ చేయడమే మిగిలింది. అనుకున్నట్లు జరిగితే ఈ ఎన్నికల్లో ఇది మంచి వెసులుబాటుగానే భావించ వచ్చు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా, ఓటర్ స్లిప్‌తోనే ఓటు వేసేలా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఇంత వరకు నిర్వహించిన ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో 21గుర్తింపుకార్డుల్లో ఏదో ఒక దానిని తీసుకొచ్చి ఓటు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు కొత్త ఓటర్ స్లిప్ప్‌లను అధికారులు రెడీ చేస్తున్నారు. దీనిపై ఓటరు జాబితా వరుస క్రమంతోపాటు, గుర్తింపు కార్డు ఐడి నెంబర్, పోలింగ్ కేంద్ర పేరుతోపాటు, అభ్యర్థి పూర్తి వివరాలు, పోలింగ్ జరిగే తేదీని ముద్రిస్తారు. వీటిని ధ్రువీకరిస్తూ ఆర్డీఓ సంతకం ఉంటోంది. వీటిని ఇంటింటికెళ్లి ఓటరుకు అందించేటప్పుడు బూత్ లెవల్ అధికారులు సంతకం చేసి ఇస్తే చాలు దీనిని ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఇక ఓటర్ స్లిప్ వెనుక భాగంలో గుర్తింపు కార్డుగా పరిగణించాలనే దానితోపాటు, ఎన్నికల నిబంధనల్ని ముద్రించనున్నారు. ఈ విధానంతో ఓటర్లకు ప్రతీ ఎన్నికల్లో ఎదురయ్యే గుర్తింపు కార్డు సమస్యకు ఈ ఎన్నికల్లో విముక్తి కలగనుంది. గత వారం రోజులుగా అధికారులు చేపట్టిన కసరత్తును ఎట్టకేలకు పూర్తి చేసుకొని ఈ నెల 17న ముద్రణకు కూడా ఓకే అయ్యింది. సంబంధిత కాంట్రాక్టరుతో ఏర్పడిన సమన్వయ లోపం వల్ల ఒక్క రోజు ఆలస్యంగా ముద్రణ ప్రారంభమైనా 18వ తేదీనాటికి పూర్తిచేసి 19వ తేదీనుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. చకచకా ముద్రణ జిల్లా ఓటర్లు 28లక్షల 94వేల 981మంది ఓటర్లకు గాను ఓటర్ స్లిప్‌లను అందించేందుకు గాను టెండరు ఖరారై ముద్రణ దశలో ఉంది. ఇవి నిర్దేశిత కాలానికి అంటే ఒక్క రోజులో ముద్రణ పూర్తిచేశాక అధికారులు సంబంధిత కాంట్రాక్టరునుంచి వాటిని తీసుకొని పంపిణీకి చర్యలు తీసుకుంటారు. ఇందు బాధ్యులైనవారు వాటిని పర్యవేక్షిస్తున్నారు. కొత్త నిర్ణయం అమలయ్యేనా..... అధికారులు కొత్తగా తీసుకొన్న నిర్ణయంతో గుర్తింపు కార్డు సమస్య పరిష్కారం అవుతుందనుకోగా, ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో దాన్ని అధికారులు అమలు చేయగలరా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే నిర్వహించిన, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ స్లిప్‌లు 50శాతమైనా ఓటర్లకు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈసారి అదే పరిస్థితి నెలకొంటోందా, లేక అందరికి అందించగలరా లేదా అనేది ఈనెల 30వరకు ఆగితే తేలనుంది. -
నూరుశాతం ఓటరు స్లిప్పులు అందించాలి
కలెక్టర్ చిరంజీవులు కలెక్టరేట్, న్యూస్‌లైన్, ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫొటో ఓటరు స్లిప్పులను ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు నూరుశా తం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినప్పటికీ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని సూచించారు. ఓటు వేసేందుకు ఫొటో ఓటరు స్లిప్పు ఉంటే సరిపోతుందన్నారు. ఎన్నికల డ్యూటీ ఉన్న సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందజేసే విధంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ నెల 23, 24, 25వ తేదీలలో ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ స్పెషల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఓలకు ఈ నెల 20, ఏపీఓలకు 21న నియోజకవర్గ స్థాయిలోనూ, ఓపీఓలకు 22వ తేదీన మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రతి 50 మంది పీఓలు, ఏపీఓలకు ఒక ట్రైనింగ్ హాలు ఏర్పాటు చేసి ఈవీఎం వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో టెంట్, మంచినీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అలాగే ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో ప్రథ మ చికిత్స శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆరు వందల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వెబ్‌కాస్టింగ్‌కు అనువుగా లేని పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ తీయించాలని ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్ చేసే విద్యార్థులకు ఎన్నికల కమిషన్ రెమ్యునరేషన్ 500 నుంచి 600 వరకు పెంచినట్లు వివరించారు. రిటర్నింగ్ అధికారులు ఎంసీఎంసీ టీముల ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చే పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్‌ను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, 12 శాసనసభా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.