నూరుశాతం ఓటరు స్లిప్పులు అందించాలి | colour print voter slips distribute | Sakshi
Sakshi News home page

నూరుశాతం ఓటరు స్లిప్పులు అందించాలి

Published Fri, Apr 18 2014 1:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ చిరంజీవులు, పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ చిరంజీవులు, పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు

 కలెక్టర్ చిరంజీవులు

కలెక్టరేట్, న్యూస్‌లైన్, ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫొటో ఓటరు స్లిప్పులను ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు నూరుశా తం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినప్పటికీ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని సూచించారు.

 

ఓటు వేసేందుకు ఫొటో ఓటరు స్లిప్పు ఉంటే సరిపోతుందన్నారు. ఎన్నికల డ్యూటీ ఉన్న సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందజేసే విధంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ నెల 23, 24, 25వ తేదీలలో ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ స్పెషల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఓలకు ఈ నెల 20, ఏపీఓలకు 21న నియోజకవర్గ స్థాయిలోనూ, ఓపీఓలకు 22వ తేదీన మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రతి 50 మంది పీఓలు, ఏపీఓలకు ఒక ట్రైనింగ్ హాలు ఏర్పాటు చేసి ఈవీఎం వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో టెంట్, మంచినీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అలాగే ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో ప్రథ మ చికిత్స శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆరు వందల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వెబ్‌కాస్టింగ్‌కు అనువుగా లేని పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ తీయించాలని ఆదేశించారు.

 

 వెబ్‌కాస్టింగ్ చేసే విద్యార్థులకు ఎన్నికల కమిషన్ రెమ్యునరేషన్ 500 నుంచి 600 వరకు పెంచినట్లు వివరించారు. రిటర్నింగ్ అధికారులు ఎంసీఎంసీ టీముల ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చే పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్‌ను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, 12 శాసనసభా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement