
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..
ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్‌ఓలు ఓటరు స్లిప్‌ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్‌ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్‌లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు.