ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్‌వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.
విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.
నోటా చరిత్ర తిరగేస్తే..
2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment