రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై వారంలో కాంగ్రెస్ సమీక్ష
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్న ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకింత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరీశీలన చేయనుంది.
దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో కనీసంగా 14 సీట్లు గెలవాలని ఏఐసీసీ లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి సైతం 8 స్థానాలు దక్కాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ స్థాయి వైఫల్యాలపై ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.
గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారు. కేబినెట్‌లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే మాదిరి సమీక్ష తెలంగాణలోని ఓటమి చెందిన నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment