సామాన్యులపై కొరడా ఝళిపించి పార్టీకి చెడ్డపేరు తేవొద్దు
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సంయమనంతో వ్యవహరించండి
సీఎం రేవంత్‌రెడ్డికి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హితోపదేశం
ఏఐసీసీకి ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు వెల్లడి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘బుల్డోజర్ సంస్కృతి’పై కాంగ్రెస్ పోరాడుతున్న విషయం గుర్తుచేసిన నేతలు
దసరాకు ముందే నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.
అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు.
ఆ చెడ్డపేరు మనకొద్దు..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.
నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
దసరాకు ముందే..
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment