సాక్షి, వనపర్తి: ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో లేనివిధంగా ఓటరు స్లిప్పుల్లో మరింత సమాచారం పొందుపరుస్తున్నారు. పోలింగ్ కేంద్రం, చిరునామా, దారిచూపే తదితర వివరాలను అందులో నమోదు చేస్తున్నారు.
పోలింగ్ చీటీలు గతంలో కేవలం పోలింగ్ కేంద్రం వరకు వెళ్లే వరకే అవసరం అన్నట్టు ఉండేది. కానీ ప్రస్తుతం వాటి ప్రాముఖ్యం పెరిగింది. గతంలో కేవలం పేరు, క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం నంబర్, పేరు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం విధానం మారింది. ఓటర్ ఎపిక్ నంబర్, ఫొటోతో పాటు సంరక్షకుడి పేరు, నియోజకవర్గం, రాష్ట్రం పేరును పొందుపర్చడంతో పాటు పోలింగ్ చీటీల పరిమాణం పెంచారు. ప్రతి ఓటరు విధిగా ఓటరు గుర్తింపు కార్డుతో పాటు పోలింగ్ చీటీని తీసుకుని ఓటు వేసేందుకు వెళ్లాల్సి ఉంటుంది.
60శాతం ప్రక్రియ పూర్తి
వనపర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ 150కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఆయా ఆవాసప్రాంతాల్లో మొత్తం 2,27,917 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,13,005 మంది మహిళా ఓటర్లు, 1,14,886 పురుష ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్నికల సంఘం ముద్రించిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేశారు.
డిసెంబర్ 1వ తేదీలోపు మొత్తం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలని, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. నియోజకవర్గంలో 280 పోలింగ్ బూత్‌ల పరిధిలో పోలింగ్ చీటీల పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం నాటికి 60శాతం స్లిప్పులను పం పిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారుర. వీటిని పంపిణీచేసే బాధ్యతను జిల్లా అధికారులు సంబంధిత బీఎల్‌ఓలకు అప్పగించడం ద్వారా పనివేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు.
పోలింగ్ కేంద్రానికి మార్గం
ఓటర్ ఫొటో, సమగ్ర వివరాలతో పాటు వెనక భాగంలో పోలింగ్ పేరు, అక్కడికి వెళ్లేందుకు దారిని సూచించే మ్యాపును ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటర్ స్లిప్పుతో పాటు తీసుకెళ్లేందుకు కావాల్సిన ఇతర గుర్తింపు కార్డుల వివరాలు ముద్రించారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బూత్‌లెవల్ అధికారి పేరు, సెల్ నంబర్ సైతం ఉన్నాయి.
స్లిప్పుతో పాటు గైడ్ పత్రం
ఓటర్ స్లిప్పులతో పాటు ఓటరు పాటించాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సంఘం రూపొందించిన నియమాలు తెలుసుకునే గైడ్ పత్రాన్ని ప్రత్యేకంగా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఇందులో పోలింగ్ తేదీ, పోటీవేసే వి«ధానం, పోలింగ్ కేంద్రంలోని అనుమతించే వస్తువులు, అనుమతించని వస్తువులు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు నిర్వహించే బాధ్యతలు, వేలికి సిరాచుక్క వేసే అధికారులు ఎవరు, ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత వచ్చే శబ్దం, వీవీ ప్యాట్‌లో మనం వేసిన ఓటు ఎవరికి పోలైందనే విషయాలను ఓటర్‌గైడ్ పత్రంలో ముద్రించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ చిత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment