సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎవరికెన్ని ఓట్లు పోలై ఉంటాయని అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా చర్చంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లిన వారి గురించే జరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,96,124 మంది అంటే.. సుమారు 30 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ముఖం చూడలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటర్ లిస్ట్ మార్క్‌డ్ జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,78,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,81,912 మంది ఓటర్లు(71.40 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయినా పెరిగింది..
జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల సమయంలో మొత్తం 6,78,090 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,67,335 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 68.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2018 ఎన్నికల్లో మాత్రం 71.40 శాతం ఓట్లు పోల్ కావడంతో గతంకన్నా 2.97 శాతం పెరిగినట్లయ్యింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సారి పశ్చిమలో 1.46 శాతం పెరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5.56 శాతం పోలింగ్ పెరిగింది. ఇక వరంగల్ తూర్పులో మాత్రం ఊహించని విధంగా పోలింగ్ గతంకన్నా 1.96 శాతం తగ్గింది. మరో విశేషం ఏమిటంటే జిల్లాలో 2014 ఓటర్ల జాబితాలో కన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 54 మంది తక్కువగా ఉన్నారు.
- వరంగల్ పశ్చిమలో అత్యధికంగా 1,00,471 మంది ఓటు వేయలేదు. ఇక్కడ 41.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.
- వరంగల్ తూర్పులో 58,169 మంది పోలింగ్‌కు రాలేదు. ఇక్కడ 27.47 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు.
- వర్ధన్నపేటలో 37,484 మంది ఓటేయలేదు. ఇక్కడ 16.63 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు.
- మొత్తంగా ఓటర్ల జాబితాలో 2 శాతం వరకు మరణించిన వారివి, మరికొందరివి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు మినహా మిగతావారు ఓటేయలేదని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment