Warangal urban
-
వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. హన్మకొండ జిల్లా స్వరూపం... వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ రెవెన్యూ డివిజన్లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా స్వరూపం..: వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్ జిల్లా ఏర్పాటైంది. -
Eatala: రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్
కమలాపూర్: ‘కేసీఆర్ డబ్బు, కుట్రలు, అవసరానికి మోసాన్ని నమ్ముకుంటాడే తప్ప ధర్మం, ప్రజలను నమ్ముకోడు.. ఈ కుట్రలకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గం..’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘కేసీఆర్ వందల కోట్ల డబ్బుపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో గెలవొచ్చు.. కానీ హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఇక్కడ డబ్బు, నిర్బంధాలు, దబాయింపులకు ఆస్కారం లేదని.., రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్ అని అన్నారు. మండలంలోని ఉప్పల్ ఉద్యమాల గడ్డ అని, ఉద్యమ సమయంలో రైల్‌రోకో చేసినప్పుడు ఫైరింగ్ చేస్తామన్నా కూడా లెక్క చేయలేదని గుర్తుచేశారు. ‘ఒకప్పటి నీ ఉద్యమ సహచరుడిగా అడుగుతున్నా.. 2006లో నీ వెంట ఉన్నదెవరు.. మేము కాదా?’అని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. మీరు ఎంత డబ్బు ఇచ్చి మభ్యపెట్టినా ప్రజలు తన వెంటే ఉంటారన్నారు. రైతుబంధు పేదవాడికే ఇవ్వాలని, డబ్బున్న వారికి ఇవ్వొద్దని తాను చెప్పినట్లు ఈటల తెలిపారు. రైతుల పంటకు గిట్టబాటు ధర ఇవ్వాలనడంలో ఏం నేరముందో చెప్పాలన్నారు. -
Coronavirus: ఈ మాస్క్ ధర రూ. 12 వేలు
కాజీపేట: కాసులుండాలే గానీ కప్పుకోవడానికి ఎంత ఖరీదైనా మాస్క్ అయినా చెల్లుబాటవుతుంది మరి. ఈ చిత్రంలోని కనిపిస్తున్న మాస్క్ ఖరీదు రూ.12 వేలు. ఈ మాస్క్ కరోనాతో పాటు ఇతర వైరస్‌లను నిర్మూలించడం, బయటి గాలిని శుద్ధి చేసి అందిస్తుందట. మాస్క్లందు ఈ మాస్క్ వేరని గురించి తెలుసుకున్న కాజీపేటకు చెందిన వ్యాపారి ఆకుల నర్సింహారావు ఇటీవలే ఆన్లైన్ ద్వారా దీనిని తెప్పించుకున్నారు. మొదటి వేవ్‌లోనే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా బయటకు రావడం లేదు. చదవండి: 26 నుంచి జూడాల సమ్మె! -
కోలుకున్నవారు 79.2 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ పెరుగుతోంది. సరిగ్గా నెల క్రితంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత నెల 12న కరోనా నుంచి కోలుకున్నవారి రేటు 72.93 శాత ముంటే, ఈ నెల 12వ తేదీన 79.2 శాతానికి (దాదాపు 80 శాతం) పెరిగింది. ఇది మంచి పరిణామమని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత నెల అదే తేదీన కరోనా మరణాల రేటు 0.76 శాతముంటే, ఇప్పుడు 0.61 శాతానికి తగ్గడం గమనార్హం. వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 1,57,096 కరోనా కేసులు నమోదైతే, అందులో 1,24,528 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 961కి చేరుకుంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,607 కాగా, అందులో ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 24,674 మంది ఉన్నారు. మరో 2,216 కేసులు.. ఇక రాష్ట్రంలో శనివారం 56,217 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 2,216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా కరోనాతో 11 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 21,34,912కి చేరింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 341 వచ్చాయి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్ జిల్లాలో 148, నల్లగొండ జిల్లాలో 126, కరీంనగర్ జిల్లాలో 119, వరంగల్ అర్బన్ జిల్లాలో 102, ఖమ్మం జిల్లాలో 105 కరోనా కేసులు నమోదయ్యాయి. -
‘2023 నాటికి కేసీఆర్ దొరల పాలన అంతం’
సాక్షి, వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే కేసీఆర్ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాశానని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా కేసీఆర్ ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు భూపంపిణీ ఎందుకు జరగలేదని మండిపడ్డారు. (కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?) -
కరోనా పరీక్షలకు తీసుకెళ్తే ఖైదీ పరార్
సాక్షి, వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ పరారైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. హన్మకొండ సుబేదారికి చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షల నిమిత్తం జైలు అధికారులు ఖైసర్‌ను గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి.. కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఖైసర్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ అతడి కోసం గాలిస్తున్నారు. ఇక 14 చోరీలు చేసిన ఖైసర్ గత నెలలోనే పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. (మోసం చేశాడు.. న్యాయం చేయండి) -
పోటాపోటీ నిరసనలు
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. -
'మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తాం'
సాక్షి, వరంగల్ అర్భన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు. (చదవండి : ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర) -
చనిపోతే అరిష్టమని..
కాజీపేట: తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధురాలు చనిపోతే అరిష్టమని భావించి ఓ యజమానురాలు బయటకు గెంటేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్దురాలు రోడ్డుపైనే తనువు చాలించింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రసూల్‌బీ (67) కొన్నేళ్లుగా పెద్దపెండ్యాలలోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారం క్రితం అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఇంట్లో చనిపోతే అరిష్టంగా భావించిన ఇంటి యజమానురాలు.. రసూల్‌బీని మంచంతో సహా బయట పడేసింది. ఈ విషయం తెలుసుకున్న సహృదయ ఆశ్రమ నిర్వాహకులు యాఖూబీ, ఛోటులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడానికి అంబులెన్స్‌ను సిద్ధం చేస్తున్న క్రమంలో రసూల్‌బీ తుది శ్వాస విడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపారు. -
కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. 90 రోజుల షెడ్యూల్ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. కాగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝలిపించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆస్ట్రేలియా అమ్మాయి.. హన్మకొండ అబ్బాయి
సాక్షి, హన్మకొండ: చదువు రెండు దేశాలకు చెందిన యువతీయువకులను కలిపింది.. ప్రేమ మరింత దగ్గర చేయగా వివాహబంధంతో ఒక్కటయ్యారు... ఆస్ట్రేలియా దేశానికి చెందిన యువతితో తెలంగాణ యువకుడికి హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన సుఖవాసి మహామహేశ్వర్రావు, విజయకుమారి దంపతులు హన్మకొండలో స్థిరపడగా వారి కుమారుడు దినేష్‌బాబు ఎం ఫార్మసీ చదువుకునేందుకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లాడు. అక్కడి చాల్స్ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ చదువుతున్న డెమ్మి మార్గరేట్ రాబెలింగ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ మేరకు ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో శుక్రవారం వివాహం జరిపించారు. ఈ వివాహానికి హాజరైన డెమ్మి మార్గరేట్ రాబెలింగ్ కుటుంబీకులు, స్నేహితులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించడం ఆకట్టుకుంది. -
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం
హన్మకొండ చౌరస్తా: పసిపాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడికి విధించిన ఉరి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని చిన్నారి శ్రీహిత తండ్రి కె.జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో జూన్ 17 రాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నాడు. -
ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని..
సాక్షి, వరంగల్ : వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు ఓ భార్య చుక్కలు చూపించింది. ఇరుగుపొరుగు మహిళల సహకారంతో అతన్ని చితకబాదింది. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ముత్తోజు రవికి తగిన బుద్ధి చెప్పాలని అతని భార్య సరిత నిశ్చయించుకుంది. రవి ప్రియురాలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు సదరు మహిళను చితకబాదారు. రవి, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విషాదం : విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి
సాక్షి, వరంగల్ : బతుకుదెరువు కోసం వచ్చిన దంపతులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం కాశగూడెంకు చెందిన సయ్యద్ హైదర్ (40), గోరిభి (38) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తుండడంతో గోరిభి బయట తీగలపై ఉన్న బట్టలు తీయడానికి వెళ్లింది. అప్పటికే వర్షం కురువడంతో తీగలకు విద్యుత్ సరఫరా అయింది. ఆ విషయం తెలియని గోరిభి తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. బయట శబ్దం రావడంతో భర్త సయ్యద్ బయటికి వచ్చి తన భార్యకు ఏమైందోనని ఆమెను పట్టుకునేసరికి అతనూ కూడా షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో ఒకేసారి దంపతులిద్దరు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కమిషనర్‌కు కోపమొచ్చింది..
సాక్షి, వరంగల్ అర్బన్: ఎప్పుడు శాంతంగా కనిపించే గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవికిరణ్‌కు ఒక్కసారిగా కోపమెచ్చింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌కు సమయానికి రాని వింగ్ అధికారులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేవారు. సమయ పాటించిన ఆరుగురు మినహా అందరూ అధికారులలు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని సూచించారు. మరోమారు ఇలాగే వ్యవహరిస్తే చార్జెస్ ఫ్రేమ్ చేయాలని సూచిస్తూ తన చాంబర్‌కు వెళ్లిపోయారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు సరిగ్గా ఉదయం 10–30 గంటలకు కమిషనర్ రవికిరణ్ చేరుకున్నారు. ఆ సమయంలో డీసీ గోధుమల రాజు, ఏసీపీలు మహిపాల్ రెడ్డి, సాంబయ్యతో పాటు మరో ముగ్గురు ఇంజినీర్లు మాత్రమే కనిపించా రు. దీంతో మిగిలిన వారు ఏరి ప్రశ్నించిన కమిషనర్... ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు అంటే ఎందుకింతా అలుసు.. ఎన్నిసార్లు చెప్పినా వీరి మైండ్ సెట్ మారడం లేదంటూ అసహణం వ్యక్తం చేస్తూ గైర్హాజరైన వారికి మోమోలు జారీ చేయాలని సూచించారు. తాపీగా.. ఒక్కరొక్కరుగా... గ్రేటర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు, వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై క్యూలైన్లో వేచి ఉన్నారు. ఇంతలో వచ్చిన కమిషనర్.. ఉద్యోగులు రాలేదని గుర్తించి అసంతృప్తితో తన చాంబర్‌కు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత అడిషనల్ కమిషనర్, ఎస్ఈ, ఇన్చార్జ్ సీఈ, ఆర్ఎఫ్ఓ, టీఓ, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఆర్ఐలు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇలా ఒక్కొక్కరుగా కౌన్సిల్ హాల్ చేరుకున్నారు. అందరూ వచ్చేసరికి 11–30 గంటల దాటింది. అప్పటికే హాల్ ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోవడంతో కమిషనర్ వచ్చి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ ఆదేశాలతో టీపీఓలు, టీపీబీఓలకు బల్దియా ఇన్చార్జ్ సీపీ నర్సింహా రాములు సాయంత్రం మెమోలు చేశారు. మిగిలిన వారికి మంగళవారం సెలవు కావడంతో బుధవారం మోమోలు జారీ చేయనున్నారని సమాచారం. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగులకు మెమోలు జారీ కావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
సాక్షి, వరంగల్ అర్బన్: బాలికల వసతి గృహంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండలోని జూలైవాడ గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో వార్డెన్ ప్రమేయం ఉందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలని, అదే విధంగా అక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనాన్ని సమయానికి అందించాలని, హాస్టల్ విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు. -
సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, హన్మకొండ: సొంతింటికి కన్నం వేసిన చందంగా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకు చేరాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. అసలే నష్టాలతో కుదేలైన ఆర్టీసీకి సంస్థకు సిబ్బంది చేతివాటంతో మరింత నష్టం కలిగే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దూర ప్రాంతాలకు నడిపే బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు అదును చూసి కొంత నగదు కాజేస్తున్నారు. ఈ విషయమై కొందరు ప్రయాణికులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చెలా‘మణి’ అవుతోంది. అయితే, ఓ ప్రయాణికుడు తిరగబడడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూడగా... ఓ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు వరంగల్ రీజియన్ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్నారు. ఇలా బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ మొత్తంలో సమకూరుతోంది. తద్వారా దూరప్రాంత బస్సులకు అధికా రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, పిడుగురాళ్ల, రాజ మండ్రి, శ్రీశైలం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, మంత్రాలయం, షిర్డీ, పూణే, రాయచూర్‌కు ప్రస్తుతం బస్సులు నడుస్తున్నాయి. అయితే, రాష్ట్రం దాటిన తర్వాత తనిఖీలు ఉండవనే ధైర్యంతో కొందరు కార్మికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవకాశమున్న చోట, అందినకాడికి దోచుకుంటూ ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను బెదిరిస్తున్నారు. తిరుపతి నుంచి వస్తుండగా... ఇటీవల వరంగల్–1 డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా హన్మకొండకు వచ్చిం ది. ఈ బస్సులో హైదరాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులు కొందరు తిరుపతిలో ఎక్కారు. దూరప్రాంత బస్సు కావడంతో ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వహిస్తారు. ఒకరు బస్సు నడిపితే మరొకరు టిమ్స్ ద్వారా టికెట్లు ఇస్తారు. తిరుపతిలో ఎక్కిన ప్రయాణికుడు, హైదరాబాద్ వాసి జగన్ డబ్బు ఇచ్చినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయమై ఎంత ప్రశ్నించినా దాటేస్తూ వచ్చిన డ్రైవర్ కడప వరకు నెట్టుకొచ్చాడు. చివరకు ప్రయాణికుడి నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో పాటు బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు చెప్పడంతో కడప నుంచి హైదరాబాద్ వరకు మాత్రమే టికెట్ ఇచ్చాడు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు టికెట్ డబ్బులు తీసుకుని టికెట్ మాత్రం కడప నుంచి ఇవ్వడం ద్వారా రూ.200 సదరు డ్రైవర్ తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు ప్రయాణికుడు జగన్ ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ గుండా ఫిర్యాదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన డిపో మేనేజర్ చేతి వాటం ప్రదర్శించిన డ్రైవర్ అమరేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ దుర్భాషలాడాడు.. ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు డ్రైవర్ అమరేందర్ నాకు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నాడు. ఫోన్లో బూతు పురాణం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన స్నేహితులతోనూ ఫోన్ చేయించి తిట్టించాడు. సదరు డ్రైవర్ నన్ను తిట్టినట్లు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తా. – జగన్, ఫిర్యాదుదారుడు డ్రైవర్‌పై చర్య తీసుకున్నాం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి డ్రైవర్ అమరేందర్‌ను సస్పెండ్ చేశాం. తిరుపతిలో బస్సు ఎక్కిన ప్రయానికుడి వద్ద మొత్తం డబ్బు తీసుకుని కడప నుంచి హైదరాబాద్ వరకు మాత్రమే టికెట్ ఇచ్చాడు. మిగతా డబ్బు కాజేశాడు. అలాగే, ఫిర్యాదు చేసిన ప్రయాణికుడినే దుర్భాషలాడుతున్నట్లు మాకు సమాచారం ఉంది. ఫోన్ రికార్డు వాయిస్ తనకు పంపించాడు. మాటలు వినలేని విధంగా ఉన్నాయి. – గుండా సురేష్, వరంగల్–1 డిపో మేనేజర్ -
ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..
సాక్షి, వరంగల్ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్‌లో రూ.40 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు. సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు. -
ఓరుగల్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు జిల్లాల నామస్వరూపాలు మారనున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కూర్పు, పేర్లను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ రెండు జిల్లాలను మళ్లీ పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా, వేగంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్వహించి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలతో సహా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 10 నుంచి 31కు పెరిగింది. ఇటీవల కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. అయితే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను మళ్లీ పునర్విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రజలు తమకు వరంగల్ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ప్రజలందరికీ వరంగల్ నగరంతోనే సంబంధాలున్నాయి. చదువులు, వ్యాపారాలు, వైద్యం, ఇతర అవసరాల కోసం వారు నిత్యం వరంగల్ వస్తుంటారు. వరంగల్ రాజధానిగానే చాలా ఏళ్లపాటు జీవనం సాగింది. ఇది ఇలాగే కొనసాగాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్‌లోనే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీ, ఎనుమాముల మార్కెట్ ఉన్నాయి. విమానాశ్రయం కూడా పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్‌ను రాజధానిగా చేయాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కూడా వరంగల్ రూరల్ జిల్లాలో కలిపి వరంగల్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేరుకు వరంగల్ అయినప్పటికీ వరంగల్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయమూ లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతున్నది. కాకతీయల కాలం నుంచి వరంగల్ రాజధానిగా వెలుగొందింది. కాబట్టి వరంగల్ రాజధానిగా ఒక జిల్లా ఉండటం సముచితమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, వరంగల్–హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, ప్రజల సౌకర్యార్థం, ప్రజాభీష్టం మేరకు వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. వరంగల్ జిల్లా కార్యాలయాలన్నీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఏర్పాటు కానున్నాయి. హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్... వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ మాదిరిగానే హన్మకొండకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. హన్మకొండ నగరం కాకతీయుల తొలి రాజధాని. కానీ నేడు హన్మకొండ పేరే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. హన్మకొండకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హన్మకొండ కూడా ఒక జిల్లాగా ఉండాలని, వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ రాజధానిగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వరంగల్ పేరును, హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు హన్మకొండ పేరును పెట్టాలని కోరారు. దీనివల్ల వరంగల్, హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, చారిత్రక గుర్తింపును పునరుద్ధరించినట్లు అవుతుందని భావించి సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు. రెండు చోట్లా ప్రభుత్వ కార్యాలయాలు రావడం వల్ల నగరం నాలుగు దిక్కులా అభివృద్ధి చెందుతుందని, వరంగల్ నగరానికి వచ్చే వలసలు కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. యథాతథంగా జీవీఎంసీ! వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)ను మాత్రం యథాతథంగా అదే పేరుతో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ప్రస్తుతం 5 జిల్లాల్లో విస్తరించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాలు సైతం అనేక జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వరంగల్ నగరం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాబట్టి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని జిల్లాలు వచ్చినా నష్టం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. -
సాకులు చెప్పొద్దు..
హన్మకొండ అర్బన్ : ‘ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది.. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి.. సాకులు చొప్పొద్దు’ అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అధికారులు ఎక్కువ మంది రామకపోవడంపై ఆరాతీసి హాజరు వివరాలను పరిశీలించారు. జెడ్పీ సమావేశం ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలుపగా ఇకపై అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్‌కు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలకు సంబంధించిన రాయితీ డబ్బులు నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినా యూనిట్లు ఎందుకు గ్రౌండింగ్ చేయాలేదని అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మంగళవారం సాయంత్రం పత్య్రేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ రుణాల గ్రౌండింగ్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంజీఎంలో సదరం క్యాంపుల నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు హాజరైన వివిధ శాఖల అధికారులు సదరం సర్టిఫికెట్ ఇప్పించండి తనకు ఆరు నెలల క్రితం పక్షవాతం రావడంతో రెండు కాళ్లు పూర్తిగా పనిచేయడం లేదు. మంచానికి పరిమితమయ్యాను. సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన సులువూరి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు హన్మకొండలోని వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయం సమీపాన 1145 సర్వే నంబర్లో ఉన్న కాకతీయుల కాలంనాటి బాలరాజరాజేశ్వర స్వామి దేవాలయం భూమిని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు. ఈవిషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకుని సుమారు 26 గుంటల భూమి కాపాడాలని కాయతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. -
‘సఖీ’తో సమస్యల పరిష్కారం
కాజీపేట అర్బన్ : బాధిత మహిళల సంరక్షణ, వసతి, పోలీస్, న్యాయ సేవలందించేందుకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది సఖీ/వన్‌స్టాప్ సెంటర్. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర సమస్యలను ఒకే చోట పరిష్కారం అందించేందుకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఇది తోడ్పడుతోంది. 24 గంటలు అందుబాటులో సేవలందిస్తూ నేడు మహిళలకు, బాలికల సంరక్షణకు ఆత్మీయ నేస్తంగా సఖీ సెంటర్ మారింది. 2017 డిసెంబర్లో ప్రారంభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్స్, 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, డీవీ సెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 186 వన్‌స్టాప్ సెంటర్లను ప్రారంభించేందుక శ్రీకారం చుట్టగా రాష్ట్రంలోని పది జిల్లాలను ఎంపిక చేసింది. వీటిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవలందించేందుక ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో 2017 డిసెంబర్లో సర్వోదయ యూత్ ఆరనైజేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలో సఖి/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. సఖీ సెంటర్ కార్యాలయం అందుబాటులో సేవలు.. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలపాటు సఖి/వన్‌స్టాప్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మహిళలకు, బాలికలకు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్ సహాయం, కోర్టుకు రాలేని బాధిత మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సహాయం అందిస్తారు. వన్‌స్టాప్ సెంటర్ వీరికే.. బాధిత మహిళలు, బాలికలకు సేవలందించే లక్ష్యంతో సఖీ/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న, లైంగిక వేదింపులు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, పనిచేసే చోట లైం గిక వేదింపులకు గురి చేసే చోట అన్ని శాఖ సమన్వయంతో పరిష్కార మార్గాలను చూపుతుంది. వన్‌స్టాప్ అంబులెన్స్ 260 సమస్యల పరిష్కారం.. మహిళలకు, బాలికలకు తక్షణ రక్షణ, తాత్కాలికంగా ఐదు రోజుల వసతిని అందిస్తూ బాధితులకు మేమున్నామనే భరోసానందిస్తుంది సఖీ సెంటర్. గత పదిహేను నెలల్లో సుమారు 260 బాధిత మహిళల సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని 58 డివిజన్ల్లో సఖీ సెంటర్ సేవలపై విస్త్రత ప్రచారం అందిస్తూ బాధితులకు చేరువవుతున్నారు. నిరంతర సేవలందిస్తున్నాం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధిత మహిళలకు నిరంతరం సేవలందించడం ఆనందంగా ఉంది. హింసా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. న్యాయ, పోలీసు, వైద్య సేవలతో పాటు తాత్కాలిక వసతి అందించి కౌన్సిలింగ్ ద్వారా మార్పునకు నాంది పలుకుతున్నాం. – పల్లెపాటు దామోదర్, సఖీ సెంటర్ నిర్వాహకుడు -
మహా దూకుడు
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు. ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు. ‘ఆన్లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్సైల్లో పెంటారు. 27 రోజులు.. రూ.30కోట్లు గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు. వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓలు, ఆర్ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది ఆస్తులు జప్తు, సీజ్ మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి. – శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్ -
కేసీఆరే మళ్లీ సీఎం..
సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తన విజయం తథ్యమని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడారు. కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా, సమన్వయంతో పని చేశామన్నారు. గత మూడు నెలలుగా అహర్నిశలు కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు వినయ్‌భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ముందున్నామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 58.2 శాతం పోలింగ్ అయిందన్నారు. ఎప్పటి లాగానే తాను ప్రజల మధ్యన ఉంటానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి, ప్రతి శనివారం అడ్డా ములాఖత్, ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శన్, కాలనీ విజిట్ కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ నల్ల స్వరూపరాణిరెడ్డి, నాయకులు సుందర్రాజు, నల్ల సుదాకర్‌రెడ్డి, వెంకట్రాజం, చాగంటి రమేష్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.