
ఖిలా వరంగల్: గుండెపోటుతో ఓ గీత కార్మికుడు తాటిచెట్టుపైనే మృతిచెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ 8వ డివిజన్ ఖిలా వరంగల్ మధ్యకోట ప్రాంతానికి చెందిన పోశాల నాగరాజుగౌడ్ (35) కల్లు తీసేందుకు సాయంత్రం 4 గంటలకు కుమ్మరికుంటలోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే తాటి చెట్టుపైన ఉండగానే గుండెపోటు వచ్చి మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 6 గంటలకు తాటి చెట్టు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే నాగరాజుగౌడ్ మృతిచెంది చెట్టుపైన మోకుముస్తాదుతో వేలాడుతున్నాడు.
ఈ సమాచారం పోలీసులు, ఫైర్ అధికారులకు తెలియడంతో హుటాహుటిన చేరుకున్న వారు స్థానిక గీత కార్మికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య శైలజ, ఒక కూతురు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఎస్సై డేవిడ్ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment