
కాళేశ్వరం ఆలయ ఆవరణలో ఘటన
గంటన్నర పాటు దేవస్థానం మూసివేత
సంప్రోక్షణ తరువాత యథావిధిగా పూజలు
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చారు. కుమారుడు కాలసర్పనివారణ పూజలు చేస్తుండగా.. కనుకయ్య ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతున్నాడు. ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.
గంటన్నర ఆలయం మూసివేత
కనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రోక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు.
గుండెపోటుతో వ్యక్తి..
సిరిసిల్లక్రైం: సిరిసిల్లలో ప్రముఖ స్వీట్‌హౌస్ యజమాని అశోక్(42) సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన అశోక్ సిరిసిల్లలో స్వీట్‌షాప్ పెట్టుకొని కుటుంబంతో స్థిరపడ్డాడు. కొన్నిరోజులుగా పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి, అశోక్‌కు మధ్య ఓ కారు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం సదరు ఉద్యోగి కారును అశోక్ తీసుకెళ్లాడని, ఆ కారు కాస్త గంజాయి రవాణాలో కర్ణాటక పోలీసులకు చిక్కింది.
దీంతో అక్కడి పోలీసులు కారును సీజ్ చేశారు. తన కారు తనకు కావాలని, లేకుంటే కొత్తది కొనివ్వాలని అశోక్, సదరు ఉద్యోగి మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. సోమవారం రాత్రి సిరిసిల్లలో కారు పంచాయితీ జరుగగా, పెద్దలు చెప్పిన దానిపై ఆలోచన చేస్తానని అశోక్ ఇంటికి వెళ్లాడు. మానసిక ఒత్తిడి అధికమై గుండెపోటుకు గురయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా కారు కేసు వేరే రాష్ట్రంలో జరిగిందని, గొడవలపై, అశోక్ మృతిపై కుటుంబీకులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.