పుణ్యస్నానానికి వస్తే.. ప్రాణాలే పోయాయి
Published Fri, Aug 12 2016 11:48 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
విజయవాడ (లబ్బీపేట) :
కృష్ణ పుష్కరాల్లో స్నానం చేసే పుణ్యఫలాలు దక్కుతాయని ఉత్సాహంగా కుటుంబ సమేతంగా వస్తే.. తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలేపోయాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన వై భాస్కరరావు (55), భార్య పిల్లలు, ఇతర బంధువులతో కలిసి పుష్కర స్నానాల కోసం గురువారం సాయంత్రానికే నగరానికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌లో దిగి అర్ధరాత్రి సమయంలో దుర్ఘా ఘాట్ వద్దకు వచ్చారు. ఇంతలో ఛాతీలో నొప్పి రావడంతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా, సమీపంలోని వైద్య శిబిరంలో పరీక్షలు చేయించి, 108లో పాత ప్రభుత్వాస్పత్రిలోని పుష్కర వార్డుకు తరలించారు. కాగా భాస్కరరావు అక్కడకు చేరుకునే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కొత్త ఆస్పత్రిలోని మార్చురీకి తరలించగా, వేకువ జామున బంధువులు విశాఖకు తీసుకెళ్లారు. పుష్కర స్నానం కోసం వస్తే ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చిందని బంధువులు విలపించారు.
Advertisement
Advertisement