సాక్షి, వరంగల్ అర్బన్ : వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంలో పది మంది సజీవ దహనం అయ్యారు. ఈ విషాదం భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో బుధవారం జరిగింది. భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో ఒక్కచోటు చిన్నగా నిప్పురాజుకోవడంతో బాణాసంచా కాలడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా దగ్దం కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గోదాముల పనిచేస్తున్న కార్మికులను రక్షించేందుకు వీలులేక పోవడంతో పది మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు.
వరంగల్ అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కేసీఆర్ అదేశించారు. కాగా, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేసి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతుల కుటుంబీకులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
8 మంది కార్మికులు సురక్షితం
అగ్నికీలల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడటంతో కుటుంబసభ్యులు మృతదేహాల పక్కన ఉండేందుకు భయపడ్డారు. గోదాంలో పరిమితికి మించి మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణమని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment