సాక్షి, వరంగల్ రూరల్: చెవులు చిల్లులు పడేలా శబ్ధం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల వరకు కంపించిన ఇళ్లు, వంగిపోయిన స్టీలు కడ్డీలు, కూలిపోయిన గోడలు, తునాతునకలైన షాబాదు రాళ్లు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడి ఛిధ్రమైన కార్మికుల శరీర భాగాలు... ఇవీ వరంగల్‌లోని శ్రీ భద్రకాళీ ఫైర్‌వర్క్స్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కనిపించిన ఆనవాళ్లు. సరిగ్గా ఏడాది క్రితం అంటే 4 జూలై 2018న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలో తొక్కి అధికారుల కళ్లు నిర్వహిస్తున్న ఫైర్‌వర్క్స్లో ప్రమాదం జరిగిన పది మంది మృతి చెందగా.. మరో మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రప్రభుత్వం నుంచి తప్ప యజమాని నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. గాయపడిన వారు జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు.
సజీవ దహనం
వరంగల్‌కు చెందిన కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌వర్క్స్ పేరుతో టపాసుల తయారీ పరిశ్రమ ఏర్పాటుచేశారు. అక్కడ సరైన రక్షణ ఏర్పాట్లు లేక.. నిబంధనలు పాటించని కారణంగా జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి ఏడాది అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా దానిని మరిచిపోలేదు. ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వచ్చారు.
ప్రమాదంలో కాశిబుగ్గ తిలక్ రోడ్‌కు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీనగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్‌దాసు అశోక్‌కుమార్(30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40) మృతి చెందారు. వీరితో పాటు కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్ (35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్(22) మృత్యువాతపడ్డారు. కాగా, ఇద్దరి శరీరాలు గుర్తుపట్టలేకుండా చిధ్రం కావడంతో డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు. ఇంకా బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటలకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ గాయపడ్డారు. ఫైర్ వర్క్స్ చుట్టుప్రక్కల సమారు 300 మీటర్ల దురం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిపోయాయి. కొందరు మరమ్మత్తులు చేసుకుని ఉంటున్నారు. మరికొందరు ఆ గృహాలను వదిలేశారు.
తప్పించుకునే ప్రయత్నం
ఎంప్లాయిస్ కంపర్‌జేషన్ యాక్ట్ 1932 ప్రకారం ఒక కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి 10 మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించింది. దీంతో 2018 జూలై 20న జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్‌కు నోటీసులు పంపించారు. అయినా స్పందన రాకపోవడంతో ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.9లక్షల వరకు చొప్పున రూ.68లక్షలు చెల్లించాలని ఆర్డర్ జారీ చేశారు. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. 2016లోనే పరిశ్రమను తన బావమరిది రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు. కాగా, రఘుపతి కూడా ఈ ఘటనలో కన్నుమూసిన నేపథ్యంలో తప్పించుకునేందుకు ఇలా చెప్పాడని భావించిన కార్మిక శాఖ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తు హైకోర్టును ఆశ్రయించడంతో యజమాని నుంచి నష్టపరిహారం ఇంకా అందలేదు.
కానిస్టేబుల్ అవుదామనుకున్నాడు
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొండపల్లి సురేష్. కానిస్టేబుల్ కావాలనుకున్నాడు... బాంబుల పేలుళ్ల ఘటన బెడ్‌కే పరిమితం చేసింది. బాలాజీనగర్‌కు చెందిన ఈయన బాంబుల కుమార్ దగ్గర పని చేస్తున్నాడు. పేపర్ షార్ట్‌లు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవించాయి. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎడుమ కాలుపై బాంబు పడటంతో తెగిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్ ను 108 ద్వారా ఎంజీఎం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం ఖర్చులు ప్రభుత్వమే చెల్లించింది. అయినా ఇంట్లో బంగారం అమ్మాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీన నిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంట్లోనే బెడ్‌కే పరిమితం అయ్యారు. తండ్రి జంపయ్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పనికి వెళ్లడం సైతం బంద్ చేశారు. తల్లితండ్రుల వయస్సు భారంతో ఇంట్లోనే ఉంటున్నారు. సురేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని తల్లితండ్రులు కోరుతున్నారు.
నిర్లక్ష్యంతోనే ప్రమాదం
ఫైర్ వర్క్స్‌లో కనీస నిబంధనలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వివిధ శాఖల వారు తెల్చారు. ఈ మేరకు నివేదికలు కూడా ఇచ్చారు. బాంబుల తయారికి ఉపయోగించే ముడి పదార్థం ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టడం వలనే ఈ పెనుప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
నన్ను ఒంటరిని చేసి పోయింది
బాంబుల తయారీ కంపెనీలో పనికి నా భార్య రేణుక రోజులాగే వెళ్లింది. బాంబుల పేలుళ్ల ఘటనలో చనిపోయింది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒకరి పెళ్లి ఇటీవలే చేశాను. నాకు వయస్సు మీద పడటంతో ఇంట్లోనే ఉంటున్నాను. కేసీఆర్ ప్రకటించిన రూ.5లక్షలు మాత్రమే వచ్చాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని కఠినంగా శిక్షించాలి.
– బాస్కుల కొమురయ్య, సుందరయ్యనగర్
ఇబ్బంది పడుతున్నాం
బాంబుల పెలుళ్లలలో నా భార్య శ్రావణి, చెల్లె శ్రీవాణి ఇద్దరు చనిపోయారు. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, చెల్లెకు ఇద్దరు ఆడ పిల్లలు న్నారు. పిల్లలకు తల్లులు లేని అనాథులగా మారారు. పిల్లలల బాగోగులు చూసుకునేందుకు పనికి కూడా సరిగా వెళ్లడం లేదు. పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నాను. పిల్లలను గురుకులల్లో జాయిన్ చేయిస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడంలేదు. నా పిల్లలకు తల్లి లేకుండా చేసిన యజమానిని శిక్షించి మమ్ముల్ని ఆదుకోవాలి.
– కోమటి రాజు, కోటిలింగాల గుడి దగ్గర
Comments
Please login to add a commentAdd a comment