సాక్షి, వరంగల్ రూరల్ : చెవులు చిల్లులు పడేలా శబ్దం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు కంపించిన ఇళ్లు, కూలిపోయిన గోడలు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడిన కార్మికుల శరీర భాగాలు.. ఇదీ వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన నాటి పరిస్థితి. రెండేళ్ల క్రితం అంటే 2018 జూలై 4న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలోకి తొక్కి అధికారుల కళ్లు కప్పి నడుస్తున్న ఫైర్‌వర్క్స్‌లో జరిగిన ప్రమాదం పది నిండు ప్రాణాలను బలి తీసుకోగా మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
టపాసుల తయారీ, విక్రయం..
వరంగల్ నగరానికి చెందిన గొల్లపల్లి కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌వర్క్స్ పేరుతో టపాసుల తయారీ, విక్రయాలు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రెండేళ్ల క్రితం జరిగిన పేలుళ్ల ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. ఆ కుటుంబాలను కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు.
పరిహారం పెండింగ్‌లోనే..
ఎంప్లాయిస్ కంపర్‌జేషన్ యాక్ట్ 1932 ప్రకారం కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి పది మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించి జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్‌కు 2018 జూలై 20న నోటీసులు పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో కార్మిక శాఖే బాధితుల్లో ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.9లక్షల వరకు మొత్తం రూ.68లక్షలు పరిహారం చెల్లించాలని ఆర్డర్ జారీ చేసింది. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. భద్రకాళి ఫైర్ వర్క్స్‌ను 2016లోనే తన బావమరిది, ఈ ఘటనలో చనిపోయిన రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు.
ఈ సమాధానాన్ని డిస్మిస్ చేస్తూ బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందేనని కార్మికశాఖ మరో ఆర్డర్ జారీ చేసింది. అయితే, పరిహారం చెల్లించకుండా తప్పించుకునేందుకే చనిపోయిన తన బావమరిదికి వర్క్‌షాప్ అప్పగించానని చెప్పినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువడింది. దీంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం యజమాని ఆస్తులను జప్తు చేసి చనిపోయిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కార్మిక శాఖ కోరింది. అయితే, ఇది ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నారు.
అంతా కూలీలే..
ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వర్క్‌షాప్‌కు వచ్చారు. అక్కడ జరిగిన పేలుడులో కాశిబుగ్గ తిలక్ రోడ్డుకు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీ నగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్‌దాసు అశోక్‌కుమార్ (30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40), కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్(35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్ (22) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
వీరిలో మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలు గుర్తు పట్టలేని విధంగా చిధ్రం కావడంతో డీఎన్‌ఏ పరీక్ష చేయించాల్సి వచ్చింది. ఇక బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు చెందిన పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, పేలుడు ఘటనతో ఫైర్ వర్క్స్ చుట్టుపక్కల సమారు 300 మీటర్ల దూరం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిలిపోయాయి. కొందరు మరమ్మతులు చేసుకుని ఉంటుండగా, మరికొందరు ఆ ఇళ్లను వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment