సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ పెరుగుతోంది. సరిగ్గా నెల క్రితంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత నెల 12న కరోనా నుంచి కోలుకున్నవారి రేటు 72.93 శాత ముంటే, ఈ నెల 12వ తేదీన 79.2 శాతానికి (దాదాపు 80 శాతం) పెరిగింది. ఇది మంచి పరిణామమని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత నెల అదే తేదీన కరోనా మరణాల రేటు 0.76 శాతముంటే, ఇప్పుడు 0.61 శాతానికి తగ్గడం గమనార్హం. వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 1,57,096 కరోనా కేసులు నమోదైతే, అందులో 1,24,528 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 961కి చేరుకుంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,607 కాగా, అందులో ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 24,674 మంది ఉన్నారు.
మరో 2,216 కేసులు..
ఇక రాష్ట్రంలో శనివారం 56,217 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 2,216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా కరోనాతో 11 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 21,34,912కి చేరింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 341 వచ్చాయి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్ జిల్లాలో 148, నల్లగొండ జిల్లాలో 126, కరీంనగర్ జిల్లాలో 119, వరంగల్ అర్బన్ జిల్లాలో 102, ఖమ్మం జిల్లాలో 105 కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment