
కమలాపూర్: ‘కేసీఆర్ డబ్బు, కుట్రలు, అవసరానికి మోసాన్ని నమ్ముకుంటాడే తప్ప ధర్మం, ప్రజలను నమ్ముకోడు.. ఈ కుట్రలకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గం..’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘కేసీఆర్ వందల కోట్ల డబ్బుపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో గెలవొచ్చు.. కానీ హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇక్కడ డబ్బు, నిర్బంధాలు, దబాయింపులకు ఆస్కారం లేదని.., రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్ అని అన్నారు. మండలంలోని ఉప్పల్ ఉద్యమాల గడ్డ అని, ఉద్యమ సమయంలో రైల్‌రోకో చేసినప్పుడు ఫైరింగ్ చేస్తామన్నా కూడా లెక్క చేయలేదని గుర్తుచేశారు. ‘ఒకప్పటి నీ ఉద్యమ సహచరుడిగా అడుగుతున్నా.. 2006లో నీ వెంట ఉన్నదెవరు.. మేము కాదా?’అని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. మీరు ఎంత డబ్బు ఇచ్చి మభ్యపెట్టినా ప్రజలు తన వెంటే ఉంటారన్నారు. రైతుబంధు పేదవాడికే ఇవ్వాలని, డబ్బున్న వారికి ఇవ్వొద్దని తాను చెప్పినట్లు ఈటల తెలిపారు. రైతుల పంటకు గిట్టబాటు ధర ఇవ్వాలనడంలో ఏం నేరముందో చెప్పాలన్నారు.