సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.
1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment