వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్‌లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది
వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు.
ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు.
‘ఆన్‌లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన
ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైల్‌లో పెంటారు.
27 రోజులు.. రూ.30కోట్లు
గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది.
పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు.
వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఓలు, ఆర్‌ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్‌మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు.
ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది
ఆస్తులు జప్తు, సీజ్
మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు.
పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి
పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి.
– శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment