Revenue dept
-
అమ్మో..! వసూలు కానీ పన్ను బకాయిలు ఇన్ని లక్షల కోట్లున్నాయా!
న్యూఢిల్లీ: వ్యవస్థలో పేరుకుపోయిన లక్షలాది కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకోడానికి రెవెన్యూ శాఖ పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది. ఇదే సమయంలో నిజాయితీ పన్ను చెల్లింపుదారులు వేధింపులకు గురికాకుండా చూడాలని సూచించింది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై మాత్రమే చర్యలు ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఇందుకు వీలుగా సోదాలు, స్వాదీనం వంటి చర్యలకు ముందు రెవెన్యూ శాఖ తగిన శ్రద్ధ వహించాలని స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయి సంఘం నివేదికా అంశాలు. ► 21 లక్షల కోట్లకు పైగా (ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 18.66 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ. 2.95 లక్షల కోట్లు) బకాయిలు ఉన్నందున వీటిని రాబట్టుకునేందుకు రెవెన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► బకాయి డిమాండ్‌లో ఎక్కువ భాగం ‘కష్టతరమైన రికవరీ’ కిందకు వస్తోంది. మొత్తం బకాయిల్లో ఈ విభాగం వాటా 94 శాతం. ► పరోక్ష పన్నులకు సంబంధించి రూ. 2.95 లక్షల కోట్లలో రూ. 2.58 లక్షల కోట్ల మొత్తం వసూలు చేయలేని పరిమాణం. అంటే బకాయి డిమాండ్‌లో దాదాపు 88 శాతం వసూలు చేయలేనిదన్నమాట. ఇక మిగిలిన 12 శాతం వసూలు చేయగలిగే పరిస్థితి ఉంది. వీటి వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ► కోవిడ్ మహమ్మారి పన్ను రికవరీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు భారీ బకాయిలు పెండింగులో ఉండడం పన్ను శాఖ పాలనా తీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అవినీతిపై ఇలా... పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు తమను రెవెన్యూ అధికారులు ‘‘నేరస్థులు’’గా పరిగణిస్తున్నారని చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు ‘లంచాలు’’ అడిగుతున్నారనీ ఆరోపణలు వచ్చాయి. తద్వారా సోదాలు, జప్తు పక్రియను కుదించడమో లేక, పూర్తిగా నిలిపివేయడమో జరుగుతోందని పార్లమెంటరీ కమిటీకి తెలుస్తోంది. అటువంటి తప్పుడు పనులపై పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా రెవెన్యూ శాఖను పార్లమెంటరీ కమిటీ కోరుతోంది. తప్పు చేసిన వారిపై రహస్యంగా ఫిర్యాదులు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించాలి. పన్ను బకాయిలు ఏటా పెరుగుతున్నాయి. సమయానుకూలమైన ఫాస్ట్‌ట్రాక్ మెకానిజం ద్వారా బకాయిలను రాబట్టుకోడానికి చర్యలు అవసరం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అవసరం. - పార్లమెంటరీ కమిటీ -
Telangana: ఆ ‘ట్రిపుల్’తోనే ట్రబుల్
సాక్షి, హైదరాబాద్: ఆ మూడు విభాగాలు ప్రజలకు అత్యవసరమైన విభాగాలు. వాటితో నిత్యం ఏదో ఒక పని ఉంటుంది. అయితే, ఆ విభాగాలపై ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి నేరుగా రావడంతోపాటు, ఏసీబీ, విజిలెన్స్... ఇలా పలు వ్యవస్థల ద్వారా అందుతూనే ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రతి నెలా నమోదు చేసే కేసుల్లోనూ ఈ శాఖలవే ఎక్కువ ఉండటం ఆందోళన రేపుతోంది. ఆ మూడు శాఖలు ఏంటంటే.. మున్సిపల్–అర్బన్ డెవలప్ మెంట్, పోలీస్, రెవెన్యూ, అవినీతి నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ నుంచి నివేదిక తెప్పించుకొని చర్యలకు సిఫారసు చేసే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ఈ విభాగాలపైనే ఫిర్యాదులు ఎక్కువ రావడం ఆందోళన రేపుతోంది. ఆయా శాఖల్లో ఎంత మందిపై ఫిర్యాదులు వచ్చాయి, ఎంతమందిపై చర్యలకు సిఫారసు చేశారన్న అంశాలను విజిలెన్స్ కమిషన్ త్రైమాసిక నివేదికలో వివరించింది. విభాగాల వారీగా...: రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ప్రభుత్వంలోని ప్రతీ విభాగం నుంచి అవినీతి, శాఖాపరమైన తప్పులు చేసిన వారిపై చర్యల నిమిత్తం కేసులు వస్తుంటాయి. అందులోభాగంగా గత జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 175 ఫైళ్లు వచ్చినట్టు విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు త్రైమాసికానికి సంబంధించి మరో 62 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంది. మొత్తం కేసుల్లో మున్సిపల్ శాఖవి 43, హోంశాఖ 38, రెవెన్యూ 27, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖవి 22 ఉన్నాయి. ఆ తర్వాత ఇరిగేషన్, రోడ్డు రవాణా శాఖలకు సంబంధించి ఫిర్యాదులున్నాయి. వీటిలో లంచం తీసుకుంటూ పట్టుబడినవి, ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టినవి, అధికార దుర్వినియోగం చేసిన కేసులున్నాయి. విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుల్లో... రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు కాకుండా నేరుగా విజిలెన్స్ కమిషన్‌కే నేరుగా ఫిర్యాదులు రావడం సహజం. అయితే ఇలా గత త్రైమాసికంలో మొత్తంగా 126 ఫిర్యాదులు 24 విభాగాలకు సంబంధించిన అధికారులపై వచ్చాయి. అందులో అత్యధికంగా 36 మున్సిపల్ శాఖవారిపైనే రావడం సంచలనం రేపుతోంది. ఆ తర్వాత రెవెన్యూలో 30 ఫిర్యాదులు రాగా, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్లోని అధికారులపై 10, హోం శాఖపై 8 ఫిర్యాదులు అందినట్టు విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. వీటిలో 112 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా, మిగిలిన 14 మందిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత విభాగాలను కమిషన్ ఆదేశించింది. మున్సిపల్ విభాగంలో ముగ్గురు గెజిటెడ్ అధికారులను, అటవీ శాఖలో ఒక గెజిటెడ్ అధికారి, ఒక నాన్ గెజిటెడ్ అధికారిని, రెవెన్యూలో ఒక నాన్ గెజిటెడ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు నివేదికలో పొందుపరిచారు. 32 మందిపై ప్రాసిక్యూషన్... 32 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ, ఇతర దర్యాప్తు విభాగాలు పంపిన ప్రతిపాదనలకు విజిలెన్స్ కమిషన్ అనుమతిచ్చింది. అందులో రెవెన్యూ అధికారులు ఆరుగురు ఉండగా, హోంశాఖ నుంచి నలుగురు, న్యాయశాఖలో ముగ్గురు, పీఆర్ విభాగంలో ముగ్గురున్నారు. ఇకపోతే శాఖాపరమైన విచారణలో 158 మందిపై సంబంధిత విభాగాల్లోని ఉన్నతాధికారులను చర్యలు తీసుకునే అధికారిగా నియమించింది. ఇలా 158 మంది అవినీతి అధికారులపై చర్యలకు సిఫారసు చేసిన జాబితాలో 69 మంది అధికారులతో మున్సిపల్ శాఖ మొదటి స్థానంలో ఉండగా, 49 మందితో రెవెన్యూ రెండో స్థానంలో ఉంది. ఇరిగేషన్లో 9 మంది, రెవెన్యూ (పీఅండ్‌ఈ)లో ఐదుగురు, హోం శాఖలో ముగ్గురు, అటవీ శాఖలో ఐదుగురు ఇలా ఇతర విభాగాల్లో మిగిలిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. 12 విభాగాల్లో 82 మందిపై మైనర్, మేజర్ పెనాల్టీ కింద చర్యలకు సిఫారసు చేసినట్టు కమిషన్ నివేదికలో వెల్లడించింది. -
వీఆర్ఏల బాగోతం.. ధరణిలో స్లాట్ బుకింగ్ పేరుతో..
సాక్షి, బీబీపేట(నిజామాబాద్): రెవన్యూ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం ‘ధరణి’ తీసుకొచ్చినా అవకతవకలకు అడ్డుకట్ట పడట్లేదు. రెవెన్యూ సిబ్బంది దోపిడీ ఆగట్లేదు. వాస్తవానికి రెవెన్యూలో లంచాలను నివారించేందుకు ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేసింది. భూ సమస్యల పరిష్కారానికి, సులువుగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల కోసం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటకీ రెవెన్యూ సిబ్బంది ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ధరణిలో స్లాట్ బుకింగ్ దగ్గరి నుంచీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వరకూ అంతా వారి కనుసన్నల్లో జరిగేలా ‘పట్టు’ పెంచుకున్నారు. బుకింగ్ నుంచి మొదలుకొని.. రెవెన్యూలో సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో మండల కార్యాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. భూ కొనుగోలుదారులు ముందుగా మీసేవ కేంద్రాలకు వెళ్లి ధరణిలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత తేదీ, సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇందులో ఇతరుల ప్రమేయం అవసరమే లేదు. అయితే, కొందరు వీఆర్ఏలు మాత్రం అన్నీ తామై కథ నడిపిస్తున్నారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వస్తున్న రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం తాము పూర్తి చేసిస్తామని, ఇంత మొత్తంలో ఖర్చవుతుందని మాట్లాడుకుంటున్నారు. ఒక్క మండలంలోనే 56 మందికి మెమోలు.. బీబీపేట మండలంలో ధరణి పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. మొత్తం 56 మంది వీఆర్ఏలకు ఇన్చార్జి తహసీల్దార్ శాంత రెండ్రోజుల క్రితం మెమోలు జారీ చేశారు. మరోసారి ఇలాంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించినట్లు తెలిసింది. రైతులు మీసేవ కేంద్రాల్లోనే స్లాట్లు బుకింగ్ వద్దనే చేసుకోవాలని, వీఆర్ఏలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. బీబీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఇటీవల భూమి కొనుగోలు చేశాడు. తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో స్థానిక వీఆర్ఏను సంప్రదించాడు. అయితే, ముందుగా ధరణిలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, దీంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల కోసం రూ.18 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అతడ్ని గుడ్డిగా నమ్మిన రైతు అడిగినంత ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.8 వేలలోపే అవుతుంది. కానీ, వీఆర్ఏ చేతివాటం ప్రదర్శించి రైతును రూ.రెండు వేలకు ముంచాడు. ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు.. గ్రామాల్లో రైతులతో ఉన్న సత్సంబంధాలను వీఆర్ఏలు దోపిడీకి వినియోగించుకుంటున్నారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాము పూర్తి చేయిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లో ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశముంది. దీంతో వీఆర్ఏలు తమ ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు పెట్టుకుని రైతుల పేరిట స్లాట్ బుకింగ్ చేస్తున్నారు. ఇందుకోసం నిర్దేశిత ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇక, ఆయా రైతులను మండలాఫీసుకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నారు. ఒకవేళ మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన రైతుల ఫైళ్లు కింద పెట్టి, వీఆర్ఏలు బుక్ చేసిన ఫైలును మీద పెట్టి తొందరగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చేస్తున్నారు. ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో వీఆర్ఏల ఆగడాలకు అడ్డుకట్ట పడట్లేదు. -
భూమికి ట్యాగ్‌లైన్, లోగోలతో భరోసా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూములను సంపూర్ణంగా సర్వే చేసి యజమానులకు వాటిపై శాశ్వత హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి మంచి పేరు, ట్యాగ్‌లైన్, లోగో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సర్వే నంబరుకు కచ్చితమైన హద్దుల నిర్దారణ, రైతులకు శాశ్వతహక్కుల కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూముల సమగ్ర రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అమలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకెళుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రీసర్వే యజ్ఞానికి శ్రీకారం చుడుతుండటం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద సాహసోపేత కార్యక్రమం అయినందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ప్రజలకు దీని ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత పేర్లు ఇవే... ఈ బృహత్తర కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా కొన్ని పేర్లను ప్రతిపాదించారు. ‘స్వక్షేత్ర’, ‘క్షేత్రఘ్న’, ‘స్వధాత్రి’, ‘స్వభూమి’, ‘వసుంధర’, ‘వసుధ’, ‘క్షేత్రపతి’, ‘భూమిదారు’ తదితర పేర్లను ప్రాథమికంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. మరికొన్ని పేర్లనూ పరిశీలించి అందులో ఒకదానిని ముఖ్యమంత్రి ఆమోదించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు ప్రతిపాదనలు ట్యాగ్ లైన్ కోసం ఏడు ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ‘మీ భూమికి మా హామీ’, ‘మీ భూమికి భద్రత’, ‘మీ భూమి పదిలం’, ‘మీ భూమికి శాశ్వత హక్కు‘, ‘ప్రతి క్షేత్రం పదిలం’, ‘మీ భూమికి మా భరోసా’, ‘ప్రతి క్షేత్రం క్షేమం’ అనే అంశాలను ట్యాగ్‌లైన్ కోసం ప్రాథమికంగా ప్రతిపాదించారు. రైతుపై నయాపైసా భారం ఉండదు రీ సర్వే కోసం ఎంత ఖర్చయినా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, భూ యజమానులపై నయాపైసా భారం కూడా వేయరాదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంబరు రాళ్ల ఖర్చును రైతులే చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినా అది కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాడు... గతంలో భూమి కొలతలు, సబ్ డివిజన్ చేయించుకోవాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చేది. ముందుగా మీసేవ కేంద్రంలో డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాల్సి వచ్చేది. ముడుపులు ఇవ్వనిదే సర్వేయరు వచ్చి భూమి కొలతలు వేయని పరిస్థితి. సర్వేయర్ల కొరతవల్ల నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. నేడు... వైఎస్ జగన్ సర్కారు రాగానే 11,500 పైగా గ్రామ సర్వేయర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయరు ఉన్నారు. ఎవరు భూమి కొలతలు వేయించుకోవాలన్నా గ్రామ/ వార్డు సచివాలయంలో అర్జీ ఇస్తే చాలు. వెంటనే సర్వేయరు వచ్చి పని పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) అనే అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూసర్వేకు కార్యాచరణ రూపొందించాం రాష్ట్రంలో 120 ఏళ్ల నుంచి భూముల సర్వే జరగలేదు. దీనివల్ల చాలాచోట్ల సరిహద్దు రాళ్లు లేవు. పెద్ద సంఖ్యలో పొలంగట్ల వివాదాలు ఉన్నాయి. రికార్డులు సక్రమంగా లేనందున రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్లే రికార్డులను స్వచ్ఛీకరించి ట్యాంపర్డ్ ఫ్రూఫ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన మార్గనిర్దేశం ప్రకారం భూ సర్వేకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. - వి. ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి. -
హవ్వ.. నిరుపేదకు 12 ఎకరాలా?
సాక్షి, అద్దంకి: సెంటు భూమి లేని ఓ నిరుపేద పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాల భూమి ఉన్నట్లుగా మీ భూమి పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి అమ్మ ఒడి పథకానికి అనర్హుడయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన దాసరి బుల్లెయ్యకు ఒక కుమారుడున్నాడు. అమ్మ ఒడి పథకం కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు రిజక్ట్ అయింది. ఎందుకైందని పరిశీలిస్తే నీ పేరిట 12 ఎకరాల భూమి ఉందని చెప్పారు. దీంతో అవాక్కయిన బల్లెయ్య మీ భూమి అడంగల్ వెబ్సైట్లో పరిశీలించగా, బుల్లెయ్య ఆధార్ నంబరుతో, ఖాతా నంబరు 2408 పేరుతో దక్షిణ అద్దంకిలోని వీరభద్రస్వామి దేవస్థానానికి చెందిన 1353/2, 1354 సర్వే నంబర్లకు సంబంధించి 12.64 ఎకరాలు భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీంతో బుల్లెయ్య లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు సెంటు భూమి కూడా లేకున్నా ఇదేమిటని వాపోతున్నాడు. -
ఏసీబీ ‘ఫీవర్’.. అధికారి హడల్
సాక్షి, కర్నూలు : ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో అవినీతి చేపలను పట్టేస్తోంది. దీంతో మిగిలిన ఉద్యోగుల గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి. ఏసీబీ అధికారులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడి చేస్తారోనన్న భయంతో కార్యాలయాలకు సైతం సరిగా వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కాసేపు మాత్రమే సీట్లో కూర్చుని.. తుర్రుమంటున్నారు. ఎక్కడికెళ్లారని ఎవరైనా ప్రశ్నిస్తే.. క్యాంపుల పేరు చెబుతున్నారు. ఈ కోవలోనే కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలోని ‘ముఖ్య’ అధికారి కూడా ఏసీబీ ‘ఫీవర్’తో వణికిపోతున్నట్లు తెలిసింది. ఈ నెల 16న కల్లూరు ఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్ఏ మద్దిలేటి ఓ గన్‌లైసెన్స్ అప్‌గ్రేడ్ విషయంలో దరఖాస్తుదారుడికి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనికి ముందు ఈ నెల ఎనిమిదో తేదీన రూ.4 లక్షల లంచం కేసులో గూడూరు తహసీల్దార్ షేక్ హసీనాబీపై ఏసీబీ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాలతో కల్లూరు మండల ‘ముఖ్య’ అధికారిలోనూ వణుకు మొదలైంది. పైగా ఆయన..హసీనాబీతో ఫోన్లో సంభాషించారని, ఈ విషయం ఏసీబీకి తెలియడంతో విచారణ కూడా చేసిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో తనకు కూడా ఏసీబీ ఉచ్చు బిగిస్తుందనే భయంతో కార్యాలయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ జిల్లా ఉన్నతాధికారి సైతం ‘బీకేర్ ఫుల్’ అని హెచ్చరించడంతో పాటు ఎక్కువ సమయం కార్యాలయంలో కూర్చోవద్దని సలహా ఇచి్చనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ పది అర్జీలపై చకచకా సంతకాలు చేసేసి..మీటింగ్‌లు, క్యాంపులంటూ వెళ్లిపోతున్నారు. అవస్థలు పడుతున్న ప్రజలు ‘ముఖ్య’ అధికారి అందుబాటు ఉండకపోవడంతో వివిధ పనుల నిమిత్తం కల్లూరు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలు అవస్థ పడుతున్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలు, ఇంటి పట్టా మార్పిడి, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, ఆన్లైన్లో భూమి నమోదు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ వంటి పనులు ఆలస్యమవుతున్నాయి. ఏడాది నుంచి తిప్పుకుంటున్నారు లక్ష్మీపురం సర్వే నెంబర్ 11లో పెద్దగిడ్డయ్య నుంచి 2.78 ఎకరాల పొలాన్ని 2017లో నా కుమారులు సునిల్‌కుమార్, అనిల్ కుమార్ పేరుతో కొన్నాం. 2018 ఆగస్టులో పట్టాదారు పాసుపుస్తకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. గత వీఆర్ఓకు రెండు పాస్బుక్కులకు గానూ రూ.6వేలు లంచం ఇచ్చా. అయినా ఇప్పటికీ ఇవ్వలేదు. ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అధికారులు లేరని చెబుతున్నారు. – రమాదేవి, డోన్ పనులు చేయడం లేదు రేషన్‌కార్డులో తప్పులుంటే మార్పు కోసం మీ సేవలో దరఖాస్తు చేశాం. పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్‌ను అడిగితే చేస్తాం.. చూస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. పైగా ఇక్కడి అధికారులు కార్యాలయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండడం లేదు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి గాడిలో పెట్టాల్సిన అవసరముంది. – నవకోటి నారాయణ, తడకనపల్లె, కల్లూరు మండలం -
ఆగని ఇసుక దోపిడీ
సాక్షి, పెరవలి: జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డాగా ఉన్న పెరవలి మండలంలో తెలుగుతమ్ముళ్లు బరితెగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా తమ ఇసుక దందా మాత్రం ఆపడం లేదు. ఎక్కడికక్కడ ఇసుక నిల్వలు వేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకుపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇసుకను నిల్వచేయకూడదని నిబంధనలు ఉన్నా అధికారపార్టీ నాయకులకు, అధికారులకు ఇవేమీ పట్టడం లేదు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా గోదావరికి తూట్లు పొడిచినప్పుడు కూడా అధికార యంత్రాంగం ఇలాగే ప్రేక్షకపాత్ర పోషించింది. పత్తాలేని అధికారులు ఉచిత ఇసుక విధానంలో ఎక్కడా నిల్వలు చేయకూడదని అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికారుల ప్రకటనలు ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ డిపార్టుమెంటు అధికారులు పట్టించుకోకపోవడంతో దళారీలు మరింత రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ నిల్వలు నియోజకవర్గంలో నిడదవోలు మండలంలో పెండ్యాల, పురుషోత్తపల్లి, కోరుపల్లి, పెరవలి మండలంలో ఉసులుమర్రు, కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం, తీపర్రు గ్రామాల్లో వందలాది లారీల నిల్వలు ఉన్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. స్థానికులు ఈ లారీల మోత భరించలేక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. రోడ్డు పక్కన, పుంతరోడ్లు, లేఅవుట్లలో వేస్తున్నారు. ఇలా వేసినందుకు ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందుతున్నట్టు సమాచారం. రోజుకు రూ.30 వేల పైగా ఆదాయం ఇసుక గుట్టల నుంచి యూనిట్‌కి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్న దళారీలు ఒకలారీకి రూ.3 వేలు మిగలడంతో తెలుగు తమ్ముళ్లు అంతా ఇసుక దందానే కొనసాగిస్తున్నారు. రోజుకి 10 లారీలు చొప్పున ఒక్కో నాయకుడు అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరూ రోజుకు రూ.30 వేల వరకు ఇసుక దోపిడీలో సంపాదిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా తోలకాలు అధికార పార్టీ నాయకుల వాహనాలకు అడ్డు చెప్పే ధైర్యం అధికారులకు లేకపోవడంతో వీటిపై ఎలాంటి ఆంక్షలు ఉండటం లేదు. నేరుగా ర్యాంపులోకి వెళ్లి ఇష్టమొచ్చినంత లోడ్ చేసుకుని వెళ్లిపోతున్నారు. దీనిపై కూలీలు కూడా మండిపడుతున్నారు. నిబంధనల కంటే అధికంగా లోడ్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. నిబంధనలకు తూట్లు రెండు యూనిట్లు మించి వాహనాల్లో ఇసుక తరలించకూడదని నిబంధనలు ఉన్నా తెలుగు తమ్ముళ్లు చేస్తున్న వ్యాపారానికి వినియోగిస్తున్న వాహనాలు అన్ని 5 యూనిట్ల బండ్లే కావడం విశేషం. వీటితో దర్జాగా రోడ్లుపై రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 5 యూనిట్ల వాహనాల్లో ఇసుక తరలించకూడదని అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న అధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఈ వాహనాల ఎగుమతులకు దళారీలు పొక్లెయినర్లను వినియోగిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కానూరులో ఒక వ్యక్తి అక్రమ నిల్వలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే అతనిపై దళారీలు పరువునష్టం దావా వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు అక్రమంగా నిల్వ చేసుకున్న ఇసుక గుట్టల జోలికి అధికారులు రాకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీసులకు భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నట్టు సమాచారం. అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిల్వలకు గాను 10 రోజులకు రెవెన్యూ అధికారులకు రూ.3 వేల చొప్పున ఇస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. -
మహా దూకుడు
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు. ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు. ‘ఆన్లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్సైల్లో పెంటారు. 27 రోజులు.. రూ.30కోట్లు గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు. వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓలు, ఆర్ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది ఆస్తులు జప్తు, సీజ్ మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి. – శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్ -
రెవెన్యూ ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్) : 1985లో మండల వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో జిల్లా జనాభా 22 లక్షలు. అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖకు సంబంధించి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుత జనాభా దాదాపు 45 లక్షలు. పదేళ్లకోసారి రెవెన్యూ శాఖను పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో 33ఏళ్ల క్రితం ఉన్న పోస్టులతోనే పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది పై పనిభారం అధికమవుతోంది. ఒక్కోసారి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడంతో పాటు సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోంది. లేకపోతే మెమోలు అందుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి జనాభా ప్రకారం.. మండలాలకు 1985లో జనాభా ప్రాతిపదికన ఎమ్మార్వో, సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంటు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు చేశారు. నియోజకవర్గ కేంద్రాల మండలాలకు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టు, ఒక ఎన్నికల డీటీ పోస్టును అదనంగా కేటాయించారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సిబ్బంది కొరత.. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు మూడు తహసీల్దారు, మూడు డీటీ పోస్టులు, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు మంజూరు చేసింది. 2017లో చుక్కల భూముల క్రమబద్ధీ్దకరణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం పోస్టులను మాత్రం కేటాయించలేదు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించుకోవాలని మాత్రమే సూచించింది. ఇప్పటికే పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టంతో ఊపిరితిప్పుకోలేకపోతున్నారు. మండలస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కరువయ్యారు. వీటికి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకొని దరఖాస్తుల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. ఉన్న పోస్టుల్లోనూ ఖాళీలు.. 1985లో మంజూరు చేసిన పోస్టులయిన భర్తీగా ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని సీనియర్ అసిస్టెంట్లు, డీటీలు, తహసీల్దారు కేడర్ వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీఆర్వో పోస్టులు 792 ఉండగా 150 వరకు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంటు పోస్టులు 216 ఉండగా 35 పోస్టులు, సీనియర్ అసిస్టెంటు పోస్టులు 198 ఉండగా 25 పోస్టులు, తహసీల్దారు పోస్టులు 72 ఉండగా 6 పోస్టులు, డీటీ పోస్టులు 123 ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతంత మాత్రం ఉన్న సిబ్బందిని కూడా వివిధ అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తుండటం వల్ల ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రెవెన్యూ సిబ్బందిపై పని ఒత్తిడి.. 1985లో మండలాల్లో సగటున వందల్లోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సి వస్తోంది. ఎన్నికల విధులు, భూముల వ్యవహారాలు, విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాలకు అవసరమైన ధ్రువపత్రాల జారీ, ప్రొటోకాల్ విధులు, ప్రజా పంపిణీ, లాం అండ్ ఆర్డర్, విపత్తుల నిర్వహణ, పంటల నమోదు, భూముల సర్వే, మైనింగ్ వ్యవహారాలు, ఇతర శాఖల వ్యవహారాలు తదితర విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చుక్కల భూముల క్రమబద్ధీక రణ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని పెంచాలి జనాభా ప్రాతిపదికన తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు పోస్టులను పెంచాలి. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న వారిని ఇతర అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై పని భారం అధికమవుతోంది. అన్ని కేటగిరి పోస్టులను పెంచడంతో పాటు, చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమలుకు ప్రత్యేక పోస్టులు మంజూరు చేయాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. – రాజశేఖర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ -
విచారణ వలకు.. తిమింగలాలు చిక్కేనా?
► భూ అక్రమాలపై విచారణకు అధికారుల కసరత్తు ► అన్ని వివరాలతో రాష్ట్ర అధికారులకు సమగ్ర నివేదిక ► దాన్ని పరిశీలించాక.. వారంలో వేదిక నిర్ణయం ► స్కాముల సూత్రధారులందరూ టీడీపీ నేతలే ► అందుకే విచారణపై సర్వత్రా అనుమానాలు విశాఖ సిటీ: జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఈనెల 15న నిర్వహించనున్న బహిరంగ విచారణకు జిల్లా యంత్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నివేదికను గురువారం సాయంత్రం రాష్ట్ర రెవెన్యూ, భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు పంపింది. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి అధికారులు బహిరంగ విచారణ వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై జిల్లా అధికారులకు వారం రోజుల్లో ఆదేశాలు జారీచేయనున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతోనే.. రికార్డులు మార్చేసి.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు సాగించిన 6 వేలకుపైగా ఎకరాల భూ దందాపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా ఈ దందా వ్యవహారం బట్టబయలు చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బహిరంగ విచారణ కోసం ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సహా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి సీనియర్ అధికారుల బృందం, సర్వే బృందం హాజరుకానుంది. ఇందుకు అవసరమైన నివేదికలు తయారు చేయడంలో రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. గురువారం సాయంత్రం నివేదికలను కమిషనరేట్‌కు పంపారు. ⇒ ఏఏ మండలాల్లో రికార్డులు గల్లంతయ్యాయి, దాని కారణాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ⇒పాత అసైన్మెంట్ భూములు, వాటిలో ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే.. వాటికి సంబంధించిన పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వివరాలను పేర్కొన్నారు. ⇒గత ఆరు నెలలుగా ఈ తరహా కేసులు ఎన్ని వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించారు. జిల్లాలోని 43 మండలాల్లో ఎక్కడ ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయనే అంశాలను రెవెన్యూ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. వారం రోజుల్లో వేదిక ప్రకటన జిల్లా యంత్రాంగం పంపిన ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. బహిరంగ విచారణ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సంబం«ధిత శాఖ అధికారులు ప్రకటిస్తారు. రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా వేదికను గుర్తించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించే హాల్లో విచారణ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులున్న నేపథ్యంలో ఈ సమావేశ మందిరం సరిపోదన్న వాదన కూడా ఉంది. రాష్ట్ర అధికారుల సూచన మేరకు విచారణ వేదికను ఎంపిక చేస్తామని వారి ఆదేశాల మేరకు సమయం, ప్రాంతాన్ని వెల్లడిస్తామని జాయింట్ కలెక్టర్ సృజన తెలిపారు. -
రెవెన్యూశాఖలో బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి తన చాంబర్లో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి డిప్యూటీ తహశీల్దారులు (డీటీ), సీనియర్ అసిస్టెంట్లు(ఎస్ఏ), జూని యర్ అసిస్టెంట్లు (జేఏ), వీఆర్ఓలకు కౌన్సెలింగ్ చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు డీటీలు, 10 మంది ఎస్ఏ, నలుగురు జూనియర్ అసిసెంట్లు, ఒక టైపిస్టు, 55 మంది వీఆర్ఓలు హాజరయ్యారు. -
ఆర్థికవృద్ధికి ఊతం...పన్నుల్లో ఉపశమనం
న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధి మరింత పుంజుకునేలా చేస్తూ, ఉద్యోగవకాశాలను పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిమితుల్లో పలు రకాల చర్యలు తీసుకుంటోంది. తక్కువ పన్ను చెల్లించేవారికి, వ్యాపారాలకు, నిపుణులకు పన్నుల్లో ఉపశమనం కల్పించనున్నట్టు ప్రకటించింది. పన్నుమినహాయింపు పరిమితిని ఆదాయపు పన్ను యాక్ట్ 1961, సెక్షన్ 80సీ ప్రకారం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదనంగా రూ.50వేలను నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సహాయపడేలా ప్రకటన విడుదల చేసింది. చిన్న పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారాలకు, ఉద్యోగస్తులకు పన్నుల్లో కొంత ఉపశమనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ తీసుకొనే చర్యలను బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కల్గిన చిన్న వ్యాపారస్తులకే ముందస్తు పన్నుల వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ప్రకటన విడుదలచేసింది. అదేవిధంగా రూ.50లక్షల ఆదాయం వరకు ఉన్న ప్రొఫెషనల్స్ కూ ముందస్తు పన్నుల ప్రయోజనం కల్పించనున్నట్టు పేర్కొంది. కొత్తగా తయారీ కంపెనీలు ఏర్పాటు చేసే వారికి కార్పొరేట్ పన్నులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గృహరంగానికి ఇచ్చే పన్ను లబ్దిని కూడా పెంచడంతో నిర్మాణ పరిశ్రమకు ఊతం కల్పించనున్నారు. రాయల్టీ, టెక్నికల్ సర్వీసులపై పన్నుల రేటును 25 నుంచి 10 శాతానికి కుదించారు. కొత్తగా ప్రారంభించబోయే కంపెనీలకు(స్టార్టప్) మూడు సంవత్సరాలు 100శాతం పన్నుల రాయితీని కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి మరింత ఊతం అందిస్తూ ఉద్యోగవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.