న్యూఢిల్లీ: వ్యవస్థలో పేరుకుపోయిన లక్షలాది కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకోడానికి రెవెన్యూ శాఖ పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది. ఇదే సమయంలో నిజాయితీ పన్ను చెల్లింపుదారులు వేధింపులకు గురికాకుండా చూడాలని సూచించింది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై మాత్రమే చర్యలు ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఇందుకు వీలుగా సోదాలు, స్వాదీనం వంటి చర్యలకు ముందు రెవెన్యూ శాఖ తగిన శ్రద్ధ వహించాలని స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయి సంఘం నివేదికా అంశాలు.
► 21 లక్షల కోట్లకు పైగా (ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 18.66 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ. 2.95 లక్షల కోట్లు) బకాయిలు ఉన్నందున వీటిని రాబట్టుకునేందుకు రెవెన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలి.
► బకాయి డిమాండ్‌లో ఎక్కువ భాగం ‘కష్టతరమైన రికవరీ’ కిందకు వస్తోంది. మొత్తం బకాయిల్లో ఈ విభాగం వాటా 94 శాతం.
► పరోక్ష పన్నులకు సంబంధించి రూ. 2.95 లక్షల కోట్లలో రూ. 2.58 లక్షల కోట్ల మొత్తం వసూలు చేయలేని పరిమాణం. అంటే బకాయి డిమాండ్‌లో దాదాపు 88 శాతం వసూలు చేయలేనిదన్నమాట. ఇక మిగిలిన 12 శాతం వసూలు చేయగలిగే పరిస్థితి ఉంది. వీటి వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు.
► కోవిడ్ మహమ్మారి పన్ను రికవరీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు భారీ బకాయిలు పెండింగులో ఉండడం పన్ను శాఖ పాలనా తీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అవినీతిపై ఇలా...
పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు తమను రెవెన్యూ అధికారులు ‘‘నేరస్థులు’’గా పరిగణిస్తున్నారని చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు ‘లంచాలు’’ అడిగుతున్నారనీ ఆరోపణలు వచ్చాయి. తద్వారా సోదాలు, జప్తు పక్రియను కుదించడమో లేక, పూర్తిగా నిలిపివేయడమో జరుగుతోందని పార్లమెంటరీ కమిటీకి తెలుస్తోంది. అటువంటి తప్పుడు పనులపై పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా రెవెన్యూ శాఖను పార్లమెంటరీ కమిటీ కోరుతోంది. తప్పు చేసిన వారిపై రహస్యంగా ఫిర్యాదులు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించాలి.
పన్ను బకాయిలు ఏటా పెరుగుతున్నాయి. సమయానుకూలమైన ఫాస్ట్‌ట్రాక్ మెకానిజం ద్వారా బకాయిలను రాబట్టుకోడానికి చర్యలు అవసరం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అవసరం. - పార్లమెంటరీ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment