Tax arrears
-
ఏపీఐఐసీ కీలక నిర్ణయం.. పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేలా ఏపీఐఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక యూనిట్లు చెల్లించాల్సిన పన్ను బకాయిలను ఒకేసారి కట్టేస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఐఐసీ ప్రకటించింది. ఏటా ఒకేసారి పన్ను చెల్లించే వారికి కూడా 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీఐఐసీ ఈ ఉత్తర్వులిచ్చింది. రాయితీ మార్గదర్శకాలను సీజీజీ ఆన్లైన్ పోర్టల్‌లో ఏపీఐఐసీ ఉంచింది. 2022–23 సంవత్సరానికి ఆస్తి పన్నును బకాయిలతో కలిపి జూలై 31వ తేదీలోగా చెల్లించిన వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలకు ఇది వర్తిస్తుంది. అర్బన్ ఐలాల్లో మాత్రం జూన్ 30 లోపు చెల్లించిన వారికి పెనాల్టీలో కూడా తగ్గింపు ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.60 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు ఏపీఐఐసీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మార్గదర్శకాలిచ్చారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
అమ్మో..! వసూలు కానీ పన్ను బకాయిలు ఇన్ని లక్షల కోట్లున్నాయా!
న్యూఢిల్లీ: వ్యవస్థలో పేరుకుపోయిన లక్షలాది కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకోడానికి రెవెన్యూ శాఖ పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది. ఇదే సమయంలో నిజాయితీ పన్ను చెల్లింపుదారులు వేధింపులకు గురికాకుండా చూడాలని సూచించింది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై మాత్రమే చర్యలు ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఇందుకు వీలుగా సోదాలు, స్వాదీనం వంటి చర్యలకు ముందు రెవెన్యూ శాఖ తగిన శ్రద్ధ వహించాలని స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయి సంఘం నివేదికా అంశాలు. ► 21 లక్షల కోట్లకు పైగా (ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 18.66 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ. 2.95 లక్షల కోట్లు) బకాయిలు ఉన్నందున వీటిని రాబట్టుకునేందుకు రెవెన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► బకాయి డిమాండ్‌లో ఎక్కువ భాగం ‘కష్టతరమైన రికవరీ’ కిందకు వస్తోంది. మొత్తం బకాయిల్లో ఈ విభాగం వాటా 94 శాతం. ► పరోక్ష పన్నులకు సంబంధించి రూ. 2.95 లక్షల కోట్లలో రూ. 2.58 లక్షల కోట్ల మొత్తం వసూలు చేయలేని పరిమాణం. అంటే బకాయి డిమాండ్‌లో దాదాపు 88 శాతం వసూలు చేయలేనిదన్నమాట. ఇక మిగిలిన 12 శాతం వసూలు చేయగలిగే పరిస్థితి ఉంది. వీటి వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ► కోవిడ్ మహమ్మారి పన్ను రికవరీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు భారీ బకాయిలు పెండింగులో ఉండడం పన్ను శాఖ పాలనా తీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అవినీతిపై ఇలా... పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు తమను రెవెన్యూ అధికారులు ‘‘నేరస్థులు’’గా పరిగణిస్తున్నారని చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు ‘లంచాలు’’ అడిగుతున్నారనీ ఆరోపణలు వచ్చాయి. తద్వారా సోదాలు, జప్తు పక్రియను కుదించడమో లేక, పూర్తిగా నిలిపివేయడమో జరుగుతోందని పార్లమెంటరీ కమిటీకి తెలుస్తోంది. అటువంటి తప్పుడు పనులపై పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా రెవెన్యూ శాఖను పార్లమెంటరీ కమిటీ కోరుతోంది. తప్పు చేసిన వారిపై రహస్యంగా ఫిర్యాదులు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించాలి. పన్ను బకాయిలు ఏటా పెరుగుతున్నాయి. సమయానుకూలమైన ఫాస్ట్‌ట్రాక్ మెకానిజం ద్వారా బకాయిలను రాబట్టుకోడానికి చర్యలు అవసరం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అవసరం. - పార్లమెంటరీ కమిటీ -
ఒక్క రోజే గడువు
ప్రొద్దుటూరు టౌన్ :ప్రభుత్వం ఈ ఏడాది పన్ను వసూలుకు విధించిన గడువు శనివారంతో ముగియనుంది. వంద శాతం పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కాలేదు. పన్ను బకాయి ఉన్న వారి ఇళ్ల వద్దకు, వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి గంటకొడుతున్నా, విద్యుత్, కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు వసూళ్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాలు వదలి రోడ్లపైనే ఉంటున్నారు. అయినా జిల్లాలోని ఏ మున్సిపాలిటీ వంద శాతం పన్ను వసూలు చేయాలేదు. మరొక్క రోజే గడువు ఉండటంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వసూళ్లలో వెనుకబడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో బకాయిలు ఇచ్చేంత వరకు అధికారులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారానికి పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో పులివెందుల మున్సిపాలిటీ ఉండగా, చివరి స్థానంలో రాయచోటి మున్సిపాలిటీ నిలిచింది. పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల బ కాయిలు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి రూ.74లక్షలు బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కమిషనర్ బండి శేషన్న, ఆర్ఓ మునికృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని నిరసన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ విధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. గత ఏడాది కంటేరూ.2కోట్లు అధికంగా వసూలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.14.82 కోట్లు ప్రైవేటు ఆస్తులపై, కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో శుక్రవారానికి రూ.11.84 కోట్లు వసూలైంది. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.2కోట్లు అధికంగా వసూలు చేశాం. ప్రభుత్వ బకాయిలు రూ.1.80 కోట్లు ఉండగా రూ.18 లక్షలు మాత్రమే వసూలైంది. శనివారంలోగా 80 శా తానికిపైగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తాం. – మునికృష్ణారెడ్డి, మున్సిపల్ ఆర్ఓ, ప్రొద్దుటూరు. -
బడాబాబులపై ‘జీఎస్టీ’ నజర్
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేతకు పాల్పడుతున్న బడాబాబులపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ దృష్టి సారించింది. గత మూడు, నాలుగేళ్లుగా పన్ను బకాయి పడ్డ వారికి నోటీసు లు జారీ చేసి వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.47 కోట్ల మేర పన్ను బకాయిలు రాబట్టామని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. అందు లో పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలున్నాయని, బడా నిర్మాతలు కూడా ఉన్నారని తెలిపారు. జీఎస్టీ పరిధిలో డీలర్‌గా రిజిస్టర్ అయి ఇప్పటివరకు పన్ను రిటర్నులు దాఖలు చేయని 23వేల మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం ఈ నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే 1,200 మంది రిటర్నులు దాఖలు చేశారని, ఒక్క బేగంబజార్ డివిజన్ నుంచే రూ.80 లక్షల పన్ను వసూలయిందని వారు చెప్పారు. ఈ నోటీసులందుకున్న వారిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఓ బంగారు దుకాణం కూడా ఉందని సమాచారం. జాతీయ స్థాయిలో మంచి పేరున్న జ్యుయెల్లరీ బ్రాండ్‌కు ఫ్రాంచైజీగా ఉన్న ఆ దుకా ణం పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడంతో నోటీసులిచ్చారు. రూ. కోటి వరకు పన్ను చెల్లించాలని గుర్తించి ఏవీ(2) నివేదిక ప్రకారం కేసు కూడా నమోదు చేశారు. సిగరెట్ల పన్ను ఎగవేత... తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ అధికారులు ఓ అంతర్రాష్ట్ర సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. పట్నా నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు పన్ను కట్టకుండా తరలిస్తున్న ఓ సిగరెట్ లోడ్‌ను బుధవారం పట్టుకున్నారు. మొత్తం రూ.24 లక్షల విలువ చేసే 3 లక్షల సిగరెట్లను పట్టుకున్నారు. గోల్డ్‌స్టెప్ టుబాకో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్యారిస్ బ్రాండ్ మీద సిగరెట్లు తయారుచేసి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు గుర్తించారు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
బీసీసీఐ పన్ను బకాయిలు రూ. 860 కోట్లు
న్యూఢిల్లీ: అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు రూ. 860 కోట్లు బకాయి పడింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ దరఖాస్తుకు స్పందించిన ఐటీ శాఖ బీసీసీఐ పన్ను చెల్లింపు వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 9వ తేదీ వరకు బీసీసీఐ చెల్లించాల్సిన మొత్తం ఆదాయపు పన్ను రూ. 1325.31 కోట్లు. అయితే ఇందులో (2014–15 అసెస్మెంట్ ఇయర్) రూ. 864.78 కోట్లు ఇదివరకే చెల్లించింది. ఇంకా రూ.460.52 కోట్లు బకాయి పడింది. దీనికి 2015–16 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన పన్ను రూ. 400 కోట్లు కలపడంతో మొత్తం పన్ను బకాయి రూ. 860. 52 కోట్లకు చేరిందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. బకాయి మొత్తాలను రాబట్టుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఐటీ శాఖ సమాచార కమిషనర్ బిమల్ జుల్కా తెలిపారు. -
ఒంగోలు కార్పొరేషన్ లో ... పడకేసిన పన్నులు
♦ ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.6 కోట్ల పైనే ♦ రెవెన్యూ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సమన్వయ లోపం ♦ గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది సగం శాతమే వసూలు ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన పన్నుల బకాయిలు రూ.6కోట్ల పైనే ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాలు, సమావేశ మందిరాలు కలిపి మొత్తం రూ.6 కోట్ల 7లక్షల 96వేల రూపాయలు బకాయిలున్నారుు. జిల్లా కలెక్టరేట్ (ప్రకాశంభవనం) అక్షరాలా రూ.23 లక్షల పన్ను బకాయి ఉంది. కలెక్టర్ బంగళా పన్ను రూ.5.74 లక్షలు బకాయి పడింది. ఆర్ అండ్ బీ భవనాలకి సంబంధించి అత్యధికంగా రూ.3కోట్ల వరకూ బకాయిలుండటం గమనార్హం. జిల్లా కోర్టుల సముదాయం రూ.5.43 లక్షలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూ.1.53 లక్షలు పోలీసు కళ్యాణ మండపం రూ.14 లక్షలు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (పాత రిమ్స్) రూ.56.92 లక్షలు ఉన్నాయి. పన్నుల వసూళ్ల కోసం తిరిగే నగరపాలక సిబ్బందికి సంబంధించిన ఆస్తి పన్నుల బకాయిలే దాదాపుగా రూ.2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు రూ.6కోట్లు పడకేశారుు. దీనికి కారణం రెవెన్యూ విభాగంలో అధికారులకు సిబ్బందికి మధ్య సమన్వయ లోపంగా కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 16న రెవెన్యూ అధికారి మంజులా కుమారిని డీఎంఏ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీహరిని ఇన్చార్జి ఆర్ఓగా నియమించారు. అప్పటి నుంచి అదే సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వరకు ఇన్చార్జి ఆర్ఓ పర్యవేక్షణలోనే రెవెన్యూ విభాగం పనిచేసింది. పాలనా సౌలభ్యం కోసం గత నాలుగు మాసాల క్రితం ఏళ్ల తరబడి రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో కొంతమందిని వేరే విధులను కేటాయించి ఆ స్థానంలో కొత్తగా మరికొంతమందిని తీసుకోవాలని కమిషనర్ భావించారు. కానీ ఈ సీట్లకు బయట ఆదాయం రావడంతో స్థానిక ఎమ్మేల్యేతోపాటు ఇతర తెలుగు తమ్ముళ్ల ఆశీస్సులతో కొంతమంది పోస్టులను దక్కించుకున్నారు. అయినా పన్నుల వసూలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ముందుకు కదల లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు పన్నుల వసూలు 51 శాతమే.. నగరంలో ఉన్న మొత్తం అసిస్మెంట్లు 42,962కి గాను 2015-16కి వసూలు చేయాల్సిన పన్ను రూ.20.19 కోట్లు. దీంతో ఇప్పటికి దాదాపుగా రూ.10 కోట్ల వరకు వసూలు చేసి 51 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇంకా రూ.10 కోట్ల వరకువసూలు చేయాల్సి ఉంది. మార్చి నెల కావడంతో బృందాలుగా ఏర్పడి నగరంలో హడావుడి చేయడానికే రెవెన్యూ యంత్రాంగం పరిమితవుతోంది గానీ పైసలు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలున్నారుు. నీటి పన్ను రూ.4 కోట్ల 9లక్షలుండగా దానిలో రూ.1కోటి 56 లక్షలు వసూలు చేసి 38.17 శాతం పూర్తి చేశారు. -
భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: పన్ను వివాదాల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్.. భారత్‌లో దీర్ఘకాల ఇన్వెస్టరుగా కొనసాగుతామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో తమకు నిర్మాణాత్మక సంబంధాలే ఉన్నాయని పేర్కొంది. దాదాపు రూ. 14,200 కోట్ల పన్ను బకాయిలు కట్టకపోతే సంస్థ ఆస్తులు జప్తు చేస్తామంటూ ఆదాయ పన్ను శాఖ మంగళవారం నోటీసులు పంపిన దరిమిలా వొడాఫోన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పన్ను వసూళ్లలో కఠిన వైఖరులు వద్దు
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు న్యూఢిల్లీ: పన్నుల బకాయిలు రాబట్టడంలో బలవంతంగా, కఠినంగా ఉండే విధానాలను ప్రయోగించకుండా ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. వివాదాల పరిష్కారానికి ఇతరత్రా మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని పేర్కొంది. వ్యాపారాల నిర్వహణ సరళతరం చేసే అంశంపై రూపొందించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (వాణిజ్య శాఖ) ఈ మేరకు పలు సూచనలు చేసింది. వొడాఫోన్, షెల్ వంటి బహుళజాతి కంపెనీలతో పన్ను వివాదాల్లో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ప్రతికూలంగా తీర్పు రావడం తదితర అంశాలు అంతిమంగా పన్నుల విషయంలో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చాయని కమిటీ పేర్కొంది. ఇక, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్‌పై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వివాదం ప్రతిష్టను మరింత మసకబార్చిందని తెలిపింది. ప్రస్తుత ట్యాక్సేషన్ విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే... ఇది స్థిరంగా, అనూహ్య మార్పులకు లోను కాని విధంగా ఉండాలని కమిటీ సూచించింది. -
సీఏలపై ఉన్న అపోహను తొలగించుకోవాలి
సఏలకు కేఎం మణి సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఉన్న పన్ను బకాయిలను తక్షణం చెల్లించడానికి తమ క్లయింట్లను చార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ) సంసిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్ కేఎం మణి శుక్రవారం పేర్కొన్నారు. పన్నులను ఎలా తప్పించుకోవాలో చెప్పడమే సీఏల పనని కొందరిలో అపోహ ఉందని ఆయన పేర్కొంటూ... ఈ అపోహను తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే (సీఏ)నని కూడా మణి పేర్కొన్నారు. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ), పరోక్ష పన్నులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పరోక్ష పన్నుల కమిటీ ఇక్కడ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మణి మాట్లాడుతూ, తమ సభ్యుల్లో నైతిక ప్రమాణాలు పటిష్ట స్థాయిలో ఉండేలా ఐసీఏఐ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. -
చట్టబద్ధమైన పన్నులు కట్టాల్సిందే..
నోటీసులను వేధింపులుగా భావించనక్కర్లేదు ఎగవేతదారులకు భారత్ స్వర్గధామం కాదు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్నులు కట్టాలంటూ నోటీసులివ్వడాన్ని పన్నులపరమైన వేధింపులుగా పరిగణించనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సిందేనన్నారు. అలాగే, భారత్‌ను పన్ను రహిత స్వర్గధామంగా భావించరాదని ఆయన చెప్పారు. దాదాపు 100 విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 5-6 బిలియన్ డాలర్ల మేర పన్నుల నోటీసులు ఇవ్వడాన్ని సమర్థించిన జైట్లీ .. భారత్‌లో చట్టబద్ధమైన పన్నులను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. చట్టబద్ధమైన ప్రతీ పన్ను డిమాండ్‌నూ ట్యాక్స్ టైజం అంటూ వ్యాఖ్యానిస్తే వెనక్కి తగ్గిపోయేంత బలహీన పరిస్థితిలో భారత్ లేదని జైట్లీ స్పష్టం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా భారత మార్కెట్లలో పన్నులు చెల్లించకుండా పొందిన లాభాలపై తాజాగా 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ దాదాపు 100 ఎఫ్ఐఐలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పన్నుల నోటీసులపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కావాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, అయితే చట్టబద్ధంగా చెల్లించాల్సిన వాటిని మాత్రం చెల్లించి తీరాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా ఎదగాలనుకునే ఏ వర్ధమాన దేశం కూడా ట్యాక్స్ టైజం వంటి వాటికి పాల్పడే దుస్సాహసం చేయబోదన్నారు. మరోవైపు ఎఫ్ఐఐలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) మ్యాట్ విధింపునకు ముందు అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)కు కూడా మ్యాట్ వర్తిస్తుందని చెప్పిన మీదటే ఆదాయ పన్ను అసెసింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. పన్నుల చట్టాలు సరళతరం.. పన్నుల రేట్లను క్రమబద్ధీకరించే దిశగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాలను సరళతరం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని జైట్లీ చెప్పారు. బ్లాక్‌మనీపై కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లో నల్లధనం దాచిపెట్టుకున్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి, తగు పన్నులు కట్టేందుకు తగినంత సమయం ఇస్తామన్నారు. ఇక వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని, ఏప్రిల్ 20న మొదలయ్యే తదుపరి బడ్జెట్ సెషన్లో ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. పన్నులపరమైన సంస్కరణల్లో దేశ చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైనది కాగలదని ఆయన చెప్పారు. అటు భూసేకరణ చట్టంలో సవరణలకు ఆమోదం పొందడం పెను సవాలేనని జైట్లీ పేర్కొన్నారు. కంపెనీల కష్టాలపై కమిటీ.. కొత్త కంపెనీల చట్టం సజావుగా అమలయ్యేలా చూసే దిశగా.. కార్పొరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ చెప్పారు. కంపెనీల చట్టంలో ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందటం తమ తక్షణ ప్రాధాన్యతాంశంగా ఆయన తెలిపారు. ఒక చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే దానికి సవరణలు కూడా చేయాల్సి రావడం చాలా అరుదంటూ.. గత ప్రభుత్వానికి చురకలు వేశారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణలు.. వివిధ కుంభకోణాల్లో పలువురు పరిశ్రమ దిగ్గజాలు, విధానకర్తలపై క్రిమినల్ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. -
‘పన్ను’ ఇరకాటం
నెల్లూరు, సిటీ: కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం.. అన్నట్టు తయారైంది కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు పరిస్థితి. పన్ను బకాయిల వసూళ్లకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకుల మధ్య నలిగిపోతున్నారు. పన్నుల వసూళ్లు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అధికారపార్టీ నాయకులు మాత్రం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు సహకరించిన వారి జోలికి వెళ్లద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని కార్పొరేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పనిచేసే బిల్కలెక్టర్లు సైతం పన్ను బకాయి వసూళ్లలో రెవెన్యూ అధికారులకు, ఇన్స్పెక్టర్లకు సహకరించట్లేదని తోటి సిబ్బంది వద్ద రెవెన్యూ అధికారులు తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకొస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు , తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 32 మంది బిల్కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్ మీదకు వచ్చినప్పటికీ ఆయా డివిజన్ల బిల్కలెక్టర్లు సమయానికి రాకపోవడం, అధికారుల చెప్పిన మాటను లెక్కచేయకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రూ.30 కోట్లకు పైగా బకాయిలు నగర పాలక సంస్థకు దాదాపు రూ.30 కోట్లకుపైగా వివిధ రూపాన పన్నులు రావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచే రూ.9 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా, వివిధ ప్రైవేటు సంస్థలు, ఇళ్ల పన్నుల రూపాన రూ. 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నారు. ఈ క్రమంలో కమిషనర్ చక్రధర్‌బాబు వారానికి రెండుసార్లు రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు రెవెన్యూ పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ అప్పుల్లో పూర్తిగా మునిగిపోయిందని, రావాల్సిన పన్నుల బకాయిలను తప్పనిసరిగా ఈ నెలాకరుకల్లా పూర్తిస్థాయిలో వసూళ్లు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో 60 శాతం పన్నులు వసూలు చేస్తుండగా ఈ ఏడాది 40 శాతం మాత్రమే పన్నులు వసూలు చేయడం గమనార్హం. రోజుకు రూ.50 లక్షలు నుంచి రూ.60 లక్షలు వరకు పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. పన్నుల వసూళ్ళు సరిగా లేకపోయినట్లయితే కఠినచర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఈ క్రమంలో విధుల మీదకు వెళ్లిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లకు రాజకీయ నాయకులు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత మనుషుల జోలికి రావద్దంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నేతల ఒత్తిడులకు భరించలేక, అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయలేక రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కమిషనర్ దృష్టిసారిస్తేనే కార్పొరేషన్‌కు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. -
రియాలిటీ బీబీఎంపీ స్వాధీనం
పేరుకుపోయిన రూ.10 కోట్లు పన్ను బకాయిలు చర్యలు చేపట్టిన పాలక వర్గం బెంగళూరు(బనశంకరి) : బన్నేరుఘట్ట రోడ్డులోని క్లాసిక్ రియాలిటీ మాల్‌ను బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) గురువారం స్వాధీనం చేసుకుంది. మాల్ నిర్వాహకులు ఏడేళ్లుగా బీబీఎంపీకి పన్ను ఎగవేస్తూ రావడంతో అదికాస్తా రూ.10.52కోట్ల మేర కు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో జరిమానాతో పాటు రూ. 20 కోట్లను పాలికెకు మాల్ నిర్వాహకులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై నిర్వాహకులకు బీబీఎంపీ నోటీసులు జారీ చేయడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే బకాయి పడ్డ పన్ను మొత్తంలో సగమైనా చెల్లించాలని ఇటీవల బీబీఎంపీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై కూడా నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణ, అధికారులు గురువారం మాల్ వద్దకు చేరుకుని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపి తాళం వేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విలేకరులతో స్వార్థపరులైన అధికారుల వైఖరి వల్ల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసును బీఎంటీఎఫ్కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. బీఎంటీఎప్ నివేదిక అందిన తరువాత తప్పుచేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, 5.73 లక్షల చదరపు అడుగుల్లో తొమ్మిది అంతస్తుల బృహత్ వాణిజ్యభవనాన్ని క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో ఒరాకల్ ఐటీసంస్ధ, షాపర్స్షాప్, పార్క్ అవెన్యూ, వస్త్రదుకాణంతో పాటు తొమ్మిది మల్టీనేషనల్ సంస్దలు వ్యాపార కేంద్రాలను నెలకొల్పాయి. -
పన్ను చెల్లించమంటే.. పళ్లూడగొట్టే యత్నం!
ఎచ్చెర్ల : కంచే చేను మేస్తోంది. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఐటీ శాఖకు చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టేందుకు దొడ్డిదారులు వెతుకుతోంది. బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన పన్ను బకాయిల నేపథ్యంలో ఐటీ శాఖ గోదాములను సీజ్ చేయడంతో.. ఆ గోదాములతో పని లేకుండా ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో నేరుగా మద్యం షాపులకు సరుకు సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రూ. 154 కోట్లు ఆదాయ పన్ను బకాయిపడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆదాయ పన్ను శాఖ నోటీ సులు చేయడంతోపాటు ఈ నెల రెండో తేదీన బేవరేజెస్ కార్పొరేషన్ గోదాములను సీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినందున ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని అందరూ భావించారు. అయితే కేంద్ర ఐటీ శాఖ పన్ను చెల్లించాల్సిందేనని పట్టుపడుతుండగా.. అంత మొత్తం చెల్లించలేక బేవరేజెస్ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఫలితంగా కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకు గత ఆరు రోజులుగా సరుకు సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్‌కు మంగళం? మద్యం కంపెనీల నుంచి వచ్చిన నిల్వలను స్వీకరించి జిల్లాలోని 157 మద్యం షాపులకు, 16 బార్లకు బేవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుండగా, మిగతా వ్యవహారాలన్నింటినీ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. పన్ను చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి అప్పులు తీర్చే బాధ్యత ఏపీ బేవరేజెస్‌కు అప్పగించి, దాన్ని అంచెలంచెలుగా ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఐదు నెలల నుంచి ఏపీ బేవరే జెస్ ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించకపోవడం ఇందులో భాగమేనని ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన్‌ను ఎత్తేవేసి ఎక్సైజ్ శాఖకు మొత్తం బాధ్యతలు అప్పగించటం, కేంద్ర ప్రభుత్వ టాక్స్‌ను సైతం ఎగ్గొట్టడం ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎచ్చెర్లలోని ఈ కార్పొరేషన్ గోదాం వద్ద మద్యం నిల్వలతో వచ్చిన 45 వరకు లారీలు అన్ లోడింగ్ కోసం కొన్ని రోజులుగా నిరీక్షిస్తున్నాయి. వీటిని వేరే చోటుకు తరలించి వైన్‌షాపులు, బార్లకు సరుకు తరలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేసే పనిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపు విషయాన్ని పట్టించుకోకుండా అడ్డదారిలో మద్యం ప్రయత్నాల్లో నిమగ్నమైంది. మరోవైపు కొద్దిరోజులుగా మద్యం సరఫరా నిలిచిపోవడాన్ని మద్యం షాపుల వారు సొమ్ము చేసుకుంటున్నారు. సరుకు లేదని చెప్పి ధరలు పెంచేశారు. క్వార్టర్ బాటిల్ ధరను 15 నుంచి 20 వరకు పెంచి అమ్ముతున్నారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే ఎక్సైజ్ అధికారులే అమ్మమంటున్నారని నిర్భీతిగా సమాధానం చెబుతున్నారు. ఒకపక్క ఏడు శాతం పెరిగిన రేటు.. మరోవైపు సరఫరా లేదన్న సాకుతో పెంచిన ధర.. వెరసి మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. దీనిపై ఎచ్చెర్ల బేవరేజెస్ డిపో మేనేజర్ కె.విక్టోరియారాణి మాట్లాడుతే గోదాం తెరిచే విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. మరోపక్క సరుకుతో వచ్చిన లారీల సిబ్బంది బేవరేజెస్ కార్పొరేషన్ గోదాం వద్ద కనీస సౌకర్యాలు గానీ, నిలువ నీడ గానీ లేక నానా అవస్థలు పడుతున్నారు. -
నగరం మహా ఆదాయం స్వాహా
కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి వసూల్ రాజాల హల్చల్ పేరుకుపోతున్న పన్ను బకాయిలు రాజమండ్రి : నగరంలో అన్ని వ్యాపారాలు నానాటికీ అభివృద్ధి చెందుతున్నాయి... రోజురోజుకీ కొత్త వ్యాపారాలు వచ్చి చేరుతున్నాయి. చిన్న ఇళ్లు భవనాలవుతుంటే, భవనాలు ఆకాశ హర్మ్యాలుగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో ప్రచార మాధ్యమాల హంగామా పెరుగుతోంది. ఎక్కడ చూసినా నగరంలో హోర్డింగులే కనిపిస్తున్నాయి. ఇలా నగరం మహానగరంగా మారుతున్నా, నగర పాలక సంస్థ ఆదాయం మాత్రం ఏ విభాగంలో చూసినా బక్కచిక్కిపోతోంది. కార్పొరేషన్ ఆదాయ వ్యయాల చిట్టా పరిశీలిస్తే గత మూడేళ్లలో నగరపాలకసంస్థ తిరోగమనంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. కీలక రంగాల్లో రూ.కోట్లల్లో ఉండాల్సిన పురోగతి రూ. లక్షలకు తగ్గిపోయింది. కొన్నింటిలో ఏకంగా తిరోగమనం కనిపిస్తోంది. ఇందుకు కారకులెవరు? అవకాశం ఉన్నా ఆదాయాన్ని రాబట్టుకోలేని దుస్థితికి దోహదం చేసిందెవరనే ప్రశ్నలు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్నాయి. అవినీతే అసలు విలన్ ఖజానాకు జమచేసే సొమ్ము కట్టక పోయినా ఫర్వాలేదు... మా జేబులు నింపితే చాలు అనే వైఖరి నగరపాలక సంస్థ కీలక విభాగాల్లోని పలువురు ఉద్యోగుల్లో పాతుకుపోయింది. ప్రధానంగా నగర ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో అవినీతి అంతర్భాగమైపోయింది. కాసులిస్తేనే తప్ప పనులు జరగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీ కార్పొరేటర్లే ఆరోపణలకు దిగుతుండడం ఇక్కడి వాస్తవ పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. నగరంలోని భవనాల స్థితిగతులకు, వాటికి విధిస్తున్న పన్నులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. భవనాలను విస్తరించుకున్న యజమానులు క్షేత్ర స్థాయి సిబ్బందితో సర్దుబాట్లు చేసుకుని పాత పన్నులే కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసులు ఆస్తిపన్ను ఖాతాల్లో సుమారు 20 శాతం మేర ఉంటాయని అంచనా. వీటిని సర్వే చేసి పన్నులను క్రమబద్ధీకరిస్తే ఆస్తిపన్ను పద్దు ఆదాయం 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. అలాగే నగరంలో భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. వాటి ద్వారా రావలసిన ఆదాయం కూడా అధికారిక లెక్కల్లో కనిపించకపోవడం పాలనావైఫల్యానికి అద్దం పడుతోంది. వసూళ్లలోనూ అలసత్వమే ! నగరానికి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. 2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా అధికారులు రూ. 24.04 కోట్లు నిర్ణయించారు. 2014-15లో తొలుత రూ. 26.20 కోట్ల వసూలు అంచనా వేయగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 22.87 కోట్లకు తగ్గిపోయింది. ఇందులో 40 శాతం కూడా వసూలు కాలేదు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆస్తిపన్ను బకాయిలు రూ. 26 కోట్లకు పైగా పేరుకు పోయాయి. వీటి వసూలులో సంబంధిత శాఖలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. నీటి పన్ను పరిశీలిస్తే 2014-15 అంచనా లక్ష్యం రూ. 3.20 కోట్లు కాగా సెప్టెంబర్ నాటికి రూ.1.08 కోట్లు వసూలైనట్టు లె క్కలు చూపుతున్నారు. నీటి పన్ను బకాయిలు రూ. 4.5 కోట్ల వరకూ పేరుకుపోయాయి. ఇతర విభాగాల వసూళ్లలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. చిక్కిపోతున్న అంచనాలు తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన రాబడి అంశాలు చూస్తే వసూలు కావలసిన బకాయిలను విస్మరిస్తున్నారని అనుమానం కలుగుతుంది. వసూలైన ఆదాయం ప్రకారం బడ్జెట్ అంచనాలు తయారు చేస్తున్నారా, లేక ఆదాయవనరుల ప్రాతిపదికన తయారు చేస్తున్నారా అనే సందేహం కలగక మానదు. రాబడి ఇలా.. అంశం 2013-14లో 2015-16 (రూ. కోట్లలో) ఆస్తి పన్ను 23.60 24.04 ప్రకటన పన్ను 1.52 1.50 వినోదపు పన్ను 2.62 1.50 (రూ.1.12కోట్లు తగ్గింది) ట్రేడ్ లెసైన్సులు 1.18 1.00 నీటి పన్ను 3.20 3.14 భవనాల లెసైన్స్ ఫీజు 1.66 1.50 వీటిలో ఆస్తిపన్ను ఆదాయంలో మూడేళ్లలో రూ. 44 లక్షల పెరుగుదల మాత్రమే చూపించారు. మిగిలిన పన్నుల ఆదాయం మూడేళ్లలో పెరగకపోగా తగ్గినట్టు చూపించారు. ఇంకా వివిధ విభాగాలకు చేసిన కేటాయింపులు కూడా నిర్ణీత నిష్పత్తి ప్రకారం కాకుండా అధికారుల సొంత అంచనాల ప్రకారం కేటాయించారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఇతర సభ్యులు విమర్శించారు. నగరం అన్ని రంగాల్లో పెరుగుతుంటే, ఆదాయం మాత్రం తగ్గడం ఎలా జరుగుతుందనే ప్రశ్న ఈ సందర్భంగా సర్వత్రా వినిపిస్తోంది.