పేరుకుపోయిన రూ.10 కోట్లు పన్ను బకాయిలు
చర్యలు చేపట్టిన పాలక వర్గం
బెంగళూరు(బనశంకరి) : బన్నేరుఘట్ట రోడ్డులోని క్లాసిక్ రియాలిటీ మాల్‌ను బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) గురువారం స్వాధీనం చేసుకుంది. మాల్ నిర్వాహకులు ఏడేళ్లుగా బీబీఎంపీకి పన్ను ఎగవేస్తూ రావడంతో అదికాస్తా రూ.10.52కోట్ల మేర కు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో జరిమానాతో పాటు రూ. 20 కోట్లను పాలికెకు మాల్ నిర్వాహకులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై నిర్వాహకులకు బీబీఎంపీ నోటీసులు జారీ చేయడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే బకాయి పడ్డ పన్ను మొత్తంలో సగమైనా చెల్లించాలని ఇటీవల బీబీఎంపీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై కూడా నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు.
దీంతో బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణ, అధికారులు గురువారం మాల్ వద్దకు చేరుకుని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపి తాళం వేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విలేకరులతో స్వార్థపరులైన అధికారుల వైఖరి వల్ల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసును బీఎంటీఎఫ్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. బీఎంటీఎప్ నివేదిక అందిన తరువాత తప్పుచేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, 5.73 లక్షల చదరపు అడుగుల్లో తొమ్మిది అంతస్తుల బృహత్ వాణిజ్యభవనాన్ని క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో ఒరాకల్ ఐటీసంస్ధ, షాపర్స్‌షాప్, పార్క్ అవెన్యూ, వస్త్రదుకాణంతో పాటు తొమ్మిది మల్టీనేషనల్ సంస్దలు వ్యాపార కేంద్రాలను నెలకొల్పాయి.
రియాలిటీ బీబీఎంపీ స్వాధీనం
Published Fri, Mar 13 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement