పన్ను వసూళ్లలో కఠిన వైఖరులు వద్దు
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు
న్యూఢిల్లీ: పన్నుల బకాయిలు రాబట్టడంలో బలవంతంగా, కఠినంగా ఉండే విధానాలను ప్రయోగించకుండా ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. వివాదాల పరిష్కారానికి ఇతరత్రా మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని పేర్కొంది. వ్యాపారాల నిర్వహణ సరళతరం చేసే అంశంపై రూపొందించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (వాణిజ్య శాఖ) ఈ మేరకు పలు సూచనలు చేసింది.
వొడాఫోన్, షెల్ వంటి బహుళజాతి కంపెనీలతో పన్ను వివాదాల్లో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ప్రతికూలంగా తీర్పు రావడం తదితర అంశాలు అంతిమంగా పన్నుల విషయంలో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చాయని కమిటీ పేర్కొంది. ఇక, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్‌పై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వివాదం ప్రతిష్టను మరింత మసకబార్చిందని తెలిపింది.
ప్రస్తుత ట్యాక్సేషన్ విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే... ఇది స్థిరంగా, అనూహ్య మార్పులకు లోను కాని విధంగా ఉండాలని కమిటీ సూచించింది.