నెల్లూరు, సిటీ: కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం.. అన్నట్టు తయారైంది కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు పరిస్థితి. పన్ను బకాయిల వసూళ్లకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకుల మధ్య నలిగిపోతున్నారు. పన్నుల వసూళ్లు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అధికారపార్టీ నాయకులు మాత్రం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు సహకరించిన వారి జోలికి వెళ్లద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని కార్పొరేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పనిచేసే బిల్‌కలెక్టర్లు సైతం పన్ను బకాయి వసూళ్లలో రెవెన్యూ అధికారులకు, ఇన్‌స్పెక్టర్లకు సహకరించట్లేదని తోటి సిబ్బంది వద్ద రెవెన్యూ అధికారులు తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకొస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు , తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, 32 మంది బిల్‌కలెక్టర్‌లు ఉన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఫీల్డ్ మీదకు వచ్చినప్పటికీ ఆయా డివిజన్‌ల బిల్‌కలెక్టర్లు సమయానికి రాకపోవడం, అధికారుల చెప్పిన మాటను లెక్కచేయకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
రూ.30 కోట్లకు పైగా బకాయిలు
నగర పాలక సంస్థకు దాదాపు రూ.30 కోట్లకుపైగా వివిధ రూపాన పన్నులు రావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచే రూ.9 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా, వివిధ ప్రైవేటు సంస్థలు, ఇళ్ల పన్నుల రూపాన రూ. 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నారు. ఈ క్రమంలో కమిషనర్ చక్రధర్‌బాబు వారానికి రెండుసార్లు రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు రెవెన్యూ పనితీరుపై ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే కార్పొరేషన్ అప్పుల్లో పూర్తిగా మునిగిపోయిందని, రావాల్సిన పన్నుల బకాయిలను తప్పనిసరిగా ఈ నెలాకరుకల్లా పూర్తిస్థాయిలో వసూళ్లు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో 60 శాతం పన్నులు వసూలు చేస్తుండగా ఈ ఏడాది 40 శాతం మాత్రమే పన్నులు వసూలు చేయడం గమనార్హం. రోజుకు రూ.50 లక్షలు నుంచి రూ.60 లక్షలు వరకు పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. పన్నుల వసూళ్ళు సరిగా లేకపోయినట్లయితే కఠినచర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు.
ఈ క్రమంలో విధుల మీదకు వెళ్లిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లకు రాజకీయ నాయకులు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత మనుషుల జోలికి రావద్దంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నేతల ఒత్తిడులకు భరించలేక, అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయలేక రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కమిషనర్ దృష్టిసారిస్తేనే కార్పొరేషన్‌కు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది.
‘పన్ను’ ఇరకాటం
Published Tue, Mar 17 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement