సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం
తమ వాళ్లు తప్ప ఇతరులెవరూ పోటీ చేయకూడదని హుకుం
తాము చెప్పిన వాళ్లే ఎన్నికయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశం
వారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన అధికార గణం
బలవంతపు ఏకగ్రీవాలు.. పచ్చ నేతలే ఎన్నికైనట్లు ప్రకటనలు
అక్కడక్కడ పోటీ చేసిన వారికి వేధింపులు.. నామినేషన్ పత్రాల చింపివేత
ఓటర్లను లోపలికి అనుమతించకుండా దౌర్జన్యం
ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసుల ప్రతాపం
సర్కారు దమన కాండకు నిరసనగా ఈ ఎన్నికలను ముందే బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదు
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడి గ్రామంలోని శ్రీముకికృష్ణంరాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. కూటమి మితృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయకట్టుకు చెందిన గొలజాం బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయనను నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెను వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బరితెగించింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ దౌర్జన్యకాండకు దిగింది. రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాష్ట్రంలో సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను చేజిక్కించుకోవడానికి అరాచకాలకు తెరలేపింది.
రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇతర పార్టీల మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దుర్నీతికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. దీంతో అధికార కూటమి నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది.
జి.పెదపూడిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు
డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి సాగునీటి సంఘం ఎన్నికలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించిన అభ్యర్థిని రైతులు వ్యతిరేకించి.. సూర్య వెంకట కృష్ణారావును గెలిపించుకున్నారు.
ఎటు చూసినా అరాచకమే..
⇒ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని మాపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
⇒ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు.
⇒ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు.
నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా..
‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు.
పార్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సీసీఎస్ సీఐ ఇబ్రహీం
ఇది చేతకాని దద్దమ్మ రాజకీయం
నిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి
కడప (కార్పొరేషన్)/పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి అప్రజాస్వామ్యంగా జరిగాయని, ప్రభుత్వం చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రెండు, మూడు రోజులుగా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. రైతులెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. నీటి బకాయిలు లేనట్టు వీఆర్వో నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అని, ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన వీఆర్వోలందరినీ మండల కార్యాలయాలకు తరలించి జైల్లో ఖైదీల్లా బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు బీటెక్ రవికి చొక్కా, ప్యాంటు విప్పి నిలబెట్టేవారని హెచ్చరించారు.
పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం, తెగువ వారికి ఉన్నాయా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టే చేతగాని దద్దమ్మలు ఎవరో అందరికీ తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం సిగ్గు చేటన్నారు.
‘1978 నుంచి ఉన్న మా ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాడట. ఓసారి మొహం అద్దంలో చూసుకో. జమ్మలమడుగులో వీఆర్వోలందరినీ వాహనంలో ఎక్కించి దేవగుడిలో బంధించారు. ఓడిపోతామనే భయం వల్లే కదా? వీటికి ఎన్నికలని పేరుపెట్టి గెలుపు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి’ అని రవిపై ధ్వజమెత్తారు. కాగా, ఎంపీ అవినాశ్‌రెడ్డిని శనివారం (రెండో రోజు) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment