బూచిగా అప్పుల భూతం.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Mohan Reddy Fires On Chandrababu Govt Budget | Sakshi
Sakshi News home page

బూచిగా అప్పుల భూతం.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం: వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 14 2024 4:30 AM | Last Updated on Thu, Nov 14 2024 4:33 AM

YSRCP President YS Jagan Mohan Reddy Fires On Chandrababu Govt Budget

రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం బడ్జెట్‌ సాక్షిగా బట్టబయలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

సూపర్‌ 6, సూపర్‌ 7లను తెరమరుగు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం  

అప్పులు రూ.14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు

అప్పులు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారు 

2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేల్చారు

మీ ఐదేళ్లలో అప్పుల వార్షిక సగటు వృద్ధి రేటు 23.63% ఉంటే మా హయాంలో 13.57 శాతమే.. 

మరి ఇప్పుడు చెప్పండి.. అప్పుల రత్న బిరుదు ఎవరికివ్వాలి?

ఈ బడ్జెట్‌ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్‌లా ఉంది

హామీలు నెరవేర్చ లేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విష ప్రచారం

బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా అదే గోబెల్స్‌ ప్రచారం

రూ.42,183.80 కోట్ల బకాయిలు మేము చెల్లించాం

‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్‌ సిక్స్‌.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్‌ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్‌లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్‌ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్‌ చేస్తారో చూద్దాం. అరెస్ట్‌ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.
– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సవాల్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్‌ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 

రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్‌ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. 

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ముందు గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకాఏమన్నారంటే..

ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్‌ ప్రవేశపెట్టడమా? 
ఈ బడ్జెట్‌ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్‌లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్‌ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. 

⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్‌ సిక్స్‌ ఏమైంది.. సూపర్‌ సెవెన్‌ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్‌ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.

చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కు ఆధారాలు ఇవిగో..
05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్‌మెంట్‌. ‘ఈనాడు’లో బ్యానర్‌ కథనం 
13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్‌మెంట్‌ 
19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 
17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌  
21–07–22 :  ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ స్టేట్‌మెంట్‌
17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్‌ 
25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్‌మెంట్‌

⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్‌ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్‌ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.

⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్‌ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్‌మెంట్‌. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్‌ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. 
ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.

మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి
⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.

⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్‌ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్‌ చేస్తున్నాడు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను.  

రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం
⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్‌లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్‌లో అప్పులు చేయాలో ఎఫ్‌ఆర్‌బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.

⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్‌ ముఖారవిందం చూసో ఏ  బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.

అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే
⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్‌ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.

⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్‌ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.

బడ్జెట్‌ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు
⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. 

⇒ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?

అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?
⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్‌ కాంపౌండ్‌ గ్రోత్‌ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. 

అంటే  అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.

⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్‌ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014­లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్‌ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి  రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్‌ సెక్టార్, డిస్కమ్‌లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్‌లు కాపాడేందుకు, పబ్లిక్‌ సెక్టార్, నాన్‌ గ్యారంటీడ్‌ లయబులిటీస్‌ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. 

⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్‌ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్‌ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement