హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Naidu And Pawan Kalyan Over Kasinayana Temple Demolition With Proofs, Watch Speech Highlights | Sakshi
Sakshi News home page

YS Jagan On Kutami Govt: హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?

Published Fri, Mar 28 2025 5:10 AM | Last Updated on Fri, Mar 28 2025 9:58 AM

YSRCP President YS Jagan Fires On CM Chandrababu Naidu and Deputy CM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

ఆలయాలపై దాడులు చేసేది వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే

ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేదీ వీళ్లే 

ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు 

కాశినాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్లే 

వాళ్ల చేతులతోనే కూల్చేసి.. వాతలు పెట్టారు.. ఇప్పుడు వెన్నపూసిన మాదిరిగా మాటలు చెబుతున్నారు 

మా ఐదేళ్ల పాలనలో ఆ క్షేత్రాన్ని పరిరక్షించాం 

కేంద్ర అటవీ శాఖ మంత్రికి సీఎం హోదాలో నేనే లేఖ రాశా  

మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది 

ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.. 

‘ఎక్స్‌’లో ఆధారాలను ట్యాగ్‌ చేస్తూ సమాధానం చెప్పాలని నిలదీత

ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? 
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చి­వేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకు­పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణా­లకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చి­వేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. 

ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«­దానం’ అని సీఎం చంద్ర­బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? 
నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?


మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం  
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. 

కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని  రిజర్వ్‌ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటి­స్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నా­లతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.  

ఇవిగో ఆధారాలు

07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ  

18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖ  
 

అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు  
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్‌ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?
1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ  

వీళ్ల తీరే అంత..  
వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement