సూపర్‌ 6కు గుండు సున్నా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Govt Over Frauds And Budget Allocations, More Details Inside | Sakshi
Sakshi News home page

సూపర్‌ 6కు గుండు సున్నా: వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 6 2025 3:55 AM | Last Updated on Thu, Mar 6 2025 9:13 AM

YS Jagan Fires On Chandrababu govt frauds and budget allocations

చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్‌ కేటాయింపులపై వైఎస్‌ జగన్‌ ధ్వజం 

రెండు బడ్జెట్లు పెట్టినా హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా?

నిరుద్యోగులకు ఏడాదికి రూ.36 వేల చొప్పున భృతి.. 

ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి రూ.18 వేలు.. ఉచిత బస్సు హామీలను పూర్తిగా ఎగ్గొట్టావ్‌  

తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. దీపం పథకాలకు కోతలు.. అరకొర కేటాయింపులే 

పెన్షన్లకు బడ్జెట్‌లో రూ.5,000 కోట్ల మేర కోత.. ఇప్పటికే రూ.4 లక్షల పింఛన్లు ఎత్తివేత 

సూపర్‌ సిక్స్‌ హామీలకు ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం.. బడ్జెట్‌లో ఇచ్చింది రూ.17,179 కోట్లే  

‘‘వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏ పథకాలూ ఇవ్వొద్దు.. ఏ పనులూ చేయొద్దు..’’ అని ఎలా చెబుతారు? 

ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? 

బాబు వ్యాఖ్యలపై గవర్నర్, జడ్జీలు ఆలోచించాలి

సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లను గమనిస్తే అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు అన్ని రకాలుగా చేసిన మోసం ప్రస్ఫు­టంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. అన్నది తేటతెల్లమవుతోంది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు రూ.7,282 కోట్లే కేటాయించారు. 

అందు­లోనూ కేవలం రూ.865 కోట్లు మాత్రమే వ్యయం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. 2025–26 బడ్జెట్లో సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించి ఎంతమందికి కోతలు విధిస్తారు? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాగ్‌ నివేదిక, బడ్జెట్‌ డాక్యుమెంట్లు, యూడీఐఎస్‌ఈ, పెట్రోలియం శాఖ నివేదికలు, సామాజిక ఆర్థిక సర్వే, గణాంకాలు, ఆధారాలతో చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. 

‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సొంత ఆదాయం తగ్గింది. మూలధన వ్యయం కూడా దారుణంగా పడిపోయింది. కానీ.. జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 12.94 శాతం నమోదు అయ్యిందని చంద్ర­బాబు చెబుతున్నాడు. రాష్ట్ర సొంత ఆదా­యం తగ్గితే జీఎస్‌డీపీ పెరగడం ఎలా సాధ్యం?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఏడాది రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీ కాదా? అంటూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

భృతి లేదు.. ఉద్యోగాలు లేవు
యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌లో హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున 20 లక్షల మందికి ఏడాదికి రూ.7,200 కోట్లు అవసరం. గతేడాది బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. పోనీ ఈ ఏడాది బడ్జెట్‌లోనైనా ఉందా అంటే అదీ లేదు. 

అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన గవర్నర్‌ ప్రసంగం తెలుగు ప్రతుల్లో తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని స్పష్టంగా ముద్రించారు. (గవర్నర్‌ ప్రసంగం ప్రతిని చదివి వినిపించారు) ‘ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది’ అని అందులో స్పష్టంగా ఉంది. ఈ మోసాలు ఇంతటితో ఆగలేదు. 

అసెంబ్లీలో విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఎంఎస్‌ఎంఈల రంగంలో 2024–25కి సంబంధించి 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపకుండా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పడం పచ్చి మోసం. చంద్రబాబు నిరుద్యోగులకు గతేడాది రూ.36 వేలు చొప్పున ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా మరో రూ.36 వేలు చొప్పున ఎగనామం పెడుతున్నారు. ప్రతీ నిరుద్యోగికి రూ.72వేలు బకాయి పెట్టి మోసం, దగా, వంచన చేశారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలూ లేవు. ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు.

ఆధార్‌ కార్డులతో సహా చెబుతాం...
వైఎస్సార్‌సీపీ హయాంలో తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను గ్రామ, వార్డు, సచివాలయాల్లో కల్పించాం. మరో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించాం. ఆప్కాస్‌ ద్వారా 96 వేల ఉద్యోగాలు కల్పించాం. పే స్లిప్‌లు, ఆధార్‌ నంబర్లతో సహా ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్పగలుగుతాం. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగులకు మేలు చేశాం. 

కాంట్రాక్టు, గవర్నమెంట్‌ ఉద్యోగాలన్నీ కలిపితే వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లలో 6,31,310 మందికి ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు సర్కారు తొలి బడ్జెట్‌ సందర్భంగా విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో కూడా లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ (భారీ పరిశ్రమలు)లో 1.02 లక్షల మందికి, ఎంఎస్‌ఎంఈ రంగంలో 32,79,970 మందికి  వైఎస్సార్‌సీపీ పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. 

గవర్నమెంట్, లార్జ్‌ అండ్‌ మెగా, ఎంఎంఎస్‌ఈ రంగాలలో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మేం ఆధార్‌ కార్డులతో సహా చెప్పగలుగుతాం. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ  ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తోందో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

అదేమైనా బాబు సొమ్మా..?
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో.. అందరూ చూస్తుండగా బహిరంగ సభలో.. ‘వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏ పథకాలూ ఇవ్వొద్దు.. ఏ పనులూ చేయొద్దు..’ అని చంద్రబాబు మాట్లాడారు. అసలు ఇవ్వడానికి... ఇవ్వకపోవడానికి ఇది బాబు గారి సొమ్మా? ప్రభుత్వానికి చంద్రబాబు కేవలం ధర్మకర్త (కస్టోడియన్‌) మాత్రమే. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం... ప్రజల సొమ్ముతో నడుస్తోంది. 

ఇదే పెద్దమనిషి.. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాడు. ఇప్పుడిలా బాహాటంగా, బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాటలు, నా మాటలను వింటున్న జడ్జీలు, గవర్నర్‌ ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?
 - వైఎస్‌ జగన్‌

 

పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు..
చంద్రబాబు ఉద్యోగాలను కల్పించకపోగా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తున్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన సజ్జన్‌ జిందాల్‌ను బెదరగొట్టి పంపేశారు. అరవిందో వాళ్లను బెదిరించి పంపుతున్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు భయపడే పరిస్థితి తెచ్చారు.  

అన్నదాత సుఖీభవ.. ద్రోహం..
వైఎస్‌ జగన్‌ రైతు భరోసా కింద పీఎం కిసాన్‌ కలిపి ఇస్తున్నారని, తాను పీఎం కిసాన్‌ కాకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోనూ నమ్మబలికారు. అన్నదాతా సుఖీభవ కింద 53,58,266 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రూ.10,717 కోట్లు కేటాయించాలి. 

తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రెండో బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించారు. ఎలాగూ ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు..! మోసం చేయడమే..! అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు! ఇప్పటికే ప్రతీ రైతుకు రూ.20 వేలు బాకీ పడ్డారు. రెండో ఏడాది మరో రూ.20 వేలు అంటే మొత్తం రూ.40 వేలు ఎగనామం పెట్టాడు, బాకీ పెట్టాడు. 

అయినా మోసాలు చంద్రబాబుకు కొత్తకాదు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తానని హామీ ఇచ్చి దగా చేశారు. వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చి, నాడు ఎలా ఓడిపోయాడో చూశాం. మళ్లీ ఈరోజు అదే పద్ధతిలో రైతులను మోసగిస్తున్నారు.

వెలగని ‘దీపం’..  
రాష్ట్రంలో 1.59 కోట్ల యాక్టివ్‌ డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్‌లున్నాయి. వీళ్లందరికి దీపం పథకం కింద 3 సిలెండర్లు ఇవ్వాలంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరం. తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.865 కోట్లే కేటాయించారు. అంటే మూడు సిలెండర్లు ఒక సిలెండర్‌కు తీసుకొచ్చారు. పోనీ అందరికి ఇచ్చాడా అంటే అదీ లేదు. ఇక ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఎగరగొట్టేదే కాబట్టి నామ్‌కే వాస్తేగా చేస్తున్నారు.

50 ఏళ్లకే పెన్షన్‌ పేరుతో మోసం..
చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్‌! నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అన్నారు. వారికి పింఛన్‌ ఇవ్వాలంటే లబ్ధిదారులు మరో 20 లక్షలు అదనంగా పెరుగుతారు. 20 లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు రూ.4వేల చొప్పున లెక్కిస్తే ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి. 

తొలి ఏడాది రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాదీ కూడా అంతే. 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు గతేడాది రూ.48 వేలు ఎగనామం పెట్టాడు. ఈ ఏడాది మరో రూ.48 వేలు ఎగనామం పెట్టారు. అంటే రూ.96 వేల చొప్పున ఎగ్గొట్టడం ఈ పథకం పేరుతో జరిగిన మోసం!

పెన్షన్ల బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కోత..
మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఎన్నికల కోడ్‌ నాటికి 66,34,372 పెన్షన్లు ఉంటే ఈరోజు చంద్రబాబు పాలనలో ఏకంగా 62,10,969కి తగ్గిపోయాయి. ఈ పది నెలల కాలంలో 4,23,403 ఫించన్లు కోత పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. 62,10,969 పెన్షన్లకే రూ.32 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.27 వేల కోట్లు మాత్రమే కేటాయించి, రూ.5వేల కోట్లు కోత వేశారు. పెన్షన్‌ కేటాయింపులు పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉన్నాయి.

చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలే
గవర్నర్‌ ప్రసంగం.. బడ్జెట్‌పై చర్చ.. ఏది చూసినా పరనింద, ఆత్మస్తుతి కనిపిస్తాయి. రెండో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఇంకా జగన్‌ ఇట్టా.. జగన్‌ అట్టా.. అంటూ విమర్శలే గానీ సూపర్‌ సిక్స్‌ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల విషయం ఏమిటన్నది మాత్రం చెప్పరు. మొదటి ఏడాది బడ్జెట్‌లోనూ అరకొరే. కేటాయింపులకు పరిమితం. ఇచ్చిందెంత? అని చూస్తే బోడి సున్నా కనిపిస్తుంది. రెండో బడ్జెట్‌లోనూ అంతే. చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలే. 
-వైఎస్‌ జగన్‌

ఆడబిడ్డ నిధికి శూన్యం..ప్రతి మహిళకూ రూ.36 వేలు బాకీ
ఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ పథకం లబ్ధిదారు­లను తేల్చడానికి రాకెట్‌ సైన్స్‌ పరిజ్ఞానం అవసరం లేదు. ఓటర్ల జాబితా మన కళ్లెదుటే ఉంది. 2.07 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు. వీరంతా 18 ఏళ్లు నిండిన వాళ్లే. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇవ్వాలంటే రూ.32,400 కోట్ల కేటాయింపులు చేయాలి. గతేడాది బడ్జెట్‌లో కేటాయింపులు సున్నా. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ కేటాయింపులు సున్నా. అంటే ప్రతీ మహిళకు చంద్రబాబు రూ.36 వేలు ఎగ్గొట్టారు, బాకీ పడ్డారు!

మహిళలు అంతా ఎదురు చూస్తున్నారు
మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సూపర్‌ సిక్స్‌లో హామీ ఇచ్చారు. రాయలసీమలో మహిళలు అంతా ఎదురు చూస్తున్నారు..! విశాఖపట్నం వెళ్లి చూసి రావచ్చు కదా..! బాగుంటుందని! కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల మహిళలూ ఎదురు చూస్తు­న్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా.. అని ఎదురు చూస్తున్నారు! 

అమరావతి కడుతున్నాడు కదా..! ఎలా కడుతున్నాడో చూసి రావచ్చు కదా అని! ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు కదా..! విహార యాత్రలకు వెళ్లి రావచ్చు అని ఎదురు చూస్తున్నారు! ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు తన నైజాన్ని చాటుకుంటున్నారు. తొలి ఏడాది ఎగరగొ­ట్టేశారు. ఈ ఏడాదీ ఎగనామమే! ఉచిత బస్సు పేరుతో గత ఏడాది రూ.3,500 కోట్ల మేర మహిళలకు ఎగ్గొట్టారు! ఈ ఏడాది మరో రూ.3,500 కోట్లు కేటాయించ లేదు. ఉచిత బస్సు పుణ్యమాని మహిళలకు ఇప్పటికి రూ.7,000 కోట్లు బకాయి పెట్టారు.

తల్లికి వందనం.. దగా..
స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తానన్నాడు. ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళితే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానన్నాడు. ఆ పథకానికి తల్లికి వందనం అనే పేరు కూడా పెట్టాడు. ఎన్నికలప్పుడు చెప్పాడు. సూపర్‌ సిక్స్‌లో, మేనిఫెస్టోలో పెట్టాడు. 

తొలి బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో  పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్‌ డాక్యుమెంట్‌ డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌లో రూ.8,278 కోట్లు కేటాయించినట్లు కనిపిస్తోంది. పిల్లల సంఖ్యపై కలెక్టర్లు పంపిన సమాచారాన్ని ‘యూడీఐఎస్‌ఈ’ వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. 

జిల్లా పరిధిలో స్కూళ్లు, ఎంతమంది చదువుతున్నారో అందులో స్పష్టంగా ఉంటుంది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 12వ తరగతి వరకు 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి. కానీ.. చంద్రబాబు తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.5,386 కోట్లు కేటాయించారు. 

అది కూడా ఇవ్వకుండా ఎగనామమే. రెండో బడ్జెట్‌లోనూ రూ.13,112 కోట్లు ఎక్కడా కనపడదు. ఈ ఒక్క పథకం కిందే ప్రతి పిల్లవాడికి చంద్రబాబు రూ.15 వేలు బాకీ పడ్డారు, ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కూడా కలిపితే రూ.30 వేలు బాకీ పడినట్లు అవుతుంది. చిన్న పిల్లలను సైతం చంద్రబాబు వదిలి పెట్టడం లేదు.

సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు మొత్తంగా ఎంత అవుతుందని లెక్కేసి చూస్తే.. ఏడాదికి రూ.79,867 కోట్లు కేటాయించాలి. కానీ గతేడాది బడ్జెట్‌లో రూ.7,282 కోట్లే  కేటాయించారు. 

అందులోనూ కేవలం రూ.865 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.17,179 కోట్లే కేటాయించారు. 
అది కూడా ఎలాగూ మోసం చేయడం అనే పద్ధతిలో జరుగుతోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అనేందుకు ఇదే నిదర్శనం. 
– వైఎస్‌ జగన్‌

పలావ్‌ పోయింది.. బిర్యానీ ఓ మోసం!

సూపర్‌సిక్స్‌ కాకుండా చంద్రబాబు ఇచ్చిన మిగిలిన 143 హామీల పరిస్థితి చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పెన్షన్‌ కట్‌..! వలంటీర్లకు రూ.10 వేలు జీతం దేవుడెరుగు ఉద్యోగాలు కట్‌..! పది నెలలు గడిచినా పెట్రోల్, డీజీల్‌ ధరల తగ్గింపు లేదు. చంద్రన్న బీమా గాలికి పోయింది. డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ రుణాలకు బోడి సున్నా..! ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్‌ ఉన్న టిప్పర్‌ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల సాయం హామీని ఎగ్గొట్టారు. జగన్‌ వాహన మిత్రకు పోటీగా ఈ హామీని ఇచ్చారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ ఓ మోసంగా తయారైంది! ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు ఒక్కరికీ ఇవ్వలేదు. ఇంకా ఎన్నో హామీలిచ్చాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement