క్షేత్ర స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టంగా నిర్మిద్దాం
4 నెలల్లోనే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో వైఎస్ జగన్
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలో పటిష్ట నిర్మాణం
గ్రామ, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల ఏర్పాటు.. మహిళలకు ప్రాధాన్యత
ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా బలోపేతం
మన కార్యకర్తలు తలెత్తుకుని తిరిగేలా మనం ప్రజలకు మంచి చేశాం
ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేక వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితి
శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా వైఫల్యం.. అన్ని రంగాల్లోనూ స్కామ్‌లే
విలువలు, విశ్వసనీయతే మన బలం.. చెడిపోయిన వ్యవస్థపై యుద్ధం చేస్తున్నాం
మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదు.
– వైఎస్ జగన్
ఇసుక ధర రెట్టింపు.. మద్యం టెండర్లలో దారుణాలు.. యథేచ్ఛగా పేకాట క్లబ్‌లు
ఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మనం సిద్ధం కావాలి
ఎప్పటికప్పుడు నివేదికలతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు, ప్రమోషన్లు
సాక్షి, అమరావతి: గ్రామ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత వ్యవస్థీకృతంగా నిర్మించడం ద్వారా దేశంలోనే బలమైన పార్టీగా నిలుపుదామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లు అవుతోందని, ఈ సమయంలో వివిధ రకాల ఎన్నికలు చూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నామని.. అధికారంలోనూ ఉన్నామని.. స్థానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు.
మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, గ్రామ స్థాయి నుంచి ప్రతి అడుగులోనూ పార్టీ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుందని, అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శక్తివంతంగా ఉంటామని ఉద్బోధించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగినంత సమయం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుందామని కోరారు.
శాసససభ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దామని జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
గ్రామ, బూత్ కమిటీలతో మరింత బలోపేతం
⇒ ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా, విద్యార్థి విభాగాలతో పాటు విలేజ్ కమిటీ, బూత్ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి.
⇒ ఈ కమిటీల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. కాకపోతే వీరందరినీ నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. అప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామ స్థాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలగాలి.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు
మన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా
⇒ ఇవాళ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరైనా సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలోనే సరికొత్త అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం.
⇒ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసే వాళ్లం. నేరుగా బటన్ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పథకాలు అందించింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? వాళ్లు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. విలువలు, విశ్వసనీయత అన్నది ముఖ్యం. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది?
ప్రజల్లో ఆలోచన మొదలైంది
⇒ వైఎస్సార్‌సీపీ, జగన్ వల్ల జరిగిన మంచి ఏమిటి.. అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. జగన్ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది.. బిర్యానీ లేదు.. అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా?
⇒ టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం.
4 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత
⇒ మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. వాళ్లు ఎవరి ఇంటికైనా వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింతగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి.
⇒ మూడు త్రైమాసికాలు వచ్చినా, విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. సీబీఎస్‌ఈ లేదు. టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు కనీస మద్దతు దక్కని పరిస్థితి.
⇒ ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలూ నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళలకు భద్రత సున్నా. దిశ యాప్ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్థితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు. రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. విధి నిర్వహణ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.
ఇసుక ఉచితం అంటూ టెండర్లేంటి?
⇒ ఇసుక ఉచితం అంటూ రెండు రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడంతోపాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో ధరలు ఇచ్చే వాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత కట్టుదిట్టంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్ యార్డులు, రీచ్‌ల్లోని ఇసుకను అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి.
⇒ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ తీసేసి, టైమింగ్స్ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉచిత వాటాలు అడుగుతూ బెదిరింపులకు దిగుతున్నారు.
ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ మధ్య తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం. నేను చెప్పే ఈ మాటలు ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. కానీ విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తెచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు.
ఎన్నికలప్పుడు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు (అమ్మ ఒడి), ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు (నెలకు రూ.1,500), వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు (నెలకు రూ.1,500), 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు (బీసీలకు 50 ఏళ్లకే పింఛన్), ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు (నిరుద్యోగ భృతి), అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు (రైతు భరోసా) అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత.. అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాటి మాటేంటి?
గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం వ్యవస్థీకృతం(ఆర్గనైజ్డ్)గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీ సభ్యులు మన వాళ్లే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మరింత బలంగా ఉండాలి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి
⇒ ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నుంచి గ్రామ స్థాయి లీడర్ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, టీడీపీ తప్పుడు సోషల్ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే మనం మరింత బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి.
⇒ నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు చూపించగలగాలి. రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామ స్థాయికి వెళ్లాలి. ఇది సవాల్‌తో కూడిన కార్యక్రమం. ఇది చేయగలిగే వ్యవస్థ మనకుంది. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. వైఎస్సార్‌సీపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయాలి.
స్కామ్‌లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచిస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్, ట్రిపుల్ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు రావడంతో పాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది.
ఈ ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు? అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్ రూమ్స్ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా.. ప్రభుత్వ పెద్దలకు, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.
నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా.. అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెబుతారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్లు చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మాటేమిటి? సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది.
ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు.
ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో అప్పుడే గ్రామ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం.
చీకటి తర్వాత వెలుగు సహజం
పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో నిర్వర్తిస్తే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మంది ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అనేది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి.
మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం వేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి. కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్థాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం.
దాని అర్థం అన్యాయం జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లో, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకోండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్థిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి.
పనితీరు ఆధారంగా ప్రమోషన్లు
జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీ మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. మనం అధికారంలోకి రాగానే మీలో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది.
మీ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, పర్యవేక్షణ ఉంటుంది. రీజినల్ జనరల్ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్ ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment