
పల్నాడు జిల్లా పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన ప్రజల గోడు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
మాచవరం మండలం పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా
సాక్షి అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్‌ను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు.
మాచవరం మండలం పిన్నెల్లి, తురకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై, ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు.
ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.
‘అధైర్యపడొద్దు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం..’ అని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వచ్చే రెండు నెలల్లో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.గురజాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
దహన సంస్కారాలకూ నోచుకోని దుస్థితి
టీడీపీ శ్రేణుల దురాగతాలతో గ్రామం విడిచి వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా కుటుంబ సభ్యుడు మృతి చెందినా స్వగ్రామానికి వెళ్లే పరిస్థితి లేక మేం తలదాచుకుంటున్న ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తి చేశాం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియడం లేదు. మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నా.
– అమరావతి హసన్ (బుజ్జి), పిన్నెల్లి, వైఎస్సార్‌సీపీ నాయకుడు

మహిళలపైనా దాడులు..
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల నివాసాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను సైతం దౌర్జన్యంగా లాక్కొచ్చి దాడి చేశారు. టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయాం. బంధువుల నివాసాల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి.
– రత్తయ్య, కొత్తగణేశునిపాడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు
ఆర్థికంగా నష్టపోయాం
టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పొలాలు సాగు చేసుకోలేక నష్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలి.
– పిక్కిలి కొండలు, పిన్నెల్లి గ్రామం, వైఎస్సార్‌సీపీ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment